సాగు చేయనిస్తలేరు

Fri,September 13, 2019 01:22 AM

-రెవెన్యూ సిబ్బంది అండతో పొరుగు రైతు దౌర్జన్యం
-ధర్మగంటను ఆశ్రయించిన పెద్దపల్లి జిల్లా బాధితుడు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నా పేరు మారుపాక సత్యనారాయణ. తండ్రి పేరు బాలకృష్ణ. మాది పెద్దపల్లి జిల్లా, శ్రీరాంపూర్. అదే గ్రామంలోని సర్వే నంబర్ 613/ఏలో 20 గుంటల భూమి ఉన్నది. ఈ భూమి మా తండ్రి నుంచి నాకు వారసత్వంగా సంక్రమించింది. 1999లో నా పేరిట మార్చుకున్నా. నా పేరిట పాస్‌పుస్తకం కూడా ఇచ్చారు. పహాణీలోనూ నమోదుచేశారు. ఈ 20 గుంటల భూమిపైన 2013లో బ్యాంకులో రుణం కూడా తీసుకున్నా. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత సదరు భూమికి సంబంధించిన కొత్త పాస్‌పుస్తకం కూడా రెవెన్యూ అధికారులు జారీచేశారు. రెండు విడుతల రైతుబంధు కూడా వచ్చింది. ఇప్పటికీ మోఖాపై నేనే ఉన్నా. కానీ పక్కపొలం రైతు నన్ను సాగుచేసుకోనిస్తలేడు. నేను సాగు చేసుకొంటే ఆ భూమి తనదని పక్క రైతు వచ్చి పంటను ధ్వంసం చేస్తున్నడు. మోఖాపైకి రానివ్వకుండా అడ్డుపడుతున్నడు. ఈ విషయంపై ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది అండతోనే పక్క రైతు నాపై దౌర్జన్యం చేస్తున్నడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తే స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నా సమస్యకు పరిష్కారం చూపాలి.
- మారుపాక సత్యనారాయణ, రైతు, శ్రీరాంపూర్

మూడు రోజుల్లో పరిష్కరిస్తాం

సర్వే నంబర్ 613/ఏలోని 20 గుంటల భూమి మారుపాక సత్యనారాయణకు చెందినదే. సత్యనారాయణ ఇదివరకే తన సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు. మూడురోజుల్లో మండల సర్వేయర్‌తో సర్వేచేయించి సమస్యను పరిష్కరిస్తాం.
- గురుమూర్తి, వీఆర్వో

996
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles