అన్నదాతకు అధిక భరోసా

Tue,September 10, 2019 02:06 AM

- వ్యవసాయ, అనుబంధరంగాలకు ప్రాధాన్యం
- బడ్జెట్‌లో రూ.22,124.73 కోట్లు కేటాయింపు
- రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి విద్యుత్‌ సబ్సిడీ కొనసాగింపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతుబంధు, రైతు బీమా పథకాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని సీఎం కేసీఆర్‌ మరోసారి స్పష్టంచేశారు. ఈ పథకాలతోపాటు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సబ్సిడీ, రైతుల రుణాల మాఫీ కోసం బడ్జెట్‌లో పెద్దఎత్తున నిధులు ప్రతిపాదించారు. 2019-20 బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధరంగాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ రూ.22,124.73 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ వ్యయం కింద రూ.2,226.18 కోట్లు.. ప్రగతి పద్దు కింద రూ.19,898.54 కోట్లు కేటాయించారు. వ్యవసాయం, ఉద్యానశాఖకు రూ. 20,566.36 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్‌, సహకారశాఖకు రూ.105.65 కోట్లు, పశుసంవర్ధక, మత్స్యశాఖలకు రూ. 1,452.72 కోట్లు ప్రతిపాదించింది. రైతుబంధు పథకం కింద ఎకరానికి ఇస్తున్న సహాయాన్ని రూ.8 వేలనుంచి రూ.10 వేలకు పెం చి యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. ఇందుకోసం బడ్జెట్‌లో సుమారు రూ.12 వేలకోట్లు కేటాయించారు.

రైతుబీమా ప్రీమియం చెల్లింపు కోసం రూ.1,137 కోట్లు ప్రతిపాదించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లు కేటాయించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను కొనసాగించడానికి వీలుగా రూ.8వేల కోట్లు ప్రతిపాదించారు. పశుసంవర్ధక, మత్స్యశాఖ అభివృద్ధి కోసం రూ.1,452 కోట్లు ప్రతిపాదించగా.. ఉద్యానశాఖలో సూక్ష్మసేద్యం, మత్స్యశాఖలో ఉచిత చేపల పంపిణీ వంటి పథకాలకూ కేటాయింపులు జరిపారు. ఆర్థికమాంద్యం ప్రభావంతో వివిధ శాఖల బడ్జెట్‌ కేటాయింపుల్లో కోతలు ఉన్నప్పటికీ వ్యవసాయశాఖ పద్దులో తగ్గుదల లేకుండా ప్రభుత్వం కేటాయింపులు చేసింది.

653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles