రాష్ర్టానికి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు

Wed,November 20, 2019 02:27 AM

-ఢిల్లీలో అందుకున్న మంత్రి ఎర్రబెల్లి
-పల్లె ప్రగతితో పరిశుభ్రంగా గ్రామాలు
-పారిశుద్ధ్య నిర్వహణకు తగిన గుర్తింపు
-స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు రాష్ట్ర పనితీరుకు నిదర్శనం
-మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించాలి
-కేంద్రంఈజీఎస్ నిధులు విడుదల చేయాలి: ఎర్రబెల్లి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ప్రణాళికతో గ్రామాల ముఖచిత్రం మారిందని, అభివృద్ధి పరుగులు తీస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు స్వీకరించిన తర్వాత తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. దేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తెలంగాణ రాష్ట్రం తొలిస్థానం సాధించడం తమ పనితీరుకు నిదర్శనమని, ఈ అవార్డు రావడం మూడోసారి అని చెప్పారు. సీఎం కేసీఆర్ స్వచ్ఛత సంకల్పానికి అవార్డు సంకేతంగా నిలుస్తుందని, మహాత్మగాంధీ 150 జన్మదినం సందర్భంగా తెలంగాణకు గుర్తింపు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా దేశంలోనే తొలిస్థానంలో నిలిచి అవార్డు సాధించిందని గుర్తుచేశారు. జగిత్యాల, సిరిసిల్ల, వనపర్తితో పాటు పలుజిలాప్ల దేశంలో మొదటి 10 నుంచి 20 స్థానాల్లో నిలిచాయని చెప్పారు.

పంచాయతీలకు నిధుల కొరత లేకుండా ప్రతినెలా రూ. 339 కోట్లు విడుదల చేస్తున్నామని, పరిశుభ్రత పాటించేందుకు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి పంచాయతీకి కార్యదర్శి ఉండాలనే లక్ష్యంతో తొమ్మిదివేలకుపైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించినట్టు వివరించారు. పంచాయతీ సిబ్బంది వేతనాన్ని రూ.8,500కు పెంచామని, పంచాయతీరాజ్ శాఖలో 311 అధికారుల పోస్టులను భర్తీచేశామని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన, పీఎంకేవై ద్వారా గ్రామీణ నిరుద్యోగులకు ఎక్కువగా ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం ఉంటుందని తెలిపారు.

మేడారం జాతరకు నిధులు కేటాయించాలి

మేడారంను జాతర జాతీయ ఉత్సవంగా గుర్తించి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి దయాకర్‌రావు చెప్పారు. దాదాపు మూడు కోట్ల మంది భక్తులు వివిధ రాష్ర్టాల నుంచి జాతరకు వస్తారని మరోసారి కేంద్రానికి నివేదించామని తెలిపారు. కేంద్ర గిరిజనశాఖ సెక్రటరీకి విజ్ఞప్తి లేఖ ఇచ్చినట్టు చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.880 కోట్లు విడుదల చేయాలని కోరామన్నారు. ఆర్‌జీఎస్‌వై కింద సర్పంచ్‌లు, కార్యదర్శులకు శిక్షణ ఇవ్వడానికి రూ.100 కోట్లు విడుదలచేయాలని కోరినట్టు పేర్కొన్నారు. పీఎంజీఎస్‌వైలో భాగంగా రాష్ర్టానికి రెండోవిడుతలో 2,400 కిలోమీటర్ల రోడ్లకు అనుమతిచ్చారని, రాష్ట్ర విభజన సమయంలో 1,700 కిలోమీటర్లు తప్పుగా లెక్కించారని, దీనిపై మరోసారి నివేదిస్తామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతికి అన్నిరంగాల్లో అవార్డులు వస్తున్నాయని, దాని ప్రకారం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
errabellidayakarrao1

నైపుణ్య శిక్షణతో బహుళ ప్రయోజనాలు

-ఎంపీలతో సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి
నైపుణ్యాభివృద్ధి శిక్షణతో యువతకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణపై రాష్ట్ర ఎంపీలతో కలిసి ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డీడీయూ, జీకేవై, పీఎంకేకేవై కార్యక్రమాలను సమర్థంగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ఏర్పాటుచేస్తున్నామని, వంద మందికి శిక్షణ ఇచ్చినప్పుడు, కనీసం 60 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే.. పూర్తి నిధులు మంజూరుచేయాలనే నిబంధన ఉన్నదని చెప్పారు. వ్యవసాయంతోపాటు అనుబంధ క్షేత్రాల్లో వాల్యూ యాడిషన్‌కి సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ససమావేశంలో ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, వెంకటేశ్ నేతకాని, సీఆర్డీ కమిషనర్ రఘునందన్‌రావు, తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్‌ఉప్పల్, ఎన్‌ఎస్డీసీ ఈవో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles