రిటైర్డ్ తాసిల్దార్‌కూ తిప్పలే

Tue,September 17, 2019 02:30 AM

-వారసత్వ భూమి పట్టా కోసం పడిగాపులు
-ఏండ్లుగా తిరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు
-ధర్మగంటను ఆశ్రయించిన జనగామ జిల్లా బాధితుడు రాములు
ఎందరో రైతుల భూములకు పట్టాలు చేసిన అధికారి ఆయన.. ఎన్నో భూవివాదాలను పరిశీలించి, న్యాయం చేసిన అనుభవం.. ఎన్నో పాస్‌పుస్తకాలపై రాజముద్రవేసి అందించిన చేతులవి.. తాసిల్దార్ హోదాలో ఇలాంటి వాటిని బాధ్యతగా నిర్వర్తించిన అనుభవం ఆయన సొంతం.. కానీ ఇప్పుడు వారసత్వ భూమిని తన పేరిట పట్టా చేసుకొనేందుకు రెవెన్యూ కార్యాలయం ఎదుట తప్పని పడిగాపులు.. ఈ పరిస్థితి జనగామ జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ తాసిల్దార్ గుగులోత్ రాములుకు ఎదురైంది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరిట మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని, ఇక తిరిగే ఓపిక కూడా లేదని చివరికి ధర్మగంటను ఆశ్రయించారు.

జనగామ రూరల్: జనగామ జిల్లా జనగామ మండలంలోని గానుగుపహాడ్ శివారు పంతులుతండాకు చెందిన గుగులోత్ రాములు 2008 నుంచి వివిధ ప్రాంతాల్లో తాసిల్దార్‌గా విధులు నిర్వర్తించారు. 2017లో జనగామ జిల్లా దేవరుప్పుల తాసిల్దార్‌గా పదవీ విరమణ పొందారు. గ్రామంలోని సర్వే నంబర్లు 200, 193, 194, 195, 196, 191 లలో సుమారు 50 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో గుగులోత్ రాములు తండ్రి గుగులోత్ పంతులు పేరిట 28 ఎకరాలు ఉన్నది. పంతులు 2012లో మృతి చెందగా, ఆయన నలుగురు కుమారులు ఒక్కొక్కరూ ఏడు ఎకరాల చొప్పున పంచుకొన్నారు. తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన భూమిని తన పేరిట పట్టాచేసుకొనేందుకు ఏండ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని బాధితుడు రాములు ధర్మగంటను ఆశ్రయించారు.

భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా తన వాటా ఏడెకరాల్లో మూడెకరాల భూమికి పాస్‌పుస్తకం అందించారని, మిగతా నాలుగెకరాల భూమిని పాస్‌పుస్తకంలో చేర్చాలని మూడేండ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ తోటి ఉద్యోగిని అని కూడా చూడకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. తాసిల్దార్, వీఆర్వో పొంతనలేని మాటలు చెప్తూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వారసత్వ భూమిలో తానే వ్యవసాయం చేసుకొంటున్నానని వివరించారు. ఇప్పటికైనా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకొంటున్నారు.

751
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles