స్వైన్‌ఫ్లూపై సమరం

Thu,October 10, 2019 02:39 AM

-33 జిల్లాల్లోని 39 దవాఖానల్లో ప్రత్యేక వార్డులు
-అందుబాటులో మందులు, వెద్య పరికరాలు
-మూడుచోట్ల పరీక్షాకేంద్రాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా స్వైన్‌ఫ్లూ (హెచ్1 ఎన్1) వ్యాధి ప్రబలితే సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సర్వం సిద్ధం చేసుకున్నది. 33 జిల్లాల్లోని 39 దవాఖానల్లో హెచ్1 ఎన్1 వ్యాధికి సంబంధించిన వైద్య సేవలను అందించేందుకు ప్రత్యేక వార్డులను ఏర్పాటుచేశారు. ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం నవంబర్‌లో నెలకొనే వాతావరణానికి అనుగుణంగా హెచ్1 ఎన్1 సోకే ప్రమాదం ఉన్నదని, దీనిని నియంత్రించేందుకు చేపట్టిన ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా దవాఖానల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటుచేయడంతోపాటు మందులు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు. 15 లక్షల ఒసాల్డోవీర్ యాంటీ వైరల్ క్యాప్సల్స్, సిరప్‌లను దవాఖానలకు పంపిణీచేశారు. 3,540 యాంటీ స్వైన్‌ఫ్లూ పిడియాట్రిక్ సిరప్, 11,570 డబుల్ ప్రొటెక్షన్ మాస్క్‌లు, 4,275 హెచ్1 ఎన్1 నిర్ధారణ కిట్లు, 12,200 వైరల్ ట్రాన్స్‌పోర్టు మీడియా కిట్లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. హెచ్1 ఎన్1 నిర్ధారణ కోసం నారాయణగూడలోని ఐపీఎం కేంద్రంతోపాటు ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో కూడా హెచ్1 ఎన్1 నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో కాకుండా ఈ మూడు పరీక్షా కేంద్రాల్లో స్వైన్‌ఫ్లూ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.


-ప్రత్యేక వార్డుల ఏర్పాటు
స్వైన్‌ఫ్లూ వైద్యసేవలను అందించేందుకు 33 జిల్లాల పరిధిలో 39 దవాఖానల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటుచేశారు. అందులో 487 బెడ్లను అందుబాటులో ఉంచారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్, నిలోఫర్, కింగ్‌కోటి జిల్లా దవాఖాన, నాంపల్లి, మలక్‌పేట్ ఏరియా దవాఖానల్లో 167 బెడ్లను అందుబాటులో ఉంచారు. మిగిలిన 32 జిల్లాల్లోని జిల్లా దవాఖానల్లో ప్రత్యేక వార్డులను విభజించి ఒక్కో దవాఖానలో ప్రస్తుతం 10 బెడ్ల చొప్పున 320 అందుబాటులో ఉంచారు. హెచ్1 ఎన్1కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు, ఆయా వైద్యవిభాగాలు తెలుసుకొనేందుకు, తెలియజేసేందుకు రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూంను ఏర్పాటుచేశారు. హెచ్1 ఎన్1 నిర్వహణకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బృందం పనిచేస్తుంది. ఈ రాష్ట్రస్థాయి బృందంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలోని కమ్యూనికబుల్ డిసీజెస్ విభాగం అదనపు డైరెక్టర్ పీఎన్ శోభాదేవి, ప్రోగ్రాం ఆఫీసర్ శివబాల్‌రాజ్‌రెడ్డి, సీహెచ్‌వోలు ఎన్ సునిల్‌రాజ్, విజయ్‌కుమార్, మల్లేశం, ఎంపీహెచ్‌ఈవోలు బసంత్, ఎంఏ బారి, మైక్రోబయాలజిస్ట్ పీ ముక్కంటేశ్వర్ ఉన్నారు.

202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles