అధిక చార్జీలు వద్దు

Thu,October 10, 2019 03:55 AM

-సమ్మెనెపంతో ప్రయాణికులపై భారం మోపొద్దు
-మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్
-సిరిసిల్లలో ఆకస్మిక పర్యటన.. అధికారులతో సమీక్ష
-సొంత ఖర్చుతో పంచాయతీ సిబ్బందికి బీమా
-రూ.4లక్షల చెక్కు జిల్లా కలెక్టర్‌కు అందజేత
బతుకమ్మ చీరలు మంచిగున్నయ్

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ సమ్మె నెపంతో ప్రయాణికుల నుంచి అధిక చార్జీలను వసూలు చేయొద్దని, ఆదేశాలను ధిక్కరిస్తే కఠినచర్యలు తప్పవని ప్రైవేట్ బస్సు సర్వీసుల యజమానులను ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు వెంటనే కంట్రోల్ రూం ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. తొలు త బైపాస్‌రోడ్డులోని ఎమ్మెల్యే అతిథిగృహంలో అన్నిశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. జిల్లాలో 30 రోజుల ప్రణాళికను విజయవంతం చేసినందుకు అధికారులను, సహకరించిన ప్రజలను, ప్రజాప్రతినిధులను అభినందించారు. జిల్లావ్యాప్తంగా 1,200 మంది పంచాయతీ సిబ్బంది, కార్మికులకు సొంత ఖర్చులతో బీమా చేయిస్తున్నట్టు ప్రకటించిన మంత్రి, ఏడాది బీమా ప్రీమియం రూ.4 లక్షల చెక్కును కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు అందజేశారు.

ప్రణాళికను నిరంతరం కొనసాగించాలని, అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అందుకు మహిళలు, కులసంఘాల సభ్యులు, యువతను సంఘటిత పరచాలని, గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటుచేసి ఘనవ్యర్థాల నిర్వహణ చేపట్టాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వపరంగా సహకారం అందించి పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను అప్పగిస్తామని, తద్వారా వారు ఆదాయం పొందేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. చెత్త సేకరణ, తరలిం పు కోసం జిల్లావ్యాప్తంగా వాహనాలు ఎన్ని అవసరమో అంచనాలు సిద్ధంచేయాలని, స్వచ్ఛ పల్లెల కోసం ఏడాది క్యాలెండర్‌ను రూపొందించాలని ఆదేశించారు.

మరుగుదొడ్లపై స్పెషల్ డ్రైవ్

ఇంకుడుగుంత, మరుగుదొడ్డి లేని ఇల్లంటూ ఉండకూడదని, అదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రతి ఇంట్లో వాటిని నిర్మించుకొనేలా అవగాహన కల్పించాలని, అందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎగువ మానేరు నుంచి సిరిసిల్ల వరకు ఉన్న మానేరుకు ఇరువైపులా మొక్కలను నాటాలని సూచించారు. వారంరోజుల్లో సరిహద్దు గ్రామాల ప్రజలంతా కలిసి హరితహారంలో పాల్గొనేలా చూడాలని, తర్వాత చెరువులు, వాగులు, కాల్వల వెంట మొక్కలు నాటాలని ఆదేశించారు. నెలలో ఒక వారం పారిశుద్ధ్యం, ఇంకుడుగుంతలు, శిథిలమైన ఇండ్లు తొలగింపు వంటి కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మిషన్ భగీరథను 99 శాతం పూర్తిచేసిందని, అయినా ప్రజలు బబు ల్ వాటర్ తాగడానికి మొగ్గు చూపుతున్నారని, భగీరథ నీరు ఎంత స్వచ్ఛమైనదో, ఆరోగ్యానికి ఎంత మేలో ప్రజలకు కళాజాతాల ద్వారా వివరించాలని సూచించారు. అనంతరం తంగళ్లపల్లికి చెందిన ఆకుల వెంకటేశం, నేరెళ్లకు చెందిన చందర్‌కు రూ.80వేల విలువైన జూపిటర్ ట్రైవీలర్ వాహనాలను సొంత ఖర్చులతో అందజేసిన మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.

సమీక్ష అనంతరం మంత్రి కేటీఆర్ తంగళ్లపల్లి మండలంలోని మండెపల్లి గ్రామాన్ని సందర్శించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎల్లయ్య నీ ఆరోగ్యం బాగుందా.. ఊరు సాపయిందా అంటూ స్థానికులను ఆప్యాయంగా పలుకరించారు. గ్రామస్థులతో ముచ్చటించి ప్రణాళికపై వారి అభిప్రాయాలను తెలుసుకొన్నారు. ఊరిలో గటార్లు, రోడ్లు, వాడలను శుభ్రం చేసుకున్నామని పలువురు తెలుపగా మంత్రి సంతోషం వ్యక్తంచేశారు. ఈ ఏడాది బతుకమ్మ చీరలు ఎట్లున్నయ్ అంటూ మహిళలను మంత్రి అడుగగా, అందుకు నక్క అమృత ముందుకు వచ్చి మరీ సర్కారు ఇచ్చిన చీరలు మంచిగున్నయ్. వాటిని కట్టుకొనే బతుకమ్మ ఆడుకున్నం అంటూ మురిసిపోయారు.

డోంట్ వర్రీ నేనున్నా..

మండేపల్లిని సందర్శించిన మంత్రి కేటీఆర్‌ను గ్రామస్థుడు దారవేణి చంద్రయ్య కలిసి తన గోడు వెళ్లబోసుకొన్నారు. రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిన్నదని, చికిత్స చేయించుకొనే ఆర్థిక స్తోమత లేదని, పని చేసుకొంటనే పొట్ట గడుస్తున్నదని విన్నవించుకొన్నారు. కేటీఆర్ బాధితుడిని దగ్గరకు తీసుకొని డోంట్ వర్రీ నీకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. చికిత్స చేయించి ఆదుకొంటానని హామీ ఇచ్చారు.

2298
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles