ఇది ప్రజా బడ్జెట్


Tue,September 10, 2019 03:24 AM

this is a public budget

బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే..
సీఎం కేసీఆర్ రూపొందించిన బడ్జెట్ ఎంతో అద్భుతంగా ఉన్నది. ఇది ప్రజా బడ్జెట్. దేశంలో తీవ్రమైన ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేసింది. అత్యంత ప్రధానమైన వ్యవసాయరంగంతోపాటు సంక్షేమం, సాగునీటి రంగాలకు అత్యధిక నిధులు కేటాయించడం గొప్ప విషయం. ఆరోగ్యశ్రీ, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లకు పెద్దఎత్తున నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఇస్తున్న నిధులు ఏమూలకూ సరిపోవడంలేదు. ప్రాయోజిత పథకాల అమలుకు కేంద్రం ఇచ్చింది రూ.31,802 కోట్లు మాత్రమే. రాష్ట్రంలో 57 ఏండ్లు నిండిన వారందరికీ త్వరలో వృద్ధాప్య పింఛన్ అందజేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో ఎంతోమందికి లబ్ధి చేకూరుతుంది.
- నామా నాగేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడు

వాస్తవ పరిస్థితులకు అనుగుణం

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వాస్తవ పరిస్థితులకు అనుగుణ మైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థికమాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ రైతులు, పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ను రూపొం దించారు. పేదలతోపాటు రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ప్రభుత్వం అమలుచేస్తున్నది. వారి అభ్యున్నతి కోసం బడ్జెట్‌లో మరోసారి భారీగా నిధులను కేటాయించడం ద్వారా సీఎం కేసీఆర్ పేదల పక్షపాతిగా, రైతుబాంధవుడిగా నిరూపించుకున్నారు.
- వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ, శాసనసభా వ్యవహారాల మంత్రి

ఆర్థికమాంద్యంలోనూ సాగుకు పెద్దపీట

దేశంలో ఆర్థికమాంద్యం నెలకొన్న పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమరంగానికి చేసే ఖర్చు విషయంలో వెనుకడుగు వేయలేదు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో రూ.22,124.73 కోట్లు కేటాయించారు. రైతుబంధు పథకం కోసం రూ.12 వేల కోట్లు, రైతుబీమాను కూడా యథాతథంగా కొనసాగిస్తూ ప్రీమియం చెల్లించేందుకు రూ.1,137 కోట్లు ప్రతిపాదించారు. రుణమాఫీ కోసం రూ.6వేల కోట్లు, వ్యవసాయానికి 24 గంటల ఉచితవిద్యుత్ సబ్సిడీని అందించేందుకు రూ.8వేల కోట్లు కేటాయించడం బడ్జెట్ యధార్ధస్థితిని తెలియజేస్తున్నది.
- సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

అన్ని వర్గాలకు సంతృప్తి

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా ఉన్నది. ప్రజల ఆశలను, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ఎవరికీ లేదనకుండా, ఎవరినీ కాదనకుండా అభివృద్ధికి, సంక్షేమానికి సమప్రాధాన్యమిస్తూ సామాజిక బాధ్యతతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధితోపాటు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల అభ్యున్నతికి ఈ బడ్జెట్ బాటలు వేసింది.
- ఏ ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి

ప్రజలకు ఉపయోగపడే పద్దు

రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషించిన ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి అభినందనీయులు. ప్రజలకు ఉపయోగపడే రీతిలో వాస్తవిక బడ్జెట్‌ను రూపొందించారు.
- ఈటల రాజేందర్, వైద్యారోగ్యశాఖ మంత్రి

వాస్తవానికి అద్దం పట్టింది

వాస్తవానికి అద్దం పట్టిన బడ్జెట్ ఇది. ప్రజల సంక్షేమానికి ఢోకా లేదు. పన్నుల భారం అసలే లేదు. 57 ఏండ్ల వయసు దాటినవారికి ఆసరా పింఛన్లు వర్తింపజేస్తామని సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రకటించడం ఆయన మానవీయతకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆర్థికమాంద్యం ఎదురైనప్పటికీ సీఎం కేసీఆర్ అన్ని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌లో ప్రజలకు వాస్తవాలను వివరించారు.
- వీ శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సీఎ కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్నది. దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగాలు ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నప్పటికీ ప్రజల సంక్షేమానికి ఎలాంటి అవరోధాలు ఏర్పడకుండా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించడం సంతోషకరం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులను, సంక్షేమ రంగాన్ని రెండు కండ్లలా భావించారు. ఇలాంటి సంక్షేమ బడ్జెట్‌ను గతంలో ఎన్నడూ చూడలేదు.
- పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ మంత్రి

వ్యవసాయానికి పెద్దపీట

రాష్ట్ర బడ్జెట్ ప్రజారంజకంగా ఉన్నది. కేంద్రం సహకరించకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి, సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ వివిధ పథకాలకు కేటాయింపులు తగ్గించలేదు. సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు బాగున్నాయి. రైతుబంధు, రైతుబీమా పథకాలను కొనసాగించాలని నిర్ణయించడంతోపాటు రైతు రుణమాఫీకి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరపడం సీఎం కేసీఆర్ ప్రజారంజకపాలనకు నిదర్శనం.
- కర్నె ప్రభాకర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్

పేదలకు న్యాయం

ఇది ప్రజల బడ్జెట్. అన్ని వర్గాల సంక్షేమానికి దోహదపడుతున్నది. ఆసరా పింఛన్లు, రైతుబంధు, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఈ బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ పేదలకు న్యాయంచేసేలా బడ్జెట్‌ను రూపొందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది.
- నోముల నర్సింహయ్య, ఎమ్మెల్యే

రుణమాఫీపై స్పష్టత లేదు

బడ్జెట్ నిరాశను కలిగిస్తున్నది. రుణమాఫీపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు. నిరుద్యోగభృతి, ఉపాధికల్పన గురించి ఈ బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం బాధాకరం. కేసీఆర్ వైఫల్యాలను కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదాను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడంలేదు?
- టీ జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ

లోటు బడ్జెట్‌పై చర్చ జరగాలి

బడ్జెట్ నిరాశాజనకంగా ఉన్నది. రూ. 36 వేలకోట్ల లోటుపై చర్చ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేయలేక ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టి తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నది.
- ఎన్ రామచందర్‌రావు, బీజేపీ ఎమ్మెల్సీ

ఐఆర్, పీఆర్సీ ప్రస్తావన లేదు

ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఐదునెలల క్రితం రూ.1.80 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇప్పుడు ఎందుకు తగ్గింది? ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్, పీఆర్సీ గురించి ఈ బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.
- అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles