తెలంగాణ ఆదర్శరాష్ట్రం


Tue,September 10, 2019 03:58 AM

telangana state-rolemodel-to-all-states-says-governor-tamilisai-soundararajan

-అభివృద్ధిలో ముందంజ
-పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు
-30 రోజుల ప్రణాళిక దేశంలోనే నూతన అధ్యాయం
-ఓ మనిషి సృష్టించిన అద్భుతం.. కాళేశ్వరం
-రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిపై గవర్నర్ తమిళిసై ప్రశంసల వర్షం
-అభివృద్ధికి పాటుపడతానని తొలి సందేశంలో హామీ
-రాజకీయాలకతీతంగా రాష్ర్టాభివృద్ధిలో పాలుపంచుకోవాలని పార్టీలకు సూచన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పరిపాలనను నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిందని.. ఆదర్శరాష్ట్రంగా నిలిచిందని రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రశంసించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యభూమిక పోషిస్తానని, అన్నిరకాలుగా మార్గదర్శిగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకతీతంగా పార్టీలు కూడా రాష్ర్టాభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. గవర్నర్‌గా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా ఆమె సోమవారం ప్రజలను ఉద్దేశించి దూరదర్శన్ చానల్‌లో ప్రసంగించారు.

ప్రజలకు వినాయక చవితి, ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్థిరమైన, ఆరోగ్యకరమైన ఆర్థికవృద్ధిని సాధించినందుకు గర్వంగా ఉన్నదన్నారు. అన్నివర్గాల ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ.. ప్రభుత్వం అన్ని పండుగలకు ఒకే రకమైన ప్రాధాన్యమిస్తున్నదని, గంగాజమునా తెహజీబ్‌ను పూర్తి నిబద్ధతతో పరిరక్షిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారని, 30 రోజుల ప్రణాళిక దేశంలోనే నూతన అధ్యాయమని ఆమె పేర్కొన్నారు. ఓ మనిషి సృష్టించిన అద్భుతం.. కాళేశ్వరం అని కొనియాడారు.

వినూత్నపథకాలతో ముందంజలో..

హరితహారం, విద్యుత్త్తు, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి విభిన్నమైన పథకాలను లోపరహితంగా నిర్వహిస్తూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉన్నదని గవర్నర్ పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీల ఆకాంక్షలను నెరవేరుస్తూ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రజారోగ్యానికి సంబంధించిన పథకాల్ని అమలుచేయడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని, ఇందుకు ఆరోగ్యశ్రీ, కంటివెలుగు వంటి పథకాలే చక్కటి ఉదాహరణలని కితాబునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేసి తెలంగాణ ప్రపంచదృష్టిని ఆకర్షించిందని చెప్పారు. 2018-19లో తెలంగాణ రాష్ట్రం 14.8 శాతం జీఎస్డీపీని సాధించిందని, 2014లో 4లక్షల కోట్లు ఉన్న ఆదాయం ప్రస్తుతం రూ.8.66 లక్షల కోట్లకు చేరుకున్నదని ప్రశంసించారు.

రైతులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా అన్నిరకాల సేవల్ని అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని కొనియాడారు. గోదావరి నీటిని సముద్రంలోకి వృథాగా పోనీయకుండా.. వ్యవసాయం, విద్యుదుత్పత్తి, తాగునీరు వంటి అవసరాల కోసం వినియోగించుకునేందుకు తరలించడం గొప్ప విషయమన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కృష్ణానది నీటిని ప్రజలకు ఉపయోగపడేందుకు వినియోగించడం సంతోషకరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీలో అద్భుత ప్రగతిని సాధించిందని, శాంతిభద్రతల పరిరక్షణ బాగుందని, మెట్రోతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నదని ప్రశంసించారు. వివిధ వృత్తుల కార్మికులకు, వివిధ వర్గాలకు సంక్షేమకార్యక్రమాలు అభినందనీయమన్నారు.

governor-tamilisai2

14 రోజుల్లో తెలుగు నేర్చుకుంటా..

తెలుగు భాషను పద్నాలుగు రోజుల్లో నేర్చుకుంటానన్న నమ్మకమున్నదని.. ఇక్కడి ప్రజలతో స్థానిక భాషలోనే సంభాషించేందుకు ప్రయత్నిస్తానని గవర్నర్ తమిళిసై చెప్పారు. ఆమె సోమవారం రాజ్‌భవన్ అధికారులు, సిబ్బందితో ముచ్చటించారు. తెలంగాణకు వచ్చేముందే, రాష్ట్ర సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేశానని తెలిపారు. స్వతహాగా డాక్టర్ అయిన గవర్నర్.. రాజ్‌భవన్ సిబ్బంది పూర్తి ఆరోగ్యంతో ఉండాలని సూచించారు. తాను ప్రతిరోజూ యోగాచేస్తానని, బాగా నడుస్తానని చెప్పారు. సిబ్బందితో స్నేహపూర్వకంగా మెలిగిన గవర్నర్.. వారు విధులు పక్కాగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. రాజ్‌భవన్ లైబ్రరీని పరిశీలించిన ఆమె.. తన వ్యక్తిగత లైబ్రరీలోని దాదాపు ఐదువేల పుస్తకాలను త్వరలోనే రాజ్‌భవన్‌కు తీసుకొస్తానని తెలిపారు.

1777
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles