తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం


Thu,September 12, 2019 03:44 AM

Telangana Gurukuls are ideal for the country

-ఏపీలోనూ టెమ్రీస్ తరహా విధానం తీసుకొస్తాం
-ఏపీ డిప్యూటీ సీఎం అమ్జద్‌బాషా
-హైదరాబాద్‌లోని మైనార్టీ గురుకులాల సందర్శన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న గురుకుల విద్యావిధానం దేశానికే ఆదర్శమని, అన్నివర్గాల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయం ప్రశంసనీయమని ఏపీ డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అమ్జద్‌బాషా పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకూ స్ఫూర్తివంతమైన పరిపాలన తెలంగాణలో సాగుతున్నదని, ఏపీ అభివృద్ధికి తెలంగాణ సీఎం సహకారం తీసుకుంటామని చెప్పారు. బుధవారం ఖైరతాబాద్, సనత్‌నగర్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలను మంత్రి అమ్జద్‌బాషా సందర్శించారు. విద్యాబోధన, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, ఇతర కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోనూ టెమ్రీస్ తరహా విద్యావిధానం తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు తెలంగాణలోని టెమ్రీస్ ఆధ్వర్యంలోని గురుకులాల పరిశీలనకు వచ్చినట్టు తెలిపారు.

తెలంగాణలో టెమ్రీస్ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఫలితాలను సాధిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి మైనార్టీ గురుకులాలను ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. దాని కోసం తెలంగాణ అధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ విద్యపై విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన గురుకుల విద్యావిధానం సర్కారు విద్యకు పూర్వవైభవం తీసుకొచ్చిందని కితాబిచ్చారు. తెలంగాణలో మైనార్టీల కోసం అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. సమావేశంలో టెమ్రీస్ కార్యదర్శి షఫిఉల్లా, ఏపీ మైనార్టీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గురుకులాలకు తెలంగాణే స్ఫూర్తి

తెలంగాణ రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మైనార్టీ గురుకులాలు దేశంలోని ఇతర రాష్ట్రాలతోపాటు పలు దేశాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాల ప్రతినిధులు మైనార్టీ గురుకులాలను సందర్శించి, వాటిలో అమలవుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఇటీవల టెమ్రీస్‌ను సందర్శించిన కేరళ ప్రభుత్వ ప్రతినిధులు.. ఆ రాష్ట్రంలోనూ తెలంగాణ తరహాలో గురుకుల విద్యావిధానాన్ని వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తెలంగాణ గురుకుల విద్యావిధానం నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్ఫూర్తి పొందింది. ఏపీ మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి, ఉన్నతాధికారులు టెమ్రీస్‌ను పరిశీలించి వచ్చే విద్యాసంవత్సరం నుంచి మైనార్టీ గురుకులాలను ప్రారంభిస్తామని ప్రకటించడం విశేషం.

791
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles