ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

Fri,November 8, 2019 02:30 AM

- రూ. కోటి విలువైన 2.5 టన్నుల ఎర్రచందన దుంగలు, కారు స్వాధీనం
చార్మినార్: ఇతర రాష్ర్టాల నుంచి తక్కువ ధరకు ఎర్రచందనాన్ని కొనుగోలుచేసి అధిక ధరకు విక్రయించడానికి ప్రయత్నిస్తున్న స్మగ్లర్ల ముఠాను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితుల నుంచి రూ.కోటి విలువైన 2.5 టన్నుల ఎర్రచందనం దుంగలు, హోండాసిటి కారుతోపాటు ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ గురువారం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లాకు చెందిన రాధాకృష్ణ (40) ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసి జీవితంలో స్థిరపడేందుకు వ్యాపార మార్గాన్ని ఎంచుకున్నాడు. మొదట మైనింగ్ తర్వాత కొబ్బరికాయలు ఆ తర్వాత ఎర్రకంకర రాళ్ల వ్యాపారం చేశాడు.


ఈ క్రమంలో జల్సాలకు అలవాటుపడిన రాధాకృష్ణ.. ఏ వ్యాపారంచేసినా పెద్దమొత్తంలో డబ్బులు రావడం లేదని భావించి ఎర్రచందనం అక్రమ రవాణాచేసి కోట్లు గడించాలని పథకంవేశాడు. కడప జిల్లాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని కలిశాడు. అతడు ప్రొద్దుటూరుకు చెందిన శివ అలియాస్ చంద్ర (34)ను పరిచయం చేశాడు. గంగిరెడ్డి, చంద్ర కడప జిల్లా పరిధిలోని లంకమల్లా రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎర్రచందనం దుంగలను అక్రమంగా సేకరించారు. వారినుంచి కిలో రూ.400 చొప్పున రాధాకృష్ణ 2.5 టన్నుల ఎర్రచందనం దుంగలను కొనుగోలుచేశాడు. చంద్ర సాయంతో కడప నుంచి దుంగలను కూరగాయల మాటున ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ శివారు పెద్దషాపూర్ మండలంలోని రవియా గార్డెన్‌కు తరలించాడు.
PC-AnjaniKumar1
అక్కడ వాచ్‌మెన్ రామ్ సేవక్‌కుమార్ (32) గదిలో వాటిని రాధాకృష్ణ భద్రపర్చాడు. ఎర్రచందనం అమ్మకాలు పూర్తయ్యే వరకు సహకరిస్తే ప్రతినెల రూ.10 వేలు చెల్లిస్తామని రామ్‌సేవక్‌ను ఒప్పించారు. తన వద్ద భారీస్థాయిలో ఎర్రచందనం ఉన్నదని వాటిని అమ్మిపెట్టాల్సిందిగా రాధాకృష్ణ.. జూనియర్ ఆర్టిస్ట్ అయిన ఎన్ చెన్నయ్య (25) అలియాస్ బన్నీ కోరాడు. తనకు తెలిసినవారికి ఎర్రచందనం దుంగలను చూపెట్టడానికి చెన్నయ్య కారులో పంజాగుట్ట ప్రాంతానికి రాగా.. సమాచారం అందుకున్న దక్షిణ మండల పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నయ్య ఇచ్చిన సమాచారంతో వాచ్‌మన్ గదిలో దాచిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వాటివిలువ రూ.6 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉంటుందని సీపీ తెలిపారు. మరో నిందితుడు శివ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించామని వెల్లడించారు.

265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles