ఆరోగ్యశ్రీ ఉత్తమం

Thu,October 10, 2019 02:43 AM

-ఆయుష్మాన్ భారత్ కంటే మంచిదన్న ఆర్బీఐ
-ఆరోగ్యశ్రీకి అదనపు భారం ఉండదు
-కేంద్ర పథకానికి ప్రీమియం చెల్లింపులు పెరిగే ప్రమాదం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆయుష్మాన్ భారత్ కంటే తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం ఉత్తమమైనదని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధ్యయనంలో వెల్లడించింది. ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా ప్రభుత్వ నిధులతో పేదలకు వైద్యం అందిస్తున్నదని, లబ్ధిదారుకు అదనంగా ఎలాంటి ఖర్చు ఉండదని.. కానీ కేం ద్రం అమలుచేస్తున్న ఆయుష్మాన్ భారత్‌కు ప్రీమియం చెల్లింపులు పెరిగే ప్రమాదం ఉన్నదని రిజర్వ్‌బ్యాంక్ పేర్కొన్నది. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ ప్రీమియం చెల్లింపుల కంటే క్లెయిమ్స్ వందశాతం దాటాయని తెలిపింది. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలు బెయిలవుట్ అవుతాయని, ఈ ప్రమాదాన్ని తప్పించి ప్రజలకు వైద్యసేవలు కొనసాగించాలంటే ప్రీమియం చెల్లింపులు పెంచాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పరిమితుల్లేకుండా రాష్ట్రంలో పేదలందరికీ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితవైద్యం అందిస్తున్నది. ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌లతో కలిపి మొత్తం 85.34 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. బడ్జెట్‌లో 1,336 కోట్ల రూపాయలు కేటాయించి.. పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యసేవలు ఉచితంగా అందిస్తున్నది. ఈ నిధులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రాష్ట్రప్రభుత్వం నేరుగా ఖర్చుచేస్తున్నది. ఆరోగ్యశ్రీ పథకంలో పైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎలాంటి భాగస్వామ్యం లేదు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడుస్తున్నది.


కేంద్రం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం నిబంధనల ప్రకారం రాష్ట్రంలో కేవలం 26.11 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ధిచేకూరుతుంది. ఈ పథకం కింద రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వైద్యసేవల ఖర్చును మాత్రమే కేంద్రం భరిస్తుంది. మిగిలినది రోగి కుటుంబమే భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నేరుగా చెల్లింపులు చేసే ప్రక్రియ ఆరోగ్యశ్రీలో ఉండటంతో చెల్లింపులు పెరిగే అవకాశం లేదు. కనుక అదనపు భారం ఉండదని ఆర్బీఐ పేర్కొన్నది. ఆయుష్మాన్ భారత్ పథకంలో ఇన్సూరెన్స్ కంపెనీలు భాగస్వామ్యం కావడంతో ప్రీమియం దాటి చెల్లింపులు చేయాల్సి వస్తే అవి కుప్పకూలే అవకాశం ఉన్నదని తెలిపింది. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలు సేవలు అందించాలంటే ప్రీమియం చెల్లింపులు పెంచాల్సి ఉంటుందని పేర్కొన్నది. ఆ రీత్యా చూసినప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకం కంటే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం చాలా మంచిదని రిజర్వ్‌బ్యాంక్ విశ్లేషించింది.

430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles