ఊరికి కొత్తరూపు

Tue,September 17, 2019 02:57 AM

-30 రోజుల కార్యాచరణతో మెరుస్తున్న పల్లెలు
-రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు
-పలు జిల్లాల్లో వార్షిక ప్రణాళికలకు సన్నద్ధం
-హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 30 రోజుల ప్రణాళిక కార్యాచరణతో గ్రామాలు కొత్తరూపును సంతరించుకొంటున్నాయి. 11 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలతో పల్లెలు మెరుస్తున్నాయి. జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా తట్టాపార చేతబట్టి పనులు చేస్తుండటం స్ఫూర్తినిస్తుండగా, ప్రజలు శ్రమదాన కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో అభివృద్ధి పనులు కొలిక్కిరావడంతో వార్షిక ప్రణాళిక తయారీలో అధికారులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు బిజీబిజీగా ఉన్నారు. సోమవారం పలు జిల్లాల్లో కలెక్టర్లు, ఉన్నతాధికారులు, సర్పంచులు, నాయకులు శ్రమదానాలు చేయగా, తమ గ్రామాలు పరిశుభ్రంగా మారుతుండటంతో సబ్బండ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
- నమస్తే తెలంగాణ నెట్‌వర్క్

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలా సాగుతున్నది. సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని సాయిపేట, క్యాతంపల్లి, వేలేరు మండలంలోని సోడషపల్లి, కమ్మరిపేట గ్రామసభల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ పాల్గొన్నారు. సాయిపేటలో అంగన్‌వాడీ కేంద్రాన్ని, ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం తక్కళ్లపహాడ్, ఊరుగొండలో జరుగుతున్న పనులను కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 11 మండలాల్లో ప్రణాళిక కార్యక్రమం పండుగలా కొనసాగుతున్నది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అయ్యవారిపల్లిలో కలెక్టర్ శివలింగయ్య మొక్కలు నాటారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించి గ్రామస్థులతో మాట్లాడారు. జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి పాలకుర్తి, కొడకండ్ల ఎంపీడీవో కార్యాలయాల్లో 30 రోజుల ప్రణాళికపై సమీక్షించారు.

palle-pragathi4

హరిత సంబురం

ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో హరితహారంలో భాగంగా భారీగా మొక్కలు నాటుతున్నారు. కరీంనగర్ జిల్లాలో చాలాగ్రామాల్లో శ్రమదానంతో పారిశుద్ధ్య పనులు నిర్వహించి, మొక్కలు నాటారు. పలు గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా మామ డ, లక్ష్మణచాంద మండలాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామంలో కలెక్టర్ ప్రశాంతి పర్యటించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ఝరి, మోడి, ఖైరి గ్రామాల్లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పర్యటించి మోడీ పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. రెబ్బెన మండలం నంబాలలో డంప్‌యార్డుతోపాటు, వైకుంఠధామాల కోసం సర్పంచ్ సోమశేఖర్, వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, ప్రత్యేకాధికారి ప్రసాద్ స్థలాలను పరిశీలించారు. గోలేటిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించి మురుగు కాల్వలను శుభ్రం చేశారు.

palle-pragathi2

గ్రామస్థులకు అవగాహన

ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో కొనసాగుతున్నది. మర్పల్లి మండలం తిమ్మాపూర్ పంచాయతీతోపాటు గుర్రంగట్టు తండాలో కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా పర్యటించారు. ధారూర్ మండలంలోని తరిగోపులలో డీఆర్‌డీవో జాన్సన్ హరిత ప్రణాళికపై గ్రామస్థులతో చర్చించారు. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం ఘనపూర్‌లో జెడ్పీ చైర్‌పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పిచ్చిమొక్కలను తొలగించారు. సిద్దిపేటజిల్లా కొండపాక మండల పరిధిలోని కుకునూర్‌పల్లి గ్రామంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ పోల్కంపల్లి జయంతి నరేందర్ ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు

palle-pragathi3

ఉమ్మడి పాలమూరులో ఉత్సాహంగా..

మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని 441 గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక ఉత్సాహంగా సాగుతున్నది. మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ దేవరకద్ర, చిన్నచింతకుంటలో పర్యటించి మొక్కలు నాటారు. చిన్నచింతకుంట మండలకేంద్రంలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి శ్రమదానంలో పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో కలెక్టర్ వెంకట్రావు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం తాటిపాముల, కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామాల్లో కలెక్టర్ శ్వేతా మొహంతి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి పర్యటించి పనులను పర్యవేక్షించారు. కలెక్టర్ స్వయంగా పిచ్చిమొక్కలను తొలగించారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని గౌరారంలో డీఏవో బైరెడ్డి సింగారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉప్పునుంతల మండలం తాడూర్‌లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. నల్లగొండ జిల్లా జీకే అన్నారం గ్రామంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పలు పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. మొక్కలు నాటడంతోపాటు.. గ్రామ సమస్యల గురించి ఆరా తీశారు. సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కేసారంలో శ్రమదానం చేసి వీధుల్లో చెత్తాచెదారాన్ని తొలగించారు.

palle-pragathi5

రోడ్లు ఊడ్చి.. శ్రమదానం

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, డీపీవో జయసుధ కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల్లో పర్యటించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి, గాంధారి మండల కేంద్రంలో కలెక్టర్ సత్యనారాయణ చీపురుపట్టి రోడ్లు ఊడ్చారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కనాటి నీరు పోశారు. పద్మాజివాడి గ్రామంలోని పాఠశాలలో పిచ్చిమొక్కలను తొలగించారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం జోరుగా సాగుతున్నది. మొయినాబాద్ మండలం ముర్తుజాగూడ గ్రామంలో సోమవారం జిల్లా వ్యవసాయాధికారి, మండల ప్రత్యేకాధికారి గీతారెడ్డి, ఎంపీపీ నక్షత్రం, ఎంపీడీవో విజయలక్ష్మి పనులు పరిశీలిస్తుండగా ఇంచార్జి కలెక్టర్ హరీశ్ సందర్శించారు. రోడ్డుకిరువైపులా పిచ్చిమొక్కలను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ఇండ్లను కూలగొట్టాలని, మొక్కలు నాటాలని ఆదేశించారు.

సర్పంచ్‌కు, కార్యదర్శికి షోకాజ్ నోటీసులు

30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా సోమవారం మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో పర్యటించిన కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రణాళిక అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు నిర్ధారణ కావడంతో గ్రామ సర్పంచ్, కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

జోరువానలోనూ..

సోమవారం పలుజిల్లాల్లో వర్షం కురిసినప్పటికీ అధికారులు పల్లెప్రగతి కార్యక్రమాన్ని కొనసాగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో పలుగ్రామాల్లో జోరువానలోనే కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ, జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అశ్వాపురం మండలం మొండికుంటలో సర్పంచ్ మర్రి మల్లారెడ్డి చెత్తను రిక్షాలోకి ఎత్తి నడిపారు. మంచిర్యాల జిల్లాలో వర్షంలోనే కలెక్టర్ గ్రామాలను సందర్శించారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ మొక్కలు నాటారు. తల్లాడ మండలంలో మల్లారం, పినపాక గ్రామాల్లో ఇంచార్జి డీపీవో, అసిస్టెంట్ కలెక్టర్ హన్మంత్ కొడింబా కార్యక్రమాలను పరిశీలించారు.

pp

చెట్టును నరికిన వ్యక్తికి రూ.2,500 జరిమానా

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం సౌల్లతండాకు చెందిన భూక్య వెంకన్న రోడ్డు పక్కన ఉన్న చెట్టును నరికివేశాడు. దీంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శి సరితరెడ్డి వెంకన్నకు రూ.2,500 జరిమానా విధించారు.

891
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles