చేనేతకు మహాకీర్తి


Tue,August 13, 2019 03:29 AM

Telangana Handloom workers in tollywood and bollywood costumes

- సినీ కాస్ట్యూమ్స్‌కు తోడ్పాటు.. కార్మికులకు చేతినిండా పని
- టాలీవుడ్, బాలీవుడ్ కాస్ట్యూమ్స్‌లో తెలంగాణ చేనేత కళాకృతులు
- జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అవార్డు వెనుక కార్మికుల ప్రతిభ


(శిరందాస్ ప్రవీణ్‌కుమార్)
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ చేనేత రంగానికి మహాకీర్తి లభించింది. ఇక్కడి కార్మికుల నైపుణ్యం, ప్రతిభకు గుర్తింపు. ఏదైనా అవార్డు లభించిందంటే తెర వెనుక అనేక మంది శ్రమ దాగి ఉంటుందన్నది నిజం. మహానటి సినిమాకు జాతీయ చలనచిత్ర పురస్కారాల్లోనూ అదే వరుస. కాస్ట్యూమ్ డిజైనర్‌గా గౌరంగ్‌షాకు పురస్కారం ప్రకటించారు. ఐతే మహానటి సినిమాలో కాస్ట్యూమ్స్‌కు చేనేత వస్ర్తాలదే కీలకపాత్ర. సావిత్రి పాత్రలో కట్టిన కంచి పట్టుచీరలన్నీ బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ ఉత్పత్తులు కావు. అవన్నీ చేనేత కార్మికుల చేతుల్లో రూపుదిద్దుకున్నవే. బాలీవుడ్‌లో ఉర్రూతలూగించిన దేవదాసు సినిమాలోనూ తెలంగాణ చేనేత కళాకృతులు పరిఢవిల్లాయి. ఐశ్వర్యారాయ్, మాధురీదీక్షిత్ ధరించిన వస్ర్తాల్లో చాలావరకు ఇక్కడివే. ముఖ్యంగా నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నేసినవే. గట్టుప్పల, పుట్టపాక, చండూరు, ఆమనగల్లు ప్రాంతాల్లో ఈ చీరలు నేస్తున్నారు. ఈ కంచి పట్టుచీరల ఉత్పత్తిలో చేనేత కళాకారుల కళాతృష్ణ, నైపుణ్యం అంతాఇంతా కాదు. వారి నైపుణ్యమే కీర్తిసురేశ్‌కు కొత్త అందాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా కాస్ట్యూమ్స్‌కు ప్రసిద్ధ డిజైనర్ గౌరంగ్‌షాకు పురస్కారం లభించడాన్ని చేనేతరంగం స్వాగతిస్తున్నది. అవార్డు తమకే వచ్చినట్టుగా కార్మికులు భావిస్తున్నారు. రూ.50 వేల నుంచి రూ.లక్షకు పైగా ధర పలికే ఈ చీరలకు నాలుగేండ్ల నుంచి అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఒక్కో చీర నేసేందుకు 20 నుంచి 45 రోజుల సమయం పడుతున్నది. దేశ, విదేశీ డిజైనర్లు ఎందరో ఆర్డర్లు ఇస్తుండటంతో నిపుణులైన యువ కార్మికులు ఈ చీరలను జోరుగా ఉత్పత్తి చేస్తున్నారు.
Handloom-saree1

డిజైనర్ గౌరంగ్‌షా పాత్ర పెద్దదే

చేనేతరంగంలో డిజైనర్ గౌరంగ్‌షా పాత్ర పెద్దదే. కొంతకాలం క్రితం బెర్లిన్‌లోనూ తన సహజసిద్ధ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఎకో డిజైనర్స్ లావెరా షో ఫ్లోర్‌లో షాకు మంచి పేరొచ్చింది. ఖాదీలోనే 24 రకాల అవుట్‌ఫిట్స్‌ను ప్రదర్శించారు. ఖాదీతోపాటు కోటా, ఆరెంజ్ వంటివి ఉన్నాయి. ఇందులో మూడు చీరలు కాగా, మిగతావి ఇండో- వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్ కావడం విశేషం. ఇవన్నీ కూడా జమ్దాని నేత, పార్శి చికంకారి ఎంబ్రాయిడరీతో రూపొందించనవి. గౌరంగ్‌షా తన లేబుల్‌తోనే వస్ర్తాలను తయారుచేసి సమ్మోహితులను చేస్తున్నారు. సంప్రదాయ చేనేత మగ్గాలపై కాటన్‌పైన నాణ్యమైన జరితో జమ్దానీ టెక్నిక్‌ను వినియోగిస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాల ఆలయాల్లోని శిల్పాలు, పూలు, క్షేత్ర ఆకృతులను స్ఫూర్తిగా తీసుకొని వైవిధ్యభరిత డిజైన్లను సృష్టిస్తున్నారు. కాటన్ చీరకు సిల్క్ బార్డర్, టస్సర్ బార్డర్ వేసి రూపొందించిన ఉత్పత్తులు ఆకటుకొంటున్నాయి.
Handloom-saree2

స్కిల్డ్ వీవ్‌కు విదేశాల్లోనూ డిమాండ్

నేటి ఫ్యాషన్ ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతున్నది. అందుకే చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నది. సంప్రదాయ ఉత్పత్తులకు ఆధునికతను జోడిస్తే చేనేతరంగానికి, కార్మికులకు భవిష్యత్‌లోనూ ఢోకాలేదని నిరూపితమైంది. డబుల్ ఇక్కత్‌లో మరమగ్గాలకు దీటుగా వస్ర్తోత్పత్తి చేస్తూ అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌ను అందుకొంటున్నారు. అందమైన మోడళ్లు ర్యాంప్‌పై అందాలొలికిస్తున్నారు. లక్మే ఫ్యాషన్ వీక్‌లో ఇక్కడి ఉత్పత్తులకే అవార్డుల పంట. గడిచిన ఐదేండ్లుగా తెలంగాణ చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తున్నది. మగ్గంపై విరిసిన పూల తరంగాలు, అందంగా కదలాడే హంసల బారులు, ఆనందంగా పురివిప్పి ఆడే నెమళ్లు, విరగ్గాసిన మామిడి పిందెలు.. ఇలా అనేక రకాల డిజైన్లకు ఆధునికత సొబగులు అద్దిన ఉత్పత్తులు దేశ, విదేశాల్లో అమ్ముడుపోతున్నాయి. చీరలతో పాటు షూటింగ్, షర్టింగ్ ఫ్యాబ్రిక్‌ను ఎగుమతి చేస్తున్నారు.

సినీ కాస్ట్యూమ్స్‌లో కళాకారుల ప్రతిభ

దశాబ్దాలుగా సినీ కాస్ట్యూమ్స్‌లో చేనేత కళాకారుల ప్రతిభ దాగి ఉన్నది. అయితే గుర్తింపు లభించడం గగనం. ప్రధానంగా ఇతిహాసాలు, చరిత్ర, రాజుల కథలతో సాగే సినిమాల్లో ప్రధాన పాత్రధారుల కాస్ట్యూమ్స్‌లో చేనేత ఉత్పత్తులే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇప్పటికే చాలా హిందీ సినిమాల్లో కంచి, ఇక్కత్ చీరలు, వస్ర్తాలను వినియోగించారు.
Handloom-saree3

మాటలకందని భావోద్వేగం నాది

జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో మహానటిలో కాస్ట్యూమ్స్‌కు అవార్డు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మాటలకందని భావోద్వేగం. నిర్మాతలు స్వప్నాదత్, ప్రియాంకదత్, దర్శకుడు నాగ్‌అశ్విన్‌కు కృతజ్ఞతలు. ఈ అవార్డును చేనేత కార్మికులకు అంకితం చేస్తున్నాను. నా కుటుంబం, చేనేత వస్త్రప్రియులు ప్రోత్సహిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ ప్రయాణంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్నాను. సినిమాలో అవకాశం రావడం, దానికి గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉంది. చేనేత రంగానికి మరింత గుర్తింపు రావాలని ఆకాంక్షిస్తున్నాను.
- ప్రముఖ డిజైనర్ గౌరంగ్‌షా
Handloom-saree4

చేనేతకు దొరికిన ఆణిముత్యం గౌరంగ్‌షా

భారతీయ సంప్రదాయ చేనేత చీరను అంతర్జాతీయ వేదికపై సగౌరవంగా నిలిపిన ఘనత గౌరంగ్‌షాదే. వివిధ దేశాల్లో అనేక వేదికలపై శక్తివంతమైన సినీ, సెలబ్రిటీలతో చేయించిన ర్యాంప్‌షోలు, విస్తృత ప్రచారం చేనేత రంగానికి మేలు కలిగించింది. లాక్మే ఫ్యాషన్‌షోలలో చేనేత వస్త్రం అత్యంత భిన్నంగా కనిపించింది. గౌరవ వేతనం, గుర్తింపు రావాలని వాదించి ఆచరించిన వ్యక్తికి అవార్డు రావడమంటే చేనేతరంగానికి వచ్చినట్లే. చేనేత రంగానికి ఆయన సేవలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నా.
- యర్రమాద వెంకన్న నేత, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త
Handloom-saree5

సినీ కాస్ట్యూమ్స్‌కు చేనేత కళతో అందం

దశాబ్దాలుగా సినీ కాస్ట్యూమ్స్‌కు చేనేత కొత్త కళను తెస్తున్నది. గౌరంగ్‌షా వంటి ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించే దుస్తులకు అవసరమైన వస్ర్తాలను ఉత్పత్తిచేయగల సమర్థత తెలంగాణలో ఉన్నది. రాజులు, చరిత్ర, ఇతిహాసాలతో కూడిన సినిమాల్లో ప్రధాన పాత్రధారుల దుస్తులకు వినియోగించేందుకు ఇక్కడి ఉత్పత్తులే ప్రధానం. ఎన్నో చీరలు, వస్ర్తాలను సినీరంగానికి అందించాం. నటీనటులు కూడా చేనేత వస్ర్తాల కోసం సంప్రదిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ నటీమణులెందరో మా చీరలను కట్టారు.
- గజం అంజయ్య, పద్మశ్రీ అవార్డు గ్రహీత, పుట్టపాక, యాదాద్రి భువనగిరి జిల్లా

1137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles