చురుగ్గా ప్రగతి పనులు

Sun,September 22, 2019 02:19 AM

-విజయవంతంగా 30 రోజుల కార్యాచరణ
-ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
-కొనసాగుతున్న శ్రమదానాలు
-గ్రామాల్లోనే కలెక్టర్లు, అధికార యంత్రాంగం
-అభివృద్ధి పనులకు భారీగా విరాళాలు

ప్రగతి ప్రణాళిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. 16వ రోజు శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా జరిగాయి. జనమంతా ఒక్కటై శ్రమదానం కార్యక్రమాలతో తమ గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు శనివారం గ్రామాలకు వెళ్లి ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. తమకు జన్మనిచ్చిన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు పలువురు నగదు సాయం అందించగా.. మరికొందరు డంపింగ్‌యార్డులు, శ్మశానవాటిక ఏర్పాటుకు భూములను విరాళమిచ్చారు.
-నమస్తే తెలంగాణ నెట్‌వర్క్

30-Days-Village2
30 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని కేశవాపూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో జరిగిన గ్రామసభలకు జెడ్పీచైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్ హాజరై మొక్కలు నాటారు. ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని పలు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ధర్మసాగర్‌లో సర్పంచ్ ఎర్రబెల్లి శరత్‌చంద్రప్రసాద్, ఎంపీటీసీ రొండి రాజయ్యయాదవ్, ధర్మపురంలోసర్పంచ్ యాకూబ్ మహిళ సంఘాలతో ర్యాలీ నిర్వహించి, శ్రమదానం చేశారు. నారాయణగిరిలో సర్పంచ్ కర్ర సోమిరెడ్డి మొక్కలు నాటి రోడ్డుపక్కన పిచ్చిమొక్కలు తొలగించారు.

పరిశుభ్రంగా పల్లెలు..

ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా గ్రామాలు పరిశుభ్రంగా మారుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లిలో ప్లాస్టిక్‌వేస్ట్ కలెక్షన్ కేంద్రాన్ని ప్రారంభించారు. గడ్డిగుట్ట పంచాయతీ భట్టుతండాలో గామస్థులు పిచ్చిమొక్కలను తొలగించారు. తెలగరామవరంలో ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపట్టారు. టేకులపల్లి మండలంలో జేసీ వెంకటేశ్వర్లు, చుంచుపల్లి మండలంలో డీఆర్‌డీఏ పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, జూలూరుపాడు మండలంలో డీపీవో ఆశాలత, చండ్రుగొండ మండలం తుంగారంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి పర్యటించి ప్రణాళికా పనులను పర్యవేక్షించారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలోని పలుగ్రామాల్లో శనివారం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ పర్యటించి పారిశుద్ధ్యం, హరితహారం పనులను పరిశీలించారు. ఖమ్మం రూరల్ మండలంలోని కాసిరాజుగూడెంలో ఇంచార్జి డీపీవో, అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, ముదిగొండ మండలంలో జెడ్పీ సీఈవో ప్రియాంక ప్రణాళిక పనులు పరిశీలించారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ గ్రామాభివృద్ధిపై అవగాహన కల్పించారు.
30-Days-Village3

ఊరూరా హరితహారం

కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు హరితహరంలో పాల్గొంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం లింగంపేటలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. మహబూబ్‌నగర్ మండలం రేగడిగడ్డ తండాలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రజల తో కలిసి పిచ్చిమొక్కలను తొలగించారు. జోగుళాంబగద్వాల జిల్లా కొండపల్లిలో బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర గ్రామస్థులతో కలిసి రోడ్లను శుభ్రపరిచారు. మానవపాడు మండ లం కలుకుంట్లలో జెడ్పీ సీఈవో జ్యోతి మొక్కను నాటారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం పెద్దపల్లిలో జెడ్పీచైర్‌పర్సన్ పద్మావతి చీపురుతో వీధులను శుభ్రం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో జరుగుతున్న పనులను జెడ్పీచైర్‌పర్సన్ వనజ, కలెక్టర్ వెంకట్రావు పరిశీలించారు. మరికల్ మండలం కన్మనూర్‌లో నిర్వహించిన కార్యక్రమాలకు జెడ్పీ వైస్‌చైర్మన్ గౌని సురేఖరెడ్డి హాజరయ్యారు. వనపర్తి జిల్లా రేవెల్లి మండలం శాయినిపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో కలెక్టర్ శ్వేతామొహంతి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మహ్మద్‌నగర్‌లో నిర్వహించిన 30 రోజుల ప్రణాళికలో జెడ్పీ చైర్‌పర్సన్ దఫేదార్ శోభ, కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. గ్రామంలో వైకుంఠధామం నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు రోడ్డు పక్కన మొక్కలు నాటారు.

ఉత్సాహంగా శ్రమదానం

30 రోజుల ప్రణాళికలో భాగంగా అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా శ్రమదానంలో పాల్గొంటూ గ్రామాలను శుభ్రపరుచుకుంటున్నారు. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో జెడ్పీ చైర్‌పర్సన్ ర్యాకల హేమలత శేఖర్‌గౌడ్ పల్లెప్రగతి పనుల్లో భాగంగా శ్రమదానం చేశారు. టేక్మాల్ మండలం చంద్రుతాండాలో జిల్లా వ్యవసాయశాఖాధికారి పరశురాం నాయక్ పల్లెనిద్ర చేశారు.

జోరుగా పారిశుద్ధ్య పనులు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలకేంద్రంతోపాటు బాలపల్లి, మొగడ్‌దగఢ్, గుండాయిపేటలో ఎంపీపీ విశ్వనాథ్, జెడ్పీటీసీ అనూష హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. బల్లెపల్లిలో మురుగు కాల్వలు శుభ్రం చేయించారు. సిర్పూర్-టి మండలం లక్ష్మీపూర్‌లో సర్పంచ్ పిప్రె స్వప్న, ప్రత్యేకాధికారి రామ్మోహన్ ఆధ్వర్యంలో జేసీబీతో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేయించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ప్రశాంతి పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. పలు ప్రదేశాల్లో మొక్కలు నాటారు. రోడ్డు మీద చెత్త వేస్తే రూ. 500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ గ్రామస్థులతో కలిసి శ్రమదానం చేశారు. మానకొండూర్ మండలం ఖాదర్‌గూడెంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్‌డీఏ పీడీ ఏ వెంకటేశ్వర్‌రావు గ్రామసభ నిర్వహించారు.
30-Days-Village1

నాగర్‌కర్నూల్ జిల్లాలో బయటపడ్డ సొరంగం

30 రోజుల ప్రణాళికలో భాగంగా పాత గోడలు తొలగిస్తుండగా సొరంగం బయటపడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలకేంద్రంలో శనివారం జరిగింది. తిమ్మాజీపేట గ్రామపంచాయతీకి సమీపంలోని రోడ్డుపక్కన ఉన్న పాత ఇంటి గోడలు జేసీబీ సాయంతో తొలగిస్తుండగా ఒక బావి బయట పడింది. దానిని పరీక్షించి చూడగా పది అడుగుల లోపల తూర్పు, దక్షిణం వైపుగా వెళ్లే సొరంగాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 60ఏండ్ల కింద తాము దానిని గుర్తించామని ఖాజి అనే గ్రామస్థుడు తెలిపాడు. బావిలో పూడిక తీసేందుకు ప్రయత్నించగా లోపల ఉత్తరం, దక్షిణం దిక్కులో రాతి గోడలతో దర్వాజలు కన్పించాయని, అయితే లోపలికి వెళ్లే సాహసం చేయలేదని ఆయన వివరించాడు. సర్పంచ్ వేణుగోపాల్‌గౌడ్, ఎంపీడీవో కరుణశ్రీ దానిని పరిశీలించారు.

గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

-సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
ప్రజలంతా గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని హరితహారం ప్రత్యేకాధికారి, సీఎం వో ఓఎస్డీ ప్రియాంకవర్గీస్ పిలుపునిచ్చారు. శనివారం జనగామ జిల్లాలోని పెంబర్తి, భాంజీపేట గ్రామాల్లో కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి పర్యటించారు. జనగామ పట్టణంలోని అటవీశాఖ నర్సరీని సందర్శించారు. పెంబర్తి, భాంజీపేట గ్రామాల్లో వీధులన్నీ కలియతిరిగి హరితహారంలో నాటిన మొక్కలను ఆమె పరిశీలించారు. 30 రోజుల పల్లెప్రగతి ప్రణాళిక కార్యాచరణ అమలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ భూముల్లో నాటుకొనేందు కు రైతులకు మామిడి మొక్కలు సరఫరా చేస్తామని, వారికి ఎలాంటి మొక్క లు కావాలో ఇండెంట్ ఇస్తే నర్సరీల్లో సిద్ధం చేసి అందజేస్తామన్నారు.
30-Days-Village4

643
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles