కాంగ్రెస్‌కు కందాల గుడ్‌బై


Fri,March 15, 2019 04:00 AM

Paleru Congress MLA Upender Reddy to Join in TRS

-కేటీఆర్‌తో భేటీ అయిన పాలేరు ఎమ్మెల్యే
-ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరోషాక్
-సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా: ఉపేందర్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:కాంగ్రెస్‌కు మరోషాక్ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్‌ను వీడగా.. తాజాగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుపై విజయం సాధించిన కందాల గురువారం ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాతోపాటు, పాలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో నడువాలని నిర్ణయించుకున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉపేందర్‌రెడ్డి నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు. ప్రజల సంక్షేమం కోసం అందరం కేసీఆర్ వెంట నడుద్దామని, రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుద్దామని పిలుపునిచ్చారు. ఉపేందర్‌రెడ్డి వెంట కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్‌రావు ఉన్నారు.

జిల్లా, నియోజకవర్గ అభివృద్ధి కోసమే: కందాల

తెలంగాణ ప్రగతి కోసం అహర్నిశలు కష్టపడుతున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని నిర్ణయించుకున్నట్టు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని బలంగా విశ్వసిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నివర్గాలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వాన్ని బలపరుస్తూ టీఆర్‌ఎస్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాయని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ప్రతిఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని, భక్తరామదాసు ప్రాజెక్టుతో పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంపై సంపూర్ణ అవగాహన, అభివృద్ధి విషయంలో అంకితభావం కలిగిన నాయకుడు కేసీఆర్ తప్ప రాష్ట్రంలో మరొకరు కనిపించడంలేదని తెలిపారు. అవసరమైతే కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసి, తిరిగి ప్రజాతీర్పు కోరడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. త్వరలోనే టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు.

ఖాళీదిశగా కాంగ్రెస్ శాసనసభా పక్షం

కాంగ్రెస్ శాసనసభాపక్షం ఖాళీ దిశగా సాగుతున్నది. ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకంలేని పలువురు ఎమ్మెల్యేలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని, జిల్లాను అభివృద్ధి చేసుకొనేందుకు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఇప్పటికే కేసీఆర్‌కు మద్దతు ప్రకటించారు. తాజాగా ఉపేందర్‌రెడ్డి ఆ జాబితాలో చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వీరిదారిలో ఉన్నట్టుగా సమాచారం.

త్వరలో కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలుపనున్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని మూటకట్టుకున్న కాంగ్రెస్.. ఆ తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కనీస స్థానాల్లోనూ గెలవలేకపోయింది. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీచేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. సర్వేలన్నీ టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని చెప్తుండటంతో.. పోటీచేసి పరువు పోగోట్టుకోవడం కంటే మిన్నకుండటమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 88 స్థానాలను గెలుచుకున్నది. ఆ తరువాత ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక టీడీపీ, ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిసి టీఆర్‌ఎస్ బలం 97కు చేరింది.

3964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles