యాసంగికి యూరియాపై దృష్టి


Tue,September 10, 2019 03:22 AM

Telangana Agriculture Minister Niranjan reddy review with officials on Urea issue

- జిల్లాలవారీగా సాగు వివరాలు సేకరించండి
- అధికారులతో సమీక్షలో వ్యవసాయశాఖమంత్రి నిరంజన్‌రెడ్డి


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగి సీజన్‌కు అవసరమైన యూరియా అంచనాలను సిద్ధంచేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. అధికారులను ఆదేశించారు. యాసంగి సాగు సమాచారాన్ని అన్నిజిల్లాల నుంచి సేకరించాలని చెప్పారు. బుధవారం (ఈ నెల 11న) ఢిల్లీలో జరుగనున్న కేంద్రప్రభుత్వ సమావేశంలో యాసంగికి అవసరమైన ఎరువుల అంచనాలపై నివేదిక అందజేయాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌ హాకా భవన్‌లో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిరంజన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. యూరియా సరఫరా త్వరితగతిన సాగేందుకు పోర్టు ఇంచార్జి, రైల్వే ఇంచార్జిలతో మంత్రి సంప్రదింపులు జరిపారు.

గంగవరం, వైజాగ్‌, ట్యుటికోరిన్‌, కాకినాడ, కరైకల్‌, కృష్ణపట్నం పోర్టుల నుంచి తెలంగాణకు వస్తున్న యూరియా సరఫరాపై ఆయన ఆరా తీశారు. గుజరాత్‌ హాజీరాలో క్రిభ్‌కో యూనిట్‌, చెన్నై మద్రాస్‌ ఫర్టిలైజర్స్‌ నుంచి తెలంగాణకు యూరియా చేరుతున్నట్టు నిరంజన్‌రెడ్డి తెలిపారు. అధికారులు జిల్లాల్లోని ప్రజాప్రతినిధులతో సంప్రదించి అదనపు అవసరాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు. సోమవారం నిజామాబాద్‌కు 2, మిర్యాలగూడ, కరీంనగర్‌, సనత్‌నగర్‌కు ఒక్కో రేక్‌ యూరియా చేరుకున్నదని ఆయన వెల్లడించారు. సెప్టెంబర్‌లో ఆదివారంనాటికి 64,485 టన్నుల యూరియా చేరుకున్నదని, 33,205 టన్నులు రవాణా మార్గంలో ఉన్నదని, 7,800 టన్నులు వివిధ పోర్టుల్లో రవాణాకు సిద్ధంగా ఉన్నదని వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌రావు, వ్యవసాయశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌, మార్కెటింగ్‌శాఖ ఓఎస్డీ జనార్దన్‌రావు తదితరులు ఉన్నారు.

యూరియా సరఫరాలో వేగం పెంచండి: పార్థసారథి

యూరియా సరఫరాను వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి ఆదేశించారు. సోమవారం వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలో కమిషనర్‌ రాహుల్‌బొజ్జాతో కలిసి ఎరువుల డీలర్లతో సమీక్ష నిర్వహించారు. కంపెనీ నుంచి రావాల్సిన ఎరువులను డీలర్లు త్వరగా తెప్పించుకోవాలని పేర్కొంటూనే.. ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని పార్థసారథి హెచ్చరించారు. రాష్ర్టానికి రోడ్డుమార్గం ద్వారా 3,000 టన్నుల యూరియా అదనంగా చేరిందని, ఈ నెల 12 నాటికి 97,690 టన్నులు చేరుకుంటుందని చెప్పారు.

271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles