తెలంగాణ పట్నవాసం


Thu,September 12, 2019 04:14 AM

the fastest urbanizing telangana state in the country

-దేశంలోనే వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రం
-రాష్ట్ర మొత్తం జనాభా 3.5 కోట్లు.. అందులో పట్టణ జనాభా 1.36 కోట్లు
-40% దాటుతున్న పట్టణ జనాభా
-దోహదపడిన పాలనా వికేంద్రీకరణ
-సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి
-గణనీయంగా తగ్గుతున్న వలసలు
-ఇతర రాష్ర్టాల నుంచి పెరుగుదల
-జీరోమైగ్రేషన్ సిటీగా హైదరాబాద్
-360 డిగ్రీల కోణంలో నగరాభివృద్ధి
-20 వేల చ.కి.మీ. పరిధికి హుడా!
-సీఈడీ నివేదికలో వెల్లడి

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణలో పల్లెలు మండల కేంద్రాలుగా, గ్రామాలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా మారుతున్నాయి. అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ.. దేశంలోనే అగ్రభాగాన నిలుస్తున్నది. రాష్ట్రంలో నలువైపులా వేగంగా జరుగుతున్న అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ, రాష్ర్టానికి వలసలు పెరుగటంవల్ల పట్టణప్రాంతాల పరిధి వేగంగా విస్తరిస్తున్నది. హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రాంతాలు మెట్రోసిటీలుగా రూపాంతరం చెందుతుండటం, రాష్ట్రంలో ఉన్న తొమ్మిది జాతీయ రహదారుల్లో నలువైపులా ప్రగతిచక్రాలు పరుగులు తీయడం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాలు పట్టణాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో పట్టణ జనాభా.. దేశసగటు కంటే ఎంతో వేగంగా వృద్ధి చెందుతున్నదని సామాజిక ఆర్థిక సర్వే- 2019 నివేదిక వెల్లడించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, పారిశ్రామికప్రగతి జరుగుతున్నదని సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ (సీఈడీ) కూడా తన నివేదికలో స్పష్టంచేసింది.

40% దాటిన పట్టణ జనాభా : గతంలో 18 శాతంగా ఉన్న పట్టణజనాభా అనూహ్యంగా పెరిగి 38.9% దాటింది. ప్రస్తుతం మరింత వేగంగా పట్టణ జనాభా పెరుగుతుండటంతో అది 40% దాటినట్లు అంచనావేశారు. అదే సమయంలో జాతీయ పట్టణ జనాభా సగటు 18శాతంగా మాత్రమే ఉన్నది. 2011 జనాభాలెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం జనాభా 3.5 కోట్లుండగా అందులో 1.36 కోట్ల జనాభా పట్టణప్రాంతాల్లోనే ఉన్నది. అంటే మొత్తం జనాభాలో ఇది 39%. తెలంగాణ ఏర్పాటైన తర్వాత పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 33 జిల్లాలను ఏర్పాటుచేయడం, కార్పొరేషన్ల సంఖ్య పెరుగటం, కొత్త మున్సిపాలిటీల ఆవిర్భావంవల్ల కూడా పట్టణప్రాంతాల విస్తరణ వేగంగా జరిగిందని సామాజిక ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. ప్రస్తుతం కార్పొరేషన్లతోపాటు మున్సిపాలిటీల సంఖ్య 142కు పెరుగటంవల్ల పట్టణ జనాభా మరింత పెరుగుతుందని అంచనావేశారు. ఐటీరంగం అభివృద్ధి చెందటంతోపాటు పరిశ్రమలు తరలిరావటం, రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు వృద్ధిచెందటం వంటి కారణాలు పట్టణీకరణ పెరిగేందుకు దోహదపడుతున్నాయని సర్వే విశ్లేషించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సుస్థిరపాలన, పరిపాలనాపరంగా వేగంగా చోటుచేసుకున్న సానుకూల పరిణామాల క్రమంలో ఉత్తరాది రాష్ర్టాల నుంచి వలసలు బాగా పెరుగటం కూడా పట్టణీకరణ విస్తరణకు ఒక కారణంగా పేర్కొన్నది.

వికేంద్రీకరణతో వికాసం: సీఈడీ రీజనల్ డైరెక్టర్

తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు గణనీయంగా తగ్గిపోవటంతోపాటు ఇతర ప్రాంతాలనుంచి వలస వచ్చేవారి సంఖ్య బాగా పెరిగిందని సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ (సీఈడీ) వెల్లడించింది. రాష్ర్టావిర్భావం తర్వాత హైదరాబాద్ నగరంలో అన్నిరంగాల్లో పూర్తి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని, పరిపాలన వికేంద్రీకరణవల్ల తెలంగాణలో ప్రతీ పట్టణం శరవేగంగా విస్తరిస్తున్నదని తెలిపింది. ఈ క్రమంలో పర్యావరణంతోపాటు భవిష్యత్‌లో వ్యవసాయరంగంలో, ఆహార భద్రత విషయంలో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిసారించాల్సిన అవసరమున్నదని సూచించింది. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ గుర్తింపు పొందిన సీఈడీ.. స్వయంప్రతిపత్తిగల రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంగా పనిచేస్తున్నది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పట్టణాల విస్తృతి, అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని సీఈడీ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ కే జయచంద్రారెడ్డి చెప్పారు.

పరిపాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటుచేయడంవల్ల రియల్‌ఎస్టేట్, పారిశ్రామిక ప్రగతి, 24 గంటల నిరంతర విద్యుత్‌తోపాటు ఇతర అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించి, పట్టణాల సంఖ్య బాగా పెరుగుతున్నదని ఆయన వివరించారు. హైవేల పైన ఉన్న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, జనగామ, ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రాల్లో జనాభా, పట్టణాల అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని విశ్లేషించారు. హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, యాదాద్రి, ఖమ్మం, వరంగల్ అర్బన్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో సమీపభవిష్యత్‌లో కొన్నివేల పరిశ్రమలు స్థాపించే అవకాశమున్నదని వివరించారు. తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్ అత్యుత్తమంగా అమలుకావడమే ఇందుకు కారణమన్నారు. ఫలితంగా ఒకవైపు పారిశ్రామికాభివృద్ధి, మరోవైపు పట్టణాభివృద్ధి అంచనాలకు అందని రీతిలో అభివృద్ధి చెందుతాయన్నారు.

telangana2

20 వేల చ.కి.మీ. పరిధికి హుడా

తెలంగాణ ఏర్పడిన మూడేండ్లలోనే హైదరాబాద్‌కు 360 డిగ్రీల కోణంలో పలు రకాలుగా అభివృద్ధి చోటుచేసుకున్నదని సీఈడీ రీజినల్ డైరెక్టర్ జయచంద్రారెడ్డి చెప్పారు. గతంలో 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం 625 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి గ్రేటర్ హైదరాబాద్‌గా అవతరించిందన్నారు. 1,874 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న హుడా ఇప్పుడు 7,254 కిలోమీటర్లకు విస్తరించి అతిపెద్ద అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా రికార్డులకెక్కిందని చెప్పారు. సమీప భవిష్యత్‌లో హెచ్‌ఎండీఏ పరిధి 20 వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని ఆయన అంచనావేశారు. శాంతిభద్రతలతోపాటు వాతావరణ అనుకూల పరిస్థితులు హైదరాబాద్‌ను జీవనానికి అనుకూలమైన నగరంగా మార్చాయని చెప్పారు.

హైదరాబాద్‌కు వలసలు పెరుగటమే తప్ప ఇక్కడినుంచి వలసవెళ్లేవారు అసలు లేరని, జీరో మైగ్రేషన్ సిటీగా ఉన్నదని విశ్లేషించారు. దక్షిణాది రాష్ర్టాలకు కేంద్రస్థానంలో, ఉత్తరాది రాష్ర్టాలకు దగ్గరగా ఉన్న హైదరాబాద్‌లో సమతుల్య వాతావరణ పరిస్థితులు ఉండటం, శాంతిభద్రతలు మెరుగుకావడంవల్ల అందరి దృష్టి హైదరాబాద్‌వైపు ఉన్నదని వివరించారు. హైదరాబాద్ నగరానికి దేశ రెండో రాజధాని కాగల అన్ని హంగులున్నాయని అన్నారు. బెంగళూరు కంటే హైదరాబాద్‌లోనే అందరికీ అనుకూల వాతావరణం ఉన్నదని చెప్పారు. ఒక అంచనా ప్రకారం మరో దశాబ్దం తర్వాత తెలంగాణ మొత్తం జనాభాలో సగం హుడా పరిధిలోనే ఉండబోతున్నారు.

3589
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles