పల్లె ప్రగతికి మేము సైతం

Fri,November 15, 2019 02:43 AM

-వితరణలతో ప్రముఖుల భాగస్వామ్యం
-గ్రామాల అభివృద్ధికి రూ.24.37 కోట్ల నగదు విరాళం
-శ్మశానవాటికలకు 20 ఎకరాలకుపైగా భూమి
-14 ట్రాక్టర్లు.. 10 ట్రాలీలు.. 45 వేల ట్రీ గార్డులు
-సీఎం కేసీఆర్ పిలుపుతో ముందుకొచ్చిన దాతలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకొస్తున్నారు. తాము పుట్టిపెరిగిన పల్లెల్లో కనీససౌకర్యాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకోసం తమవంతుగా పాటుపడుతున్నారు. సీఎం కే చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు తలోచేయి వేసి.. పల్లె ప్రగతికి మేముసైతం అంటూ స్ఫూర్తినిస్తున్నారు. ఇటీవల 30 రోజులపాటు నిర్వహించిన పల్లెప్రగతి సందర్భంగానే విరాళాలు మొదలైనా.. పలుగ్రామాల్లో ఇంకా దాతల ఔదార్యం కొనసాగుతూనే ఉన్నది. ఇతర ప్రాంతాల్లో స్థిరపడినవారు, ఆర్థికంగా స్థోమత కలిగినవారు, ఉన్నతస్థాయిలో స్థిరపడినవారే కాకుం డా.. గ్రామాల్లో రైతులు తమవంతు సాయంచేస్తూ గ్రామ పంచాయతీ బోర్డులపై చిరస్థాయిగా నిలుస్తున్నారు.

దాతల ఔదార్యం

సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు సాగిన పల్లెప్రగతి ప్రణాళిక అమలుకు ముందు ఉన్నతాధికారులు, కొంతమంది సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. గ్రామంనుంచి ఉన్నతస్థాయిలో ఉన్నవారు, ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్నవారు, వ్యాపారపరంగా స్థిరపడినవారి నుంచి పల్లెల ప్రగతికి విరాళాలు సేకరించాలని సూచించారు. సెప్టెంబర్ 6న వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌లో మంత్రి దయాకర్‌రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా అదే గ్రామానికి చెందిన కావేరీ సీడ్స్ అధినేత భాస్కర్‌రావు రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.

ఇతర గ్రామాల్లోనూ వందలు, వేలు మొదలుకొని.. లక్షలు, కోట్లలో విరాళాలు అందాయి. వివిధ గ్రామాలకు ఇప్పటివరకు 11,032 మంది దాతలు రూ.24.37 కోట్ల నగదు విరాళాలుగా ఇచ్చినట్టు పంచాయతీరాజ్‌శాఖ ప్రకటించింది. డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలకోసం దాదాపు 12 జిల్లాల పరిధిలో 20.6 ఎకరాలను పలువురు దానంచేశారు. 14 పంచాయతీల పరిధిలో పరిశుభ్రతకోసం ట్రాక్టర్లు ఇచ్చారు. మరో 10 ట్రాలీలు కూడా గ్రామపంచాయతీలకు విరాళంగా వచ్చాయి. వీటితోపాటు 6,300 డస్ట్‌బిన్లు, మొక్కల సంరక్షణకు 45 వేల ట్రీగార్డులు విరాళంగా వచ్చాయి.

పంచాయతీలకు ట్రాక్టర్లు

మరోవైపు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ లేదా ట్రాలీ, ట్యాంకర్, చదును చేసే బ్లేడ్ ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంచాయతీ నిధుల నుంచి ట్రాక్టర్లను కొనుగోలుచేశారు. వీటిని ప్రస్తుతం ప్రతి పంచాయతీకి పంపిణీ చేస్తున్నారు.

403
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles