వైవిధ్యంగా వారాంతం

Sun,September 22, 2019 02:25 AM

-కొత్త వాతావరణాన్ని కోరుతున్న ప్రజలు
-ఇంటికి దూరంగా గడిపేందుకు ఆసక్తి
-రిసార్టులు, వ్యవసాయక్షేత్రాలు ఫుల్
-వనాల్లో మధ్యతరగతి వర్గాల వంటావార్పు

పొద్దున్నే రెడీ అయ్యి.. కారో, బైకో స్టార్ట్‌చేసుకుని ఉద్యోగానికి వెళ్లడం.. సాయంత్రందాకా పనిచేయడం.. ఇంటికొచ్చి టీవీ చూడటం.. తిని పండుకోవటం! పొద్దుటినుంచి రాత్రిదాకా అవేముఖాలు.. అవేదృశ్యాలు.. అవేపనులు! కంటికి ఇంపులేదు. మానసిక ఆనందం అసలేలేదు. అంతా మెకానికల్ లైఫ్! వారంలో ఐదురోజులో.. ఆరురోజులో.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులేకాదు సాధారణ ఉద్యోగులదైనా ఇదే రొటీన్‌లైఫ్! కానీ కొద్దిగా ఓపికచేసుకుంటే.. వారాంతంలో సెలవులు వచ్చే శని ఆదివారాలు.. కనీసం ఆదివారం వైవిధ్యంగా గడిపేయొచ్చు! ఒకప్పుడు స్థితిమంతులు వీకెండ్ ఎంజాయ్ చేస్తే.. మారుతున్న పరిస్థితులు, అందుబాటులోకి వస్తున్న అవకాశాలు మధ్యతరగతి వర్గాలకు సైతం ఆ ఆనందాన్ని చేరువచేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఏ శని ఆదివారాలు చూసినా రిసార్టులు, వనాలు, పర్యాటక ప్రాంతాలు కోలాహలంగా కనిపిస్తున్నాయి! వారంలో ఒకటి లేదా రెండు రోజులు ప్రకృతి ఒడిలో గడిపేవారిని మానసికంగా రీచార్జ్ చేస్తున్నాయి!
Weather1
శిరందాస్ ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఈ వీకెండ్ ఎక్కడికిపోదాం? సాధారణ మధ్యతరగతివర్గాల ఇండ్లలోనూ ఇప్పుడు తరచూ వినిపిస్తున్నమాట ఇది! వన విహారమో.. ఆధ్యాత్మిక ప్రయాణమో! బంధువులు.. ఫ్రెండ్స్‌గ్రూప్ మీటింగులో! నగరశివార్లలోని రిసార్టులో.. ఫాంహౌస్‌లో.. సమీప అటవీప్రాంతాలో.. ఎక్కడైతేనేం? నలుగురితో కలిసి.. కొద్దిసేపు అన్ని ఒత్తిళ్లు వదిలేసి.. ఆడి.. పాడి.. అనందంగా గడపటానికి! సోమవారం నుంచే మంచి ప్లేస్ వెతుక్కోవడం.. శనివారం లేదా ఆదివారం పొద్దున్నే కావాల్సినవన్నీ సర్దుకుని.. కారెక్కేయడం! అపార్ట్‌మెంట్లలోనైతే రెండుమూడు కుటుంబాలు పిల్లాపాపలతో కలిసి వినోదాన్ని వెతుక్కుంటూ వెళుతున్నాయి. కొందరు గ్రామీణప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతుంటే.. మరికొందరు కొండకోనల్లో అడ్వెంచర్లకు సైతం సిద్ధపడుతున్నారు. ఇంట్లో పెద్దవాళ్లు కోరుకుంటే ఆధ్యాత్మికక్షేత్రాలకు వెళ్లి.. భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నవారూ ఉన్నారు. ఎవరు ఏది చేసినా.. టార్గెట్ మానసికోల్లాసమే!

వీకెండ్ టూర్లతో సంబంధాల మెరుగు

వీకెండ్‌టూర్లతో కుటుంబాలు, స్నేహితులు, ఇరుగుపొరుగు మధ్య సంబంధాలు మెరుగుపడుతాయి. పిల్లలు థ్రిల్ కోరుకుంటున్నారు. అందుకే అమ్యూజ్‌మెంట్ పార్కులు, రిసార్టులకు వస్తున్నారు అని వండర్‌లా అమ్యూజ్‌మెంట్ పార్కు చీఫ్ మేనేజర్ (పీఆర్) డీఎస్ రాంబాబు తెలిపారు. అనేకరకాల ఆటలు, పాటలు, డ్యాన్సింగ్, స్విమ్మింగ్, రెయిన్ గేమ్స్ వంటి వైవిధ్యతను ఆస్వాదించేందుకు నగరవాసులు ఇష్టపడుతున్నారని చెప్పారు.

వైవిధ్యమైన ఆహారానికే మొగ్గు

వీకెండ్ ఇంటికి దూరంగా ఎక్కడికన్నా వెళ్లే సమయం లభించనివారు కనీసం భోజనమైనా బయట చేద్దామనుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీకెండ్స్‌లో హోటళ్లు, రెస్టారెంటుకు వెళ్లేందుకు కుటుంబాలు ఆసక్తి చూపుతున్నాయి. నగరంలో హైదరాబాదీ, తెలంగాణ ఆహారమే కాదు.. చైనీస్, ఈజిప్టు, థాయ్, గోవా, అమెరికన్, ఇండోనేషియా.. ఇలా ఒకటేమిటి ప్రపంచరుచులన్నీ లభిస్తున్నాయి. ఖర్చు ఎంతయినా ఫర్వాలేదని కొత్త రుచులను ఆస్వాదించే నగరవాసులూ ఉన్నారు. మరికొందరు, ప్రత్యేకించి పేద, మధ్యతరగతి వర్గాల వారు నగర శివార్లలో ఉన్న మైసిగండి, అమ్మవారి ఆలయాలకు వెళ్లి.. దావత్‌లు చేసుకుంటున్నారు. మొక్కులు తీర్చుకుని.. ముక్కలు ఆస్వాదిస్తున్నారు. కొందరు సమీపవనాలకు వెళ్లి.. అక్కడే వంటావార్పు చేసుకుని వారాంతాన్ని తమకు ఇష్టమైన రీతిలో గడుపుతున్నారు.
Weather2

సాహసకృత్యాలకూ సిద్ధమే

వీకెండ్స్‌లో అడ్వంచర్స్‌కు సిద్ధమవుతున్న యువత కూడా నగర, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్నది. వాటర్‌ఫాల్ రాపెలింగ్, బైక్ రైడింగ్ వంటి వాటికి ప్లాన్ చేసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్స్ క్లబ్ పేరిట ఓ సంస్థ అనేక కార్యక్రమాలను నిర్వహించింది. బంగీ జంపింగ్, రాక్ ైక్లెంబింగ్, గో కార్టింగ్, లేజర్ ట్యాగింగ్, జోర్బింగ్, పెయింట్ బాల్, జిప్ లైనింగ్, రాక్ వాకింగ్, షూటింగ్, సెయిలింగ్, సర్ఫింగ్, పారా ైగ్లెడింగ్, ట్రెక్కింగ్, బోటింగ్ వంటి అనేక రకాల అడ్వెంచర్స్‌కు యువత వెళ్తున్నది.

కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి

ప్రతిరోజూ ఉద్యోగానికి వెళ్లడంతోనే సరిపోతున్నది. అందుకే శని, ఆదివారాల్లో రిసార్టుకు వెళ్లడమో, ఇతర ప్రాంతాలకు వెళ్లడమో చేస్తుంటాం. కుటుంబంతో గడపటం కంటే ఇంకేం కావాలి? అందులోనే ఎంతో ఆనందంగా ఉంటుంది.
- షబాజ్, టోలీచౌకి

డబ్బులు ముఖ్యం కాదు

నగర వాతావరణం కంటే పల్లె వాతావరణమే బాగుంటుంది. కాలుష్యానికి దూరంగా ఉండొచ్చు. రోజూ అలసిపోయే మనసుకు ఉపశమనం కావాలంటే కుటుంబం, స్నేహితులతో కలిసి గడపడం మంచిది. అందుకే మా కుటుంబం, ఇరుగుపొరుగు కలిసి వెళ్లేందుకు ప్లాన్ చేస్తాం.
- ఇంతియాజ్, టోలీచౌకి

వీకెండ్ ఎంజాయ్ తప్పనిసరి

హైదరాబాద్ చుట్టూ అనేక ప్రాంతాలు ఉన్నాయి. వాటిల్లో ఫ్యామిలీ డెస్టినేషన్‌కు వెళ్తాం. వండర్‌లా లాంటి ప్రదేశాలకు వీకెండ్‌లో వస్తాం. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్మించిన రిసార్టుల్లో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతాం. వీకెండ్‌లో ఫన్, థ్రిల్‌ను కోరుకుంటాం. కుటుంబం, స్నేహితులతో కలిసి వెళ్తాం. వాళ్లతో గడపడంతో ఎంతో ఆనందంగా ఉంటుంది. రోజూ పనులతో బిజీగా గడిపే వారెవరైనా ఇలా గడపాలని కోరుకుంటారు.
- రామారావు దంపతులు, ఎల్బీనగర్

1452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles