నల్లమలలో యురేనియం తవ్వకాలు వద్దు

Tue,September 17, 2019 03:23 AM

-కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
-అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
-యురేనియం తవ్వకాలతో ప్రాణకోటికి ముప్పు
-పర్యావరణానికి హాని
-అనేకజాతుల జంతుజాలానికి నల్లమల ఆవాసం
-అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్
-ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ
-అందరికీ కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కేటీఆర్
-సీఎం కేసీఆర్‌ను అభినందించిన సీఎల్పీ నేత భట్టి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. యురేనియం తవ్వకాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని, ఈ విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనుమతితో ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. పర్యావరణానికి, జీవావరణానికి, ప్రకృతి రమణీయతకు నెలవైన సువిశాల నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలను వెలికితీయటానికి తవ్వకాలు జరుపాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ శాసనసభ కోరుతున్నది. పెద్దపులులు, చిరుతపులులు, చుక్క జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, నీల్గాయి సహా అనేక జాతులకు చెందిన జంతుజాలం ఈ నల్లమల అడవిని ఆధారంగా చేసుకొనే మనుగడ సాగిస్తున్నది. అరుదైన ఔషధ మొక్కలతోపాటు లక్షల రకాల వృక్షజాలం ఆ అడవిలో ఉన్నది.

అనాదిగా అడవినే ఆధారంగా చేసుకుని జీవించే చెంచులు తదితర జాతుల ప్రజలు ఉన్నారు. ఇదే అడవిలోని ఎత్తైన కొండలు, గుట్టల ద్వారా పారే జలపాతాలే కృష్ణానదికి పరీవాహక ప్రాంతంగా ఉన్నాయి. మొత్తంగా జీవవైవిధ్యానికి నెలవైన నల్లమల అటవీప్రాంతంలో యురేనియం కోసం తవ్వకాలు జరుపటం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నది. మానవాళితోపాటు సమస్త ప్రాణకోటి మనుగడకు ముప్పుగా పరిణమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. యురేనియం నుంచి వెలువడే అణుధార్మికత వల్ల పంటలు పండే భూమి, పీల్చేగాలి, తాగేనీరు కాలుష్యమై మనిషి జీవితం నరకప్రాయం అవుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిపిన యురేనియం త్వవకాల అనుభవాలు కూడా చేదుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని నల్లమలలో యురేనియం తవ్వకాలు జరుపడాన్ని యావన్మంది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ కూడా ప్రజల భయాందోళనలతో ఏకీభవిస్తున్నది. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరుపాలనే ఆలోచన విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది అని తీర్మానంలో ఉన్నది.

ktr-tweet

భవిష్యత్తులోనూ అనుమతించం: కేటీఆర్

నల్లమలలో యురేనియం తవ్వకాల్ని నిషేధించే తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినందుకు మంత్రి కేటీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 1992 నుంచి 2013 మధ్య రాష్ట్రంలో యురేనియం ఖనిజాన్వేషణ జరిగిన మాట వాస్తవమేనన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి మంజూరు చేయలేదని తెలిపారు. భవిష్యత్తులోనూ ఎట్టిపరిస్థితుల్లో అనుమతినివ్వబోమని స్పష్టంచేశారు. జాతి ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని యురేనియం తవ్వకాలు జరుపుతామని కేంద్రం చెప్పడానికి ప్రయత్నిస్తే రాజకీయపక్షాలన్నీ కలిసికట్టుగా వ్యతిరేకించాలన్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు అనంతరం మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కేసీఆర్‌ను అభినందించిన కాంగ్రెస్ పక్ష నేత భట్టి

నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రజలు ఆందోళనపడటాన్ని గమనించి, వాటిని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ శాసనసభ పక్షనేత మల్లు భట్టివిక్రమార్క సోమవారం సభలో అభినందించారు. కేవలం నల్లమల కాకుండా.. మైనింగ్ తవ్వకాలపై తమ సూచనల్ని ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతం దేవరకొండ వరకూ విస్తరించి ఉన్నదని, యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినందుకు దేవరకొండ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ చెప్పారు. గతంలో ఇలాంటి ప్రతిపాదన వస్తే దేవరకొండ ప్రజలంతా ఆందోళన చేయగా.. మైనింగ్ కార్యకలాపాల్ని కడపలోని పులివెందులకు మార్చారని గుర్తుచేశారు.

1188
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles