భద్రాద్రిపై ఆదినుంచి ఆంధ్రా కుట్రలు


Wed,April 24, 2019 02:01 AM

The TRS government has tried to bring five panchayats to Telangana

ఐదు పంచాయతీలపై ఏపీ సీఎం చంద్రబాబు పగ
భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాద్రి ఏజెన్సీపై ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు మరోసారి బయటపడ్డాయి. పోలవరం ప్రాజెక్టు రూపంలో భద్రాచలం రామాలయాన్ని సైతం నీళ్లపరం చేయాలనే ఏపీ సర్కారు కుట్రలు.. నీటిపారుదలరంగ నిపుణులు ఇటీవల చేసిన పరిశీలనలో తేటతెల్లమవడంతో రామభక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం నిర్మిస్తున్నట్టు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించగా, ప్రస్తుతం 50 లక్షల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందన్న వాస్తవ విషయం బయటికి పొక్కడంతో ఒక్కసారిగా భద్రాద్రి రామాలయం భవితవ్యం చర్చనీయాంశమైంది. 32 లక్షల క్యూసెక్కుల వరద నీటికే 1986లో భద్రాచలం సగభాగం జలమయమైందని, అటువంటిది 50లక్షల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే భారీ ముంపు తప్పదని భద్రాచలంతో పాటు భద్రాచలం ఐటీసీ పీఎస్‌పీడీ, అశ్వాపురం హెవీ వాటర్‌ప్లాంట్, మణుగూరు బీటీపీఎస్, సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టులకు ప్రమాదం పొంచి ఉన్నదని నీటి పారుదలరంగ నిపుణులు అంచనా వేశారు. భద్రాచలం దివ్యక్షేత్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్ల నిధులు కేటాయించి రాష్ర్టానికే తలమానికంగా ఉన్న భద్రాద్రిని యాదాద్రిగా తీర్చిదిద్దాలని సంకల్పిస్తుంటే.. ఆంధ్రా ప్రభుత్వం ఇటువంటి కుట్రలకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఆ ఐదు పంచాయతీలపై..

ముంపు విభజనతో భద్రాచలం పట్టణం తప్ప భద్రాచలం రూరల్ ప్రాంతమంతా ఆంధ్రాలోకి వెళ్లిపోయింది. భద్రాచలానికి కూతవేటు దూరం లో ఉన్న కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలతో పాటు వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపహాడ్‌లోని కొన్ని ప్రాంతాలు ఆంధ్రాలో కలిసిపోయాయి. ఆంధ్రాకు అవసరం లేని భద్రాచలం రూరల్‌లో ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం తదితర పంచాయతీలను కూడా ఆంధ్రా లాక్కుంది. భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లాలంటే ఆంధ్రా పరిధిలోకి వెళ్లిన ఈ పంచాయతీలను దాటుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో అంతర్రాష్ట్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఆయా పంచాయతీ పరిధిలోని స్థానికులు తమ పంచాయతీలను తెలంగాణలో కలుపాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.

ఐదు పంచాయతీలను తెలంగాణలోకి తీసుకొచ్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసింది. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రధాని మోదీతో కూడా చర్చించారు. అయినా ఈ పంచాయతీలు నేటివరకు తెలంగాణలో తిరిగి విలీనం కాలేదు. తొలుత ఏపీ ప్రభుత్వం కొంత సానుకూలంగా వ్యవహరించినప్పటికీ అనంతరం అడ్డం తిరిగింది. ఈ ఐదు పంచాయతీలను తెలంగాణకు ఇచ్చేది లేదంటూ ముఖం చాటేసింది.

2349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles