జీఎస్డీపీ పైపైకి


Tue,September 10, 2019 03:56 AM

Telangana State economy growing faster than nations

- సంపదలో తెలంగాణ ఉరుకులు
- ప్రతికూల పరిస్థితుల్లోనూ స్థిరంగా వృద్ధి
- దేశంలో అగ్రభాగాన తెలంగాణ
- అర్థగణాంకశాఖ వెల్లడి


ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సంపదలో తెలంగాణ ఉరుకులు పెడుతున్నది. జీఎస్డీపీ వృద్ధిరేటు కొనసాగుతున్నది. ఈసారి కూడా రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగిందని అర్థగణాంకశాఖ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌) తాజాగా వెల్లడించింది. జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) ప్రస్తుత ధరల వద్ద 14.8శాతం.. స్థిర ధరల వద్ద 10.5శాతం వృద్ధిరేటును నమోదు చేసుకున్నట్లు తెలిపింది. అన్ని రంగాలలో స్థిరమైన వృద్ధిరేటుతో రాష్ట్రం.. జాతీయ సగటుకంటే ఎంతో ముందంజలో ఉన్నది. దేశంలో అగ్రభాగాన నిలుస్తున్నది. స్థిర ధరల్లో వృద్ధిరేటు జాతీయ సగటుకు రెట్టింపుగా ఉంది. ఈ గణాంకాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం బడ్జెట్‌ సందర్భంగా శాసనసభ ముందుంచారు. తాజా లెక్కల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో వివిధరంగాల్లో రాష్ట్రం మొత్తం సంపద ప్రస్తుత ధరల వద్ద రూ.8,66,688కోట్లకు పెరిగింది. 2014-15లో 12శాతం ఉన్న జీఎస్డీపీ వృద్ధిరేటు 2015-16లో 14.2కు పెరిగింది. 2016-17లో 14.2శాతం కొనసాగగా 2017-18లో 14.3శాతానికి, ఈసారి 14.8శాతానికి పెరిగింది. అసలు ఒక రాష్ట్రం అభివృద్ధికి జీఎస్డీపీనే ప్రధాన ప్రాతిపదికగా పరిగణిస్తారు. దానిని అనుసరించే రెవెన్యూ రాబడులు, ఖర్చులు, పెట్టుబడి వ్యయం అన్నింటిని అంచనా వేస్తారు. ప్రాథమికరంగమైన వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 10.9శాతం, ద్వితీయశ్రేణిరంగాల్లో పరిశ్రమలు, విద్యుత్‌ ఉత్పత్తి, నిర్మాణరంగంలో 14.9శాతం వృద్ధిరేటు నమోదు కాగా, సేవారంగం (టర్టియరీ సెక్టార్‌)లో 19.8శాతం వృద్ధి రేటు నమోదయింది.

అన్ని రాష్ర్టాల కంటే వినూత్నంగా..

తాజా అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ప్రస్తుత ధరల వద్ద 10.5శాతానికి పెరిగింది. అదే సమయంలో జాతీయస్థాయిలో జీడీపీ 6.8శాతంగానే ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర మొత్తం సంపద ప్రస్తుత ధరల వద్ద రూ.8,65,688 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే సమయానికి రూ.7,53,804 కోట్లుగా ఉన్న రాష్ట్ర సంపద అదనంగా లక్ష కోట్లకు పైగా పెరుగడం విశేషం. రాష్ట్ర సంపద మొత్తం జాతీయ సంపదలో 4.43శాతంగా ఉంది. ప్రస్తుత ధరల వద్ద జాతీయస్థాయిలో జీడీపీ రూ.1,90,53, 967కోట్లుగా ఉంటుందని 2018-19 ముందస్తు అంచనాల్లో వెల్లడయింది. తెలంగాణ సంపద వృద్ధిరేటు 15శాతంగా ఉండగా జాతీయస్థాయిలో వృద్ధిరేటు 11.5శాతం మాత్రమే.

రాష్ట్రంలో వ్యవ సాయం, ఉద్యానవనం, మత్స్య సంపద, భూగర్భ వనరులు, పారిశ్రామిక ప్రగతి, ఉత్పత్తి, రవాణారంగం, సొంతపన్నుల రాబడి తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర సంపదను లెక్కిస్తారు. వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు గణనీయంగా పెరగడం, కొత్త పరిశ్రమలు తరలిరావడం, వెల్లువలా పెట్టుబడులు రావడం, భవననిర్మాణరంగంతో రియల్‌ మార్కెట్‌ పుంజుకోవడం, పారిశ్రామిక ఉత్పత్తులతోపాటు ఉపాధి పెరగడం, సేవారంగాలలో పురోగమనం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సంపదను అంచనా వేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తించిన రంగాల్లో ఒక నిర్దిష్ట సమయంలో ఉత్పత్తయిన వస్తువులు, సేవల మార్కెట్‌ విలువను జీఎస్డీపీగా పరిగణిస్తారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా అతి తక్కువకాలంలో తెలంగాణ మాదిరిగా భారీస్థాయిలో వృద్ధిరేటును నమోదు చేసుకోలేదు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో స్ధిరమైన పాలన, పరుగులు తీస్తున్న అభివృద్ధి, ఉత్పాదకరంగాలకు ఊతం, నీటిపారుదల ప్రాజెక్టులరంగంలో చోటుచేసుకున్న ప్రగతి వెరసి రాష్ట్ర సంపద పెరగడానికి దోహదపడింది. తాజా అంచనాల ప్రకారం ప్రాథమికరంగం వ్యవసాయ అనుబంధ రంగాలలో 7శాతం, ద్వితీయ శ్రేణి రంగం కింద పరిశ్రమలు, విద్యుత్‌ ఉత్పత్తి, నిర్మాణరంగంలో 8.5శాతం వృద్ధిరేటు నమోదు చేసుకోగా సేవారంగం (ఐటీ, వర్తకం, వ్యాపారం, రవాణా, బ్యాంకింగ్‌, రియల్‌ ఎస్టేట్‌, ఐటీ వంటివి)లో 10.5శాతం వృద్ధిరేటు నమోదయింది.

GDP1

850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles