ప్రాదేశికం పరిసమాప్తం


Wed,May 15, 2019 02:50 AM

Third phase of local polls record 77.41 Percentage

- మూడువిడుతల్లో ముగిసిన పోలింగ్
- 77.41% పోలింగ్ నమోదు
- ఎంపీటీసీ స్థానాలు 5,817,జెడ్పీటీసీలు 538
- ఏకగ్రీవమైన జెడ్పీటీసీలు 4, ఎంపీటీసీలు 162


హైదరాబాద్, నమస్తే తెలంగాణ:రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 5,817 ఎంపీటీసీలు, 538 జెడ్పీటీసీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మూడువిడుతల్లో ఎన్నికలు నిర్వహించింది.తొలివిడుతలో 76.80 శాతం రెండోవిడుతలో 77.63 శాతం, తుదివిడుతలో 77.81శాతం పోలింగ్ నమోదైంది. 32 జిల్లాల్లో మూడు విడుతల్లో కలిపి 77.41శాతం పోలింగ్ నమోదైంది. తొలివిడుతలో 197, రెండోవిడుతలో 180, మూడోవిడుతలో 161 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. తొలివిడుతలో 2,166, రెం డోవిడుతలో 1,913, మూడోవిడుతలో 1,738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొలి విడుతలో 69, రెండో విడుతలో 63, మూడో విడుతలో 30 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడుతలో రెండు, రెం డు, మూడు విడుతల్లో ఒక్కొక్కటి చొప్పున జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Elections1

మేడ్చల్ జిల్లాలో తొలివిడుతలోనే పూర్తి

ఈ ఏడాది జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఏప్రిల్‌లో పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసింది. మూడువిడుతల్లో ఎన్నికలను పూర్తిచేసింది. ప్రస్తుత ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం జూలై 3 వరకు ఉన్నది. గడువులోగా ఎన్నికలు నిర్వహించి.. ఇప్పుడున్న పాలకవర్గాల గడువు ముగియగానే.. కొత్త సభ్యులకు బాధ్యతలు అప్పగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగేవి కావడంతో ముందుగా ఈవీఎంలను వినియోగించే అం శాన్ని పరిశీలించారు. కానీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో సరిపడ ఈవీఎంలు సమకూర్చలేమని ఈసీ పేర్కొన్నది. దీంతో బ్యా లెట్ పేపర్‌తోనే పరిషత్ ఎన్నికలను పూర్తిచేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక నాలుగురోజుల్లోనే బ్యాలెట్ పత్రాలను ముద్రించారు.
Elections2
స్థానిక ఎన్నికల్లో భాగంగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో 1.56 కోట్ల మంది ఓటర్లున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం జాబితా ఇచ్చింది. తొలివిడుతలో 45,32,502 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, 76.80 శాతం పోలింగ్ నమోదయింది. రెండోవిడుతలో 39,35,946 మంది ఓటేశారు. ఈ విడుతలో 77.63 శాతం పోలింగ్ నమోదైంది. మూడోవిడుతలో 36,17,961 మంది ఓటుహక్కు వినియోగించుకోగా.. 77.81శాతం నమోదయింది. పరిషత్ ఎన్నికల్లో మొత్తం 32,042 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1.47 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 54 వేల మంది పోలీసులను వినియోగించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో తొలివిడుతలోనే ఎన్నికలు పూర్తికాగా, కరీంనగర్, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో రెండు విడుతల్లో పోలింగ్ ముగిసింది. మిగిలిన 27 జిల్లాల్లో మూడు విడుతల్లో పోలింగ్ నిర్వహించారు. తొలివిడుతలో సిద్దిపేట జిల్లా అల్వాల్, రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్ ఎంపీటీసీ స్థానాలకు బ్యాలెట్ పత్రాలు తికమక రావడంతో.. వాటికి మూడోవిడుతలో పోలింగ్ నిర్వహించారు. చిన్నచిన్న ఘటనలు మినహా పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర వెబ్‌కాస్టింగ్ ఏర్పాటుచేసి పోలింగ్ సరళిని పరిశీలించారు.
Elections3

ఏకగ్రీవాల్లో టీఆర్‌ఎస్ హవా

స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు సత్తా చాటారు. ప్రచారపర్వంలోనే అధికారపార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమైంది. ఏకగ్రీవాల్లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులే నిలిచారు. మొదటివిడుతలో 69 స్థానాల్లో 62, రెండో విడుతలో 63 స్థానాల్లో 62, మూడో విడుతలో 30 ఎంపీటీసీ స్థానాల్లో 28 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఇక నాలుగు జెడ్పీటీసీ స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలోనే చేరాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరపున మంత్రులు, నేతలు ప్రచారం చేశారు.
Elections4

రెండు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మం డలం కుంటగూడ పరిధిలోని రాంజీగూడ, నేరడిగొండ(కే)లో ఎన్నికలను బహిష్కరించారు. నేరడిగొండ ను పంచాయతీ గా చేయకపోవడంతోనే పోలింగ్‌కు దూరంగా ఉన్నామని స్థానికులు తెలిపారు.

పోలింగ్‌లో స్వల్ప ఉద్రిక్తతలు

పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురంలో మధిర ఏవోఅనిల్‌కుమార్, భార్య తో కలిసి ఓటేసేందుకు వెళ్లాడు. భార్య బాలింత కావటంతో ఆయన మొ దట ఓటువేసి అక్కడే ఉన్న వైద్య సిబ్బంది వద్దకు వెళ్లి కూర్చున్నాడు. అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ బయటికి వెళ్లాలనటంతో మాటామాటా పెరిగి ఏవో అనిల్‌కుమార్‌పై కానిస్టేబుల్ చేయిచేసుకున్నారు. దీంతో అనిల్ బంధువులు మహిళా కానిస్టేబుల్‌పై దాడికి యత్నించారు. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పలువురిపై కేసులు నమోదుచేశారు. కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ పోలింగ్‌కేంద్రం వద్ద విధుల్లో ఉన్న హోంగార్డుకి టీఆర్‌ఎస్ నా యకులు డబ్బులిచ్చారంటూ కొందరు ప్రతిపక్షనాయకులు ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి విచారణ జరుపుతుండగా ప్రతిఘటించారు. దీంతో హోంగార్డుతోపాటు టీఆర్‌ఎస్ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Elections5

ఓటేస్తూ వీడియో రికార్డ్.. కేసు నమోదు

ఓటు వేసిన దృశ్యాలను వీడియో రికార్డు చేసి వైరల్ చేసిన జనగామ జిల్లా చిలుపూరుకు చెందిన వైద్య మహేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని 26వ బూత్‌లో ఓటు వేస్తున్న దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేసి తన మిత్రులకు వాట్సాప్ ద్వారా పంపాడు. జెడ్పీటీసీ స్థానానికి చేతిగుర్తుకు ఓటు వేస్తున్న వీడియో రికార్డు వైరల్‌గా మారింది. ఎస్సై శ్రీనివాస్ పోలింగ్ కేంద్రానికి వచ్చి బ్యాలెట్ పేపర్‌పై ఉన్న సీరియల్ నంబర్ ఆధారంగా మహేశ్‌పై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బెన్‌పల్లిలో ఓటు వేసి బ్యాలెట్ పత్రం ఫొటో తీసిన సందెల రవీందర్ అనే వ్యక్తిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

891
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles