మరణం ముందే తెలిస్తే!?

Fri,November 15, 2019 04:10 AM

-ఏడాది ముందే కనుక్కోవచ్చంటున్న శాస్త్రవేత్తలు
-కృత్రిమ మేధస్సుతో సాధ్యమని వెల్లడి
-పెన్సిల్వేనియాలో జరిగిన అధ్యయనంలో సంచలన ఫలితాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా? అమెరికా పరిశోధకులు మరణాన్ని ముందే తెలుసుకోవచ్చని చెప్తున్నారు. ఏడాదికి ముందే సంకేతాలను కనిపెట్టవచ్చని అంటున్నారు. దీనిపై పెన్సిల్వేనియాలో లక్షల మంది రోగులకు సంబంధించిన వైద్య రికార్డులపై విస్తృతమైన అధ్యయనంచేశారు. కూడా చేశారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ఏఐ) ద్వారా మన మరణాన్ని ముందుగానే కనిపెట్టవచ్చునట. ఇంతకాలం మహామహా వైద్యులకే సాధ్యం కాని పనిని ఇవాళ కృత్రిమ మేధస్సు చేస్తున్నదని పెన్సిల్వేనియాలోని గీసింజర్‌ సంస్థకు చెందిన పరిశోధకులు ఘంటాపథంగా చెప్తున్నారు. ఐటీ ఆధారిత రంగాల్లోనే కాకుండా వైద్యారోగ్య రంగంలోనూ కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషించేకాలం వచ్చిందని ఈ అధ్యయనం నిరూపిస్తున్నది.

పెన్సిల్వేనియా పరిశోధకుల సర్వే

విశ్వవ్యాప్తంగా ఏఐ ప్రాముఖ్యం రోజురోజుకూ పెరుగుతున్నది. ఇప్పుడు ఈ మేధస్సు ఒక రోగి మరణాన్ని అంచనావేసే స్థాయికి ఎదిగింది. మానవ ఆలోచనాశక్తిని అధిగమించి అంచనా వేయగలుగుతున్నది. పెన్సిల్వేనియాలోని గీసింజర్‌ సంస్థ ఈ విషయమై విస్తృతంగా పరిశోధన చేసింది. దాదాపు నాలుగు లక్షల మంది రోగుల నుంచి 1.77 మిలియన్‌ ఈసీజీలను సేకరించి ఫలితాలను పరిశీలించారు. మొదట తీసిన ఈసీజీ సిగ్నల్స్‌ను అనలైజ్‌ చేయడం.. ఆ తర్వాత కార్డియాలజిస్టులు రికార్డు చేసిన స్టాండర్డ్‌ ఈసీజీ ఫీచర్లను అనలైజ్‌ చేసి రెండింటి మధ్య సారూప్యతలను అధ్యయనం చేశారు. ఈ రికార్డుల ప్రకారం ఒకరోగి ఏడాది కాలంలో ఏ శారీరక రుగ్మతతో మరణించవచ్చో ముందుగానే అంచనా వేశారు. ఈ పరిశోధనకు సంబంధించిన అధ్యయనం వివరాలను శనివారం డల్లాస్‌లో జరిగే అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ సైంటిఫిక్‌ సెషన్‌-2019లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

‘గుండె’ వ్యాధుల గుర్తింపునకు ప్రత్యేక నెట్‌వర్క్‌...

కార్డియాలజిస్టులు గుండె సంబంధ వ్యాధులను గుర్తించడానికి కృత్రిమ మేధస్సు ఎంతో ఉపయోగపడుతుంది. రోగుల్లో సరైన పద్ధతిలో లేని హృదయస్పందనను సరిచేయవచ్చా అన్నది అంచనావేయడానికి ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌లను అంచనావేయడానికి శాస్త్రవేత్తల బృందం కృత్రిమమేధస్సుతో పనిచేసే న్యూరల్‌ నెట్‌వర్క్‌ను రూపొందించింది. ఈ నెట్‌వర్క్‌ ఆధారంగా పరిశోధకులు పెన్సిల్వేనియా, న్యూజెర్సీలోని 30 ఏండ్లనాటి పాత వైద్య రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ రికార్డుల ప్రకారం కృత్రిమ మేధస్సు దీర్ఘకాలిక రోగ నిర్ధారణను అందించగలదని, ప్రమాదంలో ఉన్న రోగులను మరింత కచ్చితంగా గుర్తించగలదని పేర్కొన్నారు. క్రమరహిత హృదయ స్పందనను ఏ మేరకు సరిచేయవచ్చో కూడా ఇది సరిగ్గా అంచనా వేయగలుగుతుందని కనుగొన్నారు. కార్డియాలజిస్టులు కూడా గుర్తించలేని రోగుల మరణ ప్రమాదాన్ని ఈ న్యూరల్‌ నెట్‌వర్క్‌ ద్వారా అంచనా వెయ్యొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. దీనిద్వారా ఈసీజీలను విశ్లేషించే విధానాన్ని పూర్తిగా మార్చవచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు. క్రమరహిత హృదయ స్పందన ద్వారా ప్రమాదాన్ని గుర్తించి సరైన చికిత్స అందించడానికి వీలవుతుందని చెప్తున్నారు.

ఎన్నో ప్రయోజనాలు

భవిష్యత్‌లో వైద్యులు మనుషుల ఆరోగ్యస్థితిని తెలుసుకునేందుకు కృత్రిమ మేధస్సు ప్లాట్‌ఫ్లారాలను విస్తృతంగా ఉపయోగించుకుంటారని అరిత్మియా అండ్‌ ఎలెక్ట్రో ఫిజియాలజీ గత ఆగస్టులో ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది. మనుషులు దశాబ్దాలుగా అర్థం చేసుకోలేని విషయాలను కృత్రిమ మేధస్సు వివరిస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మనిషి మరణాన్ని అంచనా వేయడానికి ఇప్పటికే ప్రయత్నాలు జరిగాయి. గుండెజబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి రోగాలను నిర్ధారించడానికి ఎన్నో నమూనాలు తయారుచేశారు. కానీ కృత్రిమ మేధస్సుతో మరణాన్ని కచ్చితంగా అంచనా వేయవచ్చని భావిస్తున్నారు.

3603
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles