పల్లె ప్రగతికి పట్టం


Tue,September 10, 2019 03:19 AM

rs 1507 crore for women and child welfare

-ప్రతినెలా రూ.339 కోట్లు
-పంచాయతీలకు రూ.2,714 కోట్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పల్లెలు ప్రగతిబాటన పరుగులు పెట్టనున్నాయి. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక ప్రకటించిన సీఎం కేసీఆర్.. బడ్జెట్‌లో అందుకు అనుగుణంగా నిధులు కేటాయించారు. ఎస్‌ఎఫ్సీ, ఆర్థికసంఘం నుంచి ప్రతినెలా రూ.339 కోట్లు కేటాయించను న్నారు. బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.18,237 కోట్లు కేటాయించారు. దీనిలో ప్రగతిపద్దు రూ.14,165 కోట్లు. గ్రామ పంచాయతీలకు రూ.2,714 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.1,764 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం పంచాయతీల్లో కొనసాగుతున్న 30 రోజుల ప్రణాళిక కోసం రూ.339 కోట్లు కేటాయించారు.

ఆసరాకు అభయం

ఆసరా పింఛన్‌దారులకు ఎలాంటి ఢోకాలేదని ప్రభుత్వం స్పష్టంచేసింది. బడ్జెట్‌లో ఆసరా పింఛన్ల కోసం రూ.9 వేల కోట్లను ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 39 లక్షల మందికిపైగా ఆసరా అందుతున్నది. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు రూ.2,016, వికలాంగులు, వృద్ధకళాకారులకు రూ.3,016 చొప్పున పింఛన్లను అందిస్తున్నారు. ఇప్పటివరకు 65 ఏండ్లుపైబడిన వృద్ధులకు ఆసరా అందుతుండగా.. అర్హత వయస్సును 57 ఏండ్లకు కుదించారు. దీంతో త్వరలోనే మరో 7 లక్షల మందికిపైగా పెన్షన్ అందుతుందని భావిస్తున్నారు. ఈ పింఛన్ల కోసం బడ్జెట్‌లో రూ.9,402 కోట్లు ప్రతిపాదించారు.

మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.1,507 కోట్లు

మహిళా, శిశు సంక్షేమశాఖకు రూ.1,507 కోట్లు కేటాయించారు. గర్భిణులు, మూడేండ్లలోపు చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మిని అందిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గినట్టు ఇటీవల నీతి ఆయోగ్ కూడా తేల్చింది. ఈ నేపథ్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు.

త్వరలోనే లబ్ధిదారులకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు

గృహనిర్మాణశాఖ ద్వారా లబ్ధిదారులకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లను అందించనున్నారు. బడ్జెట్‌లో ఇండ్ల నిర్మాణం కోసం రూ. వెయ్యి కోట్లను కేటాయించారు. వీటితోపాటుగా ఆయా బ్యాంకులు, హడ్కో నుంచి రుణాలు తీసుకోనున్నారు. ఇప్పటికే దాదాపు 98 వేల డబుల్‌బెడ్‌రూం ఇండ్లు 90 శాతం నిర్మాణాలు పూర్తిచేసుకున్నాయి. త్వరలోనే ఇవన్నీ లబ్ధి దారులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.

357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles