ఆర్థిక క్రమశిక్షణలో తెలంగాణ మేటి


Wed,September 11, 2019 03:23 AM

Telangana is awesome in Economic Discipline

-సంపద పెరిగినా.. అప్పులు తక్కువే
-రాష్ట్ర మొత్తం సంపదలో రుణాలు 21.39 శాతమే

(ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ): సంపద గణనీయంగా పెరుగుతున్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ పరిమితికి లోబడి అప్పులు తీసుకొంటున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ముందువరుసలో నిలుస్తున్నది. రాష్ట్ర సంపదను గణనీయంగా పెంచుతున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నది. అడ్డదిడ్డంగా అప్పులు తీసుకోకుండా భవిష్యత్ అవసరాలకు మాత్రమే రుణాలు తీసుకొంటున్నది. జీఎస్డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్)లో అధికారికంగా 25 శాతం వరకు రుణాలు తీసుకునే అవకాశమున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాలను తాజా బడ్జెట్‌లో 21.39 శాతానికే పరిమితం చేయడంతోపాటు జీఎస్డీపీ (రూ.8,65,688 కోట్లు)లో ద్రవ్యలోటును 2.53 శాతానికే (రూ.24,081కోట్లకే) కట్టడిచేసింది.

వాస్తవానికి ఏ రాష్ట్రం అప్పులైనా జీస్డీపీలో 25 శాతానికి లోబడి ఉండాలి. ఈ పరిమితికి మించి అప్పులు చేసిన రాష్ర్టాలపై ఆర్థికంగా ఆంక్షలు విధిస్తారు. అయినప్పటికీ దేశంలోని చాలా రాష్ర్టాలు ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితికి మించి రుణాలు తీసుకొంటున్నాయి. ఈ విషయంలో తెలంగాణ అప్రమత్తంగా వ్యవహరించింది. మొత్తం సంపదలో అప్పులు 22 శాతం మించకుండా జాగ్రత్తపడింది. ప్రాజెక్టులు, ఇతర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను తీర్చేందుకు మరో 25 ఏండ్ల సమయం ఉన్నది. అప్పటివరకూ నామమాత్రపు వడ్డీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా రెవెన్యూ ఖర్చుల్లో 10 శాతం మించకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త వహించింది.

ఐదేండ్లలోనే రాష్ట్ర సంపద రెట్టింపు

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకముందు రూ.4 లక్షలకోట్లు (కేంద్ర జీడీపీలో 4.04 శాతం)గా ఉన్న తెలంగాణ సంపద.. టీఆర్‌ఎస్ పాలనాపగ్గాలు చేపట్టడంతో వేగంగా పెరిగి ఐదేండ్లలోనే రెట్టింపయింది. తాజాగా అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సంపద దాదాపు రూ.8.66 లక్షలకోట్లకు పెరిగి జీడీపీలో 4.55 శాతానికి చేరింది. ఈ లెక్కన తెలంగాణ రూ.2,16,422 కోట్ల కంటే ఎక్కువ అప్పులు తీసుకొనే వెసులుబాటు ఉన్నప్పటికీ రూ.2.13 లక్షలకోట్ల (21.39 శాతం) అప్పును మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

HARISH-RAO

ఆర్థిక మంత్రి హరీశ్ సమీక్ష

ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తన్నీరు హరీశ్‌రావు ఎంసీహెచ్చార్డీలో మంగళవారం తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థికశాఖలో ఏ విభాగాల పనితీరు ఎలా ఉంటుందనే విషయాలను తెలుసుకున్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై కూడా ఆయన సమీక్ష జరిపారు. రాష్ట్ర ఆర్థిక సలహాదారు జీఆర్.రెడ్డి, ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు బడ్జెట్‌లో విశేషాలను మంత్రి హరీశ్‌కు వివరించారు. రాష్ట్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి శివశంకర్, అదనపు కార్యదర్శులు రాయిరవి, రామ్మోహన్‌రావు, వర్క్స్ అకౌంట్ డైరెక్టర్ శర్మ, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ రమణారావు, పేఅండ్‌అకౌంట్స్ ఆఫీసర్ హనుమంతు, ట్రెజరీస్ డైరెక్టర్ మూర్తి, స్టేట్ ఆడిట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

1024
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles