కోదాడలో విషాదం


Mon,April 15, 2019 02:01 AM

sevan dead in road accident near Kodad

-ఆటోను ఢీకొన్న లారీ.. ఏడుగురు దుర్మరణం
-మృతుల్లో ఐదుగురు మహిళలు.. ఇద్దరు పురుషులు
-సీతారాముల కల్యాణానికి వెళ్లివస్తుండగా ప్రమాదం

కోదాడ రూరల్: సూర్యాపేట జిల్లాలో కోదాడ-ఖమ్మం ప్రధాన రహదారిపై ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని తిలకించి ఆటోలో వస్తున్న ఏడుగురిని మృత్యురూపంలో వచ్చిన సిమెంట్ లారీ కబళించింది. ఆటోలో ప్రయాణిస్తున్న పది మందిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. పోలీసులు, బాధితుల బంధువుల వివరాల ప్రకారం.. కోదాడకు రెండు కిలోమీటర్ల దూరంలోని తమ్మర శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగిన కల్యాణానికి కోదాడ తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని సిరి అపార్ట్‌మెంటులో ఉండే నలుగురు మహిళలతోపాటు కోదాడకు చెందిన మరో ఐదుగురు భక్తులు వెళ్లి ఆటోలో తిరిగి నివాసాలకు బయలుదేరారు.
AUTO
ఖమ్మం-కోదాడ ప్రధాన రహదారిపై కోదాడకు వస్తుండగా ఖమ్మం క్రాస్‌రోడ్డు సమీపంలో వీరు వెళ్తున్న ఆటో ముందు ప్రయాణికులు దిగుతున్న మరో ఆటో, దాని వెనుక కారు ఆగి ఉన్నాయి. వాటిని దాటేందుకు కుడివైపునకు వస్తుండగా అదే సమయంలో కోదాడ నుంచి ఖమ్మం సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీని ఢీకొట్టింది.

దీంతో ఆటో నుజ్జునుజ్జయ్యింది. ఆటోలో ప్రయాణిస్తున్న కోదాడకు చెందిన బేతు లక్ష్మయ్య (65), బేతు నాగమణి (60), మాతానగర్‌కు చెందిన నర్మినేని సుగుణ (45), గుండపనేని పద్మ (50), తమ్మర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎస్కే అబ్బాస్ (48) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వట్టికొండ శైలజ (40), అంబటి సైదమ్మ (38) చికిత్స కోసం ఖమ్మం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మిగతా ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. స్వల్పంగా గాయపడిన మరొకరు కోదాడ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కల్యాణంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు సమాచారం తెలియడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Road-acedent
కోదాడ దవాఖానలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు.

మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై విద్యాశాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. శ్రీ సీతారాముల కల్యాణాన్ని తిలకించి వస్తున్న క్రమంలో ప్రమాదం జరుగడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబసభ్యులు మనోధైర్యం కోల్పోవద్దని, మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రమాద ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. మృతిచెందిన వారికి సంతాపం ప్రకటించారు.

4644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles