కమనీయంగా సీతారాముల కల్యాణం


Mon,April 15, 2019 02:07 AM

Sri Seeta Rama Kalyanam In Bhadrachalam

-వీక్షించిన లక్షలమంది భక్తజనం
-లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనంతో మురిసిన భద్రాద్రి
-పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
-నేడు శ్రీరామ పట్టాభిషేకం.. హాజరుకానున్న గవర్నర్ నరసింహన్

భద్రాచలంలో ఆదివారం శ్రీసీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది భక్తులు స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. కుటుంబం తరపున వ్యక్తిగతంగా సీతారామచంద్రస్వామివారికి పట్టువస్ర్తాలను పంపించారు. ఈ పట్టువస్ర్తాలను దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ అందజేశారు.

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం శ్రీసీతారాముల కల్యాణం కనుల పండువగా జరిగింది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది భక్తులు స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముందుగా రామాలయాన్ని సందర్శించిన మంత్రి.. అక్కడ పూజల అనంతరం కల్యాణ మండపానికి చేరుకొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. కుటుంబం తరపున వ్యక్తిగతంగా సీతారామచంద్రస్వామివారికి పట్టువస్ర్తాలను పంపించారు. ఈ పట్టువస్ర్తాలను దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ అందజేశారు. త్రిదండి చినజీయర్‌స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీరంగక్షేత్రం, శృంగేరి పీఠం నుంచి స్వామివారికి పట్టువస్ర్తాలు, శేషమాలికలు, పవిత్రాలు పంపించారు. రామదాసు వంశం పదోతరంగాఉన్న కంచర్ల శ్రీనివాస్ దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు అందజేశారు.
seetharamakalyanam1

కల్యాణతంతు సాగిందిలా..

శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో తొలుత ధ్రువమూర్తులకు కల్యాణం చేశారు. తరువాత మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా.. భక్తుల జయజయ ధ్వానాల మధ్య పల్లకీలో కల్యాణమండపానికి స్వామివారు తరలివచ్చారు. ముందుగా తిరుకల్యాణానికి సంకల్పం చేసి విశ్వక్సేన పూజ నిర్వహించారు. అనంతరం పుణ్యాహవాచనం జరిగింది. తర్వాత 24 అంగుళాల పొడవుగల 12 దర్భలతో అల్లిన దర్భతాడును సీతమ్మవారి నడుముకు బిగించారు. రామయ్య కుడిచేతికి, సీతమ్మ ఎడమ చేతికి రక్షాసూత్రాలు తొడిగి, స్వామి గృహస్థాశ్రమసిద్ధికోసం సువర్ణయజ్ఞోపవీతాన్ని ధరింపచేశారు. అనంతరం కన్యాదానం చేశారు. వేద మంత్రాల నడుమ అభిజిత్‌లగ్నం సమీపించగానే సీతారాముల శిరస్సుపై జీలకర్ర, బెల్లం ఉంచారు. జనకమహారాజు, దశరథమహారాజు తరపున చేయించిన రెండు మంగళసూత్రాలతోపాటు భక్తరామదాసు సీతమ్మకు చేయించిన మరొక సూత్రం కలిపి మూడుసూత్రాలతో మాంగళ్యధారణ చేశారు.

భద్రాద్రికి పోటెత్తిన భక్తజనం..

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ నుంచే కాకుండా.. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ర్టాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయమే పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు రామాలయంలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. అనంతరం మిథిలాస్టేడియానికి చేరుకొని కల్యాణాన్ని కనులారా తిలకించారు. భక్తుల రాకకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పలు స్వచ్ఛంద సంస్థలు సైతం సేవలందించాయి. ఉచిత అన్నదానం, పానకం, మజ్జిగ, మంచినీటిని అందించాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
seetharamakalyanam4
స్వామివారి కల్యాణాన్ని తిలకించినవారిలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఏపీ హైకోర్టు జడ్జి సోమయాజులు, పొదెం వీరయ్య, హరిప్రియ, రాములునాయక్, మహబూబాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత, మాజీ ఎంపీ బలరాం నాయక్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్‌త్రివేది, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్ర, ఐజీ లా అండ్ ఆర్డర్ నాగిరెడ్డి, కలెక్టర్లు రజత్‌కుమార్‌షైనీ, కర్ణన్, ఎస్పీ సునీల్‌దత్, భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి తాళ్లూరి రమేశ్‌బాబు, దైవజ్ఞశర్మ, డాలర్‌శేషాద్రి తదితరులు ఉన్నారు. దేవస్థానం ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులు, రాఘవాచార్యు లు, స్థానాచార్యులు స్థలసాయి, వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథచార్యులు, ముఖ్య అర్చకులు, అర్చకులు, పరిచారకులు కల్యాణతంతును విజయవంతంగా నిర్వహించారు.

నేడు శ్రీరామ పట్టాభిషేకం

శ్రీసీతారాముల కల్యాణం ఆదివారం అత్యంత వైభవోపేతంగా జరుగగా.. అధికారులు సోమవారం నిర్వహించనున్న శ్రీరామపట్టాభిషేకంపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. పట్టాభిషేకం వేడుకను వీక్షించే భక్తులకు టికెట్లను విక్రయించింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు.
seetharamakalyanam2
seetharamakalyanam3
seetharamakalyanam5

1849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles