తెలంగాణకు పాటే ప్రాణం

Fri,November 8, 2019 02:38 AM

-రాష్ట్ర పరిణామాలన్నింటిలోనూ పాట కీలకం: సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి
-శ్రమజీవుల కష్టసుఖాల్లోంచే పాట:సీఎంవో ఓఎస్డీ దేశపతి
-మనిషికి ఎంత చరిత్రో.. పాటకు అంతే: అంపశయ్య నవీన్
-తెలంగాణ పాట -సమగ్ర సమాలోచనపై జాతీయ సదస్సు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నాగరిక సమాజాలు పాట ప్రాధాన్యాన్ని కోల్పోతున్న దశలో తెలంగాణ సమాజం పాటను ప్రాణంగా భావించి రక్షించుకున్నదని రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి చెప్పారు. పాట ఆధారంగా ఉద్యమాలను నిర్మించిన ఘనత తెలంగాణకే దక్కుతుందని పేర్కొన్నారు. తెలంగాణ పాట శ్రమజీవులు, రైతులు, ప్రజల కష్టసుఖాల నుంచి పుట్టుకొచ్చిందని సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ చెప్పారు. పాట శ్రామికుల నుంచే పుట్టి విస్తరించిందని అంపశయ్య నవీన్ వివరించారు. ఓయూ తెలుగుశాఖ నూరు వసంతాల సందర్భంగా నిజాం కళాశాల, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అసోసియేషన్ తెలంగాణ సంయుక్త నిర్వహణలో తెలంగాణ పాట - సమగ్ర సమాలోచన అంశంపై రెండు రోజుల జాతీయసదస్సు గురువారం బషీర్‌బాగ్ నిజాంకళాశాల ఆడిటోరియంలో ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఏ ఉత్సవంలోనైనా పాట ప్రధానమని, పుట్టుక నుంచి చావు వరకు అన్ని దశల్లో పాట కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ అంటే పాట గుర్తొస్తుందని, జీవితాన్ని సరిదిద్దడానికి, కష్టసుఖాలు పంచుకోవడానికి దుఃఖం, కోపం, నిరసన, ఉద్యమంలోనూ పాట వెన్నంటి ఉన్నదని చెప్పారు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమంతో పాటు రాజకీయ, సామాజిక పరిణామాలన్నింటిలోనూ పాట కీలకమైందని, అచల తత్వాన్ని ప్రచారం చేయడానికి వేల పాటలు సృష్టించిన ప్రత్యేకత తెలంగాణదని అన్నారు. తెలంగాణ జీవితానికి పాటకు ఉన్న బంధాన్ని విడమరిచి చెప్పడానికి సదస్సు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వాలను కూల్చేసిన చరిత్ర పాటదే

ఏటికేతం బట్టి వెయ్యి పుట్లు పండించి.. ఎన్నడూ మెతుకెరుగరన్నా.. నేను గంజిలో మెతుకెరుగరన్నా అనే రైతు కష్టాన్ని వర్ణిస్తూ వచ్చిన పాట, పల్లెటూరి పిల్లగాడా, పశులగాసే మొనగాడా..పాలు మరిచి ఎన్నాళ్లయ్యిందో పాలబుగ్గల జీతగాడా.. అంటూ వెట్టిచాకిరిలో మగ్గిన బాల కార్మికుని జీవితాన్ని విశ్లేషిస్తూ వచ్చిన పాటలు ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అరుదుగా కనిపిస్తాయని దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. పుల్లాల మంటివిగదరో.. ఇదిగో పులి పిల్లాలమై వచ్చినం రో.. ఒక్కరోజూ కూడా ఒక్క నిమిషం సేపు దుక్కి దున్నని దున్నపోతువు నీవు.. దిక్కు తెల్వని భూములెక్కడవి? అంటూ సుద్దాల అశోక్‌తేజ రాశారని గుర్తుచేశారు. ఇలాంటి పాటలు జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విస్నూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డిలకు సంబంధించిన భూముల నేపథ్యం నుంచి వచ్చాయని తెలిపారు. నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ.. అంటూ నందిని సిధారెడ్డి రచించిన పాట భూమితో రైతుకు, తెలంగాణ సంస్కృతి, రైతాంగ ఇతివృత్తాన్ని వర్ణించిందని చెప్పారు.

వానమ్మ.. వానమ్మా.. ఒక్కసారన్న వచ్చిపోవే.. వానమ్మా అంటూ కరువు రక్కసిపై జనరంజకమైన పాట వచ్చిందని, ఆఖరికి ప్రభుత్వాలను కూల్చేసి, ఇంకొక ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన అద్భుతమైన శక్తిని ప్రదర్శించిన తిరుగులేని ఆయుధం పాట అని వివరించారు. మనిషికి ఎంత చరిత్ర ఉందో.. పాటకూ అంతే చరిత్ర ఉందని ఆత్మీయఅతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాట ప్రముఖ పాత్ర పోషించిందని గుర్తుచేశారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, జీవీ ఆనంద్‌కుమార్, వెల్దండ నిత్యానందరావు, ఎం గోనానాయక్, సీతా రాం, ఓ కృష్ణయ్య, సాగి కమలాకరశర్మ, వడ్డేపల్లి కృష్ణ, సంగిశెట్టి శ్రీనివాస్, అట్టెం దత్తయ్య, తాళ్లపల్లి యాద మ్మ, ఎం అరవింద, పగడాల నాగేందర్, కోయి కోటేశ్వర్‌రావు, వేలేటి శైలజ, సాగర్ల పద్మ, డీ రాంబాబు సమాలోచన, పత్ర సమర్పణ, వందన సమర్పణలో పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని రిజిస్ట్రార్ ఆచార్య సీహెచ్ గోపాల్‌రెడ్డి ప్రారంభించగా నిజాం కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య ఎల్బీ లక్ష్మీకాంత్‌రాథోడ్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. సదస్సులో ఆచార్య సూర్యా ధనుంజయ్, కనప నరేందర్, ఏ విజయలక్ష్మి, పగడాల నాగేందర్, రఘు తదితరులు పాల్గొన్నారు.

411
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles