భైంసాలో కర్ఫ్యూ

Tue,January 14, 2020 03:02 AM

-అదుపులోకి శాంతిభద్రతలు
-రంగంలోకి ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌
-పట్టణాన్ని సందర్శించిన ఉన్నతాధికారులు

బైంసా,నమస్తే తెలంగాణ/భైంసా రూరల్‌: నిర్మల్‌ జిల్లా భైంసాలో కర్ఫ్యూ విధించారు. ఆదివారం రాత్రి కొర్వగల్లిలో తలెత్తిన చిన్న గొడవ ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. సోమవారం ఉదయం వరకు అది కొనసాగడంతో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగింది. ఆదివారం రాత్రి ఒక వర్గానికి చెందిన 14 ఇండ్లు ధ్వంసమవగా, 24 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆటో, కారు పాక్షికంగా కాలిపోయాయి. పోలీసు బలగాలు పట్టణానికి చేరుకోవడంతో తెల్లవారుజామున పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. సోమవారం ఉదయం మళ్లీ ఇరువర్గాల ఘర్షణలు మొదలయ్యాయి.

పట్టణంలోని కిసాన్‌ గల్లి, కొర్వగల్లి, బోయిగల్లి, కతిగా ఏరియాలో రాళ్ల, కర్రలతో దాడులు జరిగాయి. పోలీసులు ఒకప్రాంతం లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేలోపే మరో ప్రాం తంలో ఘర్షణలు మొదలయ్యాయి. ఐజీలు నాగిరెడ్డి, ప్రమోద్‌కుమార్‌, రామగుండం సీపీ సత్యనారాయణ, సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌, ఆదిలాబాద్‌, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల ఎస్పీలు బైంసాలోనే మకాంవేసి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పోలీసు బలగాలను భైంసాకు రప్పించారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డి ఎస్పీలు శశిధర్‌రాజు, విష్ణు వారియర్‌, శ్వేతారెడ్డి తదితర పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. వదంతులు వ్యాపించడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో ఇంటర్‌ నెట్‌ సేవలను నిలిపి వేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

శాంతి చర్యలు చేపట్టాం: ఎస్పీ శశిధర్‌రాజు

ప్రజల్లో విశ్వాసాన్ని పెంచి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మల్‌ ఎస్పీ శశిధర్‌ రాజు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఘర్షణకు కారకులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ముందస్తుగా సోమవారం నుంచి బుధవారం వరకు భైంసాలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు.

కారకులపై చర్యలు తీసుకుంటాం: కలెక్టర్‌

భైంసాలో ఘర్షణలకు గల కారకులపై చర్యలు తీసుకుంటామని నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. సోమవారం ఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు భరోసా కల్పించారు. ఘర్షణలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జేసీ భాస్కర్‌రావు ఉన్నారు.

2004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles