ఇనాం భూమి ఇతరులకు పట్టా

Sat,September 14, 2019 02:02 AM

-ఎల్లారెడ్డిపేటలో రెవెన్యూ లీల
-శ్మశానవాటిక నిర్మాణానికి గ్రామపంచాయతీ తీర్మానం
-ఠాణాలో ఫిర్యాదుచేసిన పట్టాదారు
-ఇనాం భూమికి ఇతరులకు పట్టా ఏమిటని గ్రామస్థుల నిలదీత

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో 70 ఏండ్ల కింద ఓ పూజారికి 38 గుంటల భూమి ఇనాంగా వచ్చింది. అతని కుటుంబం ఊరు విడిచి వెళ్లడంతో ఆ భూమిలో శ్మశానవాటిక నిర్మించాలని గురువారం గ్రామపంచాయతీ తీర్మానించింది. పక్క పొలం రైతు ఆ భూమిని కొన్నానని, అధికారులు పాస్‌పుస్తకం కూడా ఇచ్చారని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో వివాదం మొదలైంది. శుక్రవారం గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్‌లోని సర్వే నంబర్ 460లో 38 గుంటల భూమి అదే గ్రామానికి చెందిన పూజారి రాఘవులుకు 70 ఏండ్ల కింద ఇనాంగా వచ్చింది. ఆ కుటుంబం ఊరువిడిచి వెళ్లిపోవడంతో సదరు భూమిని శ్మశానవాటిక కోసం వినియోగించుకొంటున్నారు. ఈ క్రమంలో శ్మశానవాటికకు పొరుగున ఓ వ్యక్తికి భూమి ఉండటంతో.. రాఘవు లు వద్ద సదరు భూమిని తాను కొన్నానని, అది తమదేనని వాదించడంతో 2017లో గ్రామస్థులతో వివాదంచెలరేగింది. వెంటనే అధికారులు సర్వే నిర్వహించారు. మోఖామీదికి వెళ్లి చుట్టుపక్కల రైతుల వాంగ్మూలం తీసుకొన్నారు. గ్రామస్థులు, నాయకుల సమక్షంలో పంచనామా చేసి వెళ్లిపోయారు.

2018లో ఈజీఎస్ కింద మంజూరైన శ్మశానవాటిక నిర్మాణానికి ఈ 38 గుంటల్లోనే భూమిపూజచేశారు. 2018లోనే భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా సదరు భూమిలోనుంచి 15 గుంటలకు పక్క పొలం రైతుకు అప్పటి రెవెన్యూ అధికారులు పట్టాచేసి, పాస్‌పుస్తకం ఇచ్చారు. శ్మశానవాటికను నిర్మించేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం గురువారం తీర్మానించి స్థలాన్ని చదునుచేయించింది. దీంతో సదరు భూమి పట్టాదారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి గ్రామానికి చెందిన నలుగురిపై ఫిర్యాదుచేశారు. దీంతో గ్రామస్థులు పెద్దమొత్తంలో ఠాణాకు, తాసిల్ కార్యాలయానికి వెళ్లారు. ఇనాం భూమిని పట్టాచేస్తే వారసులకు చేయాలని, అలాకాకుండా పక్క పొలం రైతుకు పట్టా ఎలా చేస్తారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. దీనిపై తాసిల్దార్ శ్రీకాంత్‌ను వివరణ కోరగా.. ఎప్పటినుంచి పట్టాదారు కబ్జాలో ఉన్నాడో పూర్తి వివరాలు సేకరించి గొడవలు లేకుండా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

564
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles