నేటినుంచి స్కూళ్లు

Mon,October 21, 2019 03:40 AM

-విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు.. అన్ని బస్‌పాస్‌లు చెల్లుబాటు
-బస్‌పాస్‌లున్న విద్యార్థులు టికెట్ తీసుకోవద్దు
-షెడ్యూల్ ప్రకారం బస్సులను నడుపాలని నిర్ణయం
-ముందస్తుగా సాయంత్రం వేళల్లోనే డ్రైవర్లకు టోకెన్లు
-గ్రేటర్ పరిధిలో డ్రైవర్లకు రూ.250 పెంచే ఆలోచన
-అధికారులతో పలుమార్లు సమీక్షించిన మంత్రి పువ్వాడ
-ఇక పూర్తిస్థాయిలో సేవలందించేందుకు ఏర్పాట్లు
-72% తిరిగిన ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దసరా సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు సోమవారం నుంచి పున: ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నది. బస్సుల్లో పాస్‌లన్నీ చెల్లుబాటు అవుతాయని, బస్‌పాస్‌లున్న విద్యార్థులు టికెట్ తీసుకోరాదని, టికెట్ తీసుకోవాలని బలవంతం చేస్తే ఫిర్యాదుచేయాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. విద్యార్థులకోసమే బస్సులు వెళ్లే ప్రాంతాల్లో కచ్చితంగా బస్సులు నడిపించాలని నిర్ణయం తీసుకొన్నారు. విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతుండటంతో.. ప్రజారవాణాపై ఆర్టీసీ సమ్మె ప్రభావం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదివారం ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసు నుంచి ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో పలుమార్లు సమీక్షించారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, జేటీసీ, డీటీసీలతో చర్చించారు. సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఉదయం పది గంటల నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ, రవాణా అధికారులు, డిపో మేనేజర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నారు. సోమవారం నుంచి విద్యాసంస్థల బస్సులు ప్రజా రవాణాకు తిరిగే అవకాశాలు లేకపోవడంతో ప్రైవేట్ బస్సులు, సెవెన్ సీటర్ ఆటోలు, ఇతర వాహనాల సంఖ్యను పెంచాలని మంత్రి పువ్వాడ ఆర్టీవోలకు ఆదేశాలిచ్చారు. ఆర్టీసీ పరిధిలోని గరుడ, రాజధాని ఏసీ బస్సులు మినహా.. ప్రతి బస్సును నిర్దేశించిన రూట్లలో నడపాలని.. పల్లె వెలుగు బస్సులను యథాతథంగా పాత తరహాలోనే తిప్పాలని డిపోల్లో షెడ్యూలును ఖరారుచేశారు.

తాత్కాలిక డ్రైవర్లకు ప్రతిరోజు సాయంత్రం విధులు ముగియగానే మర్నాటికి సంబంధించిన రూటు, బస్ టోకెన్‌ను అప్పగించాలని నిర్ణయించారు. దీంతో ఉదయం డిపోకు వెళ్లే డ్రైవర్లు ఆలస్యం చేయకుండా బస్సును తీసుకొని వెళ్లడానికి వీలవుతుంది. దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లకు ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్ డ్యూటీల మాదిరిగానే రోజు విడిచి రోజు విధులను అప్పగించనున్నారు. సమ్మెకు ముందు నిర్వహించిన మాదిరిగానే కాలమాన పట్టికను సోమవారం నుంచి పకడ్బందీగా అమలుచేస్తారు. కొన్ని జిల్లాల్లో డిపో మేనేజర్లు బస్సుల కండిషన్లను సాకుగా చూపిస్తూ బయటకు వెళ్లనీయడంలేదని.. ఈ క్రమంలో బస్సుల కండిషన్లను పరిశీలించి, ట్రయల్న్ చేసి నడిపించడానికి రవాణాశాఖ అధికారులకు ప్రత్యేక అధికారాలిచ్చారు. గరుడ, రాజధాని ఏసీ బస్సులను మాత్రం తాత్కాలిక డ్రైవర్లకు ఇవ్వరాదని, వీటిని నడుపడానికి డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని.. అందువల్లనే వాటిని బయటకు తీయడంలేదని మంత్రి పేర్కొన్నారు.

సాధారణస్థాయికి ప్రజారవాణా

రాష్ట్రంలో సగటున 70 శాతం ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయని, సోమవారం నుంచి 95 శాతం పైగా బస్సులు తిరిగేవిధంగా చూడాలని డిపోలకు రవాణామంత్రి ఆదేశాలిచ్చారు. సోమవారం ఉదయం నుంచి అన్ని డిపోల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రిపోర్ట్‌చేయాలని, ఆలస్యంచేయకుండా, సమయపాలన ప్రకారం బస్సులను గమ్యస్థానాలకు చేర్చాలని రవాణాశాఖ ఆదేశించింది. ప్రతి డిపోకు నియమించిన నోడల్ అధికారుల బృందం ఉదయం నాలుగు గంటల నుంచి టైంటేబుల్‌ను పర్యవేక్షించాలని సూచించింది. నోడల్ అధికారులకు సహాయంగా ఐదుగురు అధికారుల బృందాన్ని డిపోల్లో ఏర్పాటుచేసినట్లు రవాణాశాఖ వెల్లడించింది. అత్యవసర సేవల నిమిత్తం ప్రతి డిపోలో అదనంగా 20 మంది డ్రైవర్లు, కండక్టర్లను అందుబాటులో ఉంచుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, వివిధ సంస్థలకు చెందిన బస్సులకు కూడా సోమవారం నుంచి రూట్లను ఖరారుచేస్తున్నారు. ప్రైవేట్ బస్సులకు కేటాయించిన రూట్ల వివరాలను ఆర్టీవో కార్యాలయాల్లో షెడ్యూలులో ఉంచుతున్నారు. ఇప్పటికే డిపోల్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూంలు యథాతథంగా కొనసాగుతాయి.

కఠినంగా టికెట్ల విధానం అమలు

సోమవారం ఉదయం నుంచి ప్రతి ఆర్టీసీ బస్సు, అద్దె బస్సుల్లో టికెట్లు కచ్చితంగా ఇవ్వనున్నారు. తాత్కాలిక కండక్టర్లకు టికెట్ జారీ యంత్రాలను అప్పగించారు. నిర్దేశిత ధరల కంటే ఒక్క రూపాయి అదనంగా తీసుకొన్నా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎవరైనా టికెట్ చార్జీల కంటే అదనంగా వసూలుచేస్తే ఫిర్యాదు చేయడానికి డ్రైవర్‌సీటు వెనుకవైపు ఫోన్ నంబర్లు ప్రకటించారు. వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు కూడా కండక్టర్లుగా బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వోద్యోగులైతే టికెట్లు ఇవ్వడం, పాస్‌లను అనుమతించడం కచ్చితంగా చేస్తారని భావిస్తున్నారు.

శ్రామికులుగా ఐటీఐ విద్యార్థులు

ఐటీఐ విద్యార్థులకు శ్రామికులుగా అవకాశం కల్పించాలని రవాణాశాఖ భావిస్తున్నది. మూడురోజులకొకసారి బస్సుల చెకింగ్, ఓవరాలింగ్ వంటి పనులను శ్రామికులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఐటీఐ విద్యార్థులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని నిర్ణయించారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని డిపోల్లో ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు రవాణా అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఇక్కడ పనిచేస్తున్న తాత్కాలిక డ్రైవర్ల వేతనాలను రూ.250 పెంచాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్‌కు రూ.1500 చెల్లిస్తుండగా పెంపుదలపై సోమవారం నిర్ణయం తీసుకొంటారు.

రోడ్డెక్కిన 72 శాతం ఆర్టీసీ బస్సులు

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సత్ఫలితాలనిస్తున్నాయి. రవాణా, ఆర్టీసీ, రెవెన్యూ, పోలీసు విభాగాల సమన్వయంతో ప్రయాణికులకు నాణ్యమైన రవాణాసేవలు అందుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 72 శాతం ఆర్టీసీ బస్సులు సేవలందించినట్లు ఆర్టీసీ యంత్రాంగం వెల్లడించింది.. మొత్తం 6,437 బస్సుల్లో 4,502 ఆర్టీసీ బస్సులు, 1,935 అద్దె బస్సులు ఉన్నట్లు తెలిపారు. 4,502 ప్రైవేటు డ్రైవర్లు, 6,437 మంది ప్రైవేటు కండక్టర్లు విధులు నిర్వహించినట్లు పేర్కొన్నది. బస్సుల్లో టికెట్లు ఇవ్వటం ప్రారంభించినట్లు, టిమ్స్ ద్వారా అన్ని బస్సుల్లో టికెట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. తాత్కాలిక ఉద్యోగుల సహాయంతో ఆర్టీసీ సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయని ప్రకటించింది. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో బస్సుసేవలు అందించేందుకు పూర్తి ఏర్పాట్లుచేస్తున్నట్లు తెలిపింది.

2996
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles