నిర్ణయాత్మక శక్తిగా ముస్లిం ఓట్లు


Sat,March 23, 2019 03:00 AM

TRS Assembly results again For Lok Sabha Elections

-తొమ్మిది లోక్‌సభ స్థానాల్లో వారే కీలకం
-పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దగ్గరైన టీఆర్‌ఎస్
-అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆశీర్వదించిన మైనార్టీలు
-లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందంటున్న విశ్లేషకులు

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ముస్లింలు నిర్ణయాత్మక శక్తిగా నిలువనున్నారు. దాదాపు తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు.. ఓటములను ప్రభావితం చేయనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్, నిజామాబాద్, జహీరాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో మైనార్టీల మెప్పు పొందినవారినే విజయం వరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో మైనార్టీలకు అండగా నిలిచింది. సీఎం కేసీఆర్ వారి మనసులకు దగ్గరయ్యారు. దీంతో వారు టీఆర్‌ఎస్‌పై అభిమానం పెంచుకున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

హైదరాబాద్‌లో అత్యధికం

రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ముస్లిం ఓటర్ల వాటా 12.7 శాతం. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 19,59,490 ఓట్లు ఉండగా, అందులో 60 శాతం అంటే.. దాదాపు 11,75,000 మంది ముస్లిం ఓటర్లు ఉండటం విశేషం. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బరిలో ఉన్నారు. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఆయన గెలుపు దాదాపు ఖాయమే. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 19,54,813 మంది ఓటర్లు ఉండగా.. 27 శాతం (దాదాపు 5,27,000) ముస్లిం మైనార్టీలే ఉన్నారు. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములను ముస్లింలే నిర్ణయించే పరిస్థితి ఉన్నది. చేవెళ్లలో 24,15.598 ఓట్లకుగానూ 16 శాతం.. అనగా 3,86,000 వరకు మైనార్టీలవే ఉన్నాయి. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో 10శాతం మంది ముస్లిం ఓటర్లు ఉండటం విశేషం. ఇక్కడ 31 లక్షల మంది ఓటర్లు ఉండగా.. మూడు లక్షలకుపైగా మైనార్టీలు ఉన్నారు. నిజామాబాద్‌లో 15,54,000 ఓట్లలో 2,64,000 (17 శాతం) ముస్లిం ఓటర్లవే. జహీరాబాద్‌లోని 14,95,000 ఓటర్లలో 14 శాతం (2,10,000), మహబూబ్‌నగర్‌లో 15 లక్షల ఓటర్లలో (11శాతం) 1,65,000, ఆదిలాబాద్‌లో 14,78,662 ఓట్లకుగానూ (12 శాతం) 1,78,000 వరకు, మెదక్‌లో 15,95,272 ఓట్లకుగానూ 10 శాతం (1,60,000) మైనార్టీ ఓట్లు ఉన్నాయి. మిగతా నియోజకవర్గాలలో 5 నుంచి 10 శాతం వరకు ఉన్నారు.

మనసు గెలుచుకున్న తెలంగాణ ప్రభుత్వం

స్వరాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు మొదటినుంచీ టీఆర్‌ఎస్‌కు పూర్తి అండగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు వారి మనసును గెలుచుకున్నాయి. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంట్‌కు పంపారు. షాదీముబారక్ ద్వారా ఇప్పటివరకు 90వేల పేద ముస్లిం కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. ఇమాంలు, మౌజన్లకు నెలకు రూ.5 వేల గౌరవవేతనం ఇవ్వడం, రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా వారికి దగ్గరయ్యారు. ఫలితంగా అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఘన విజయాలు కట్టబెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. టీఆర్‌ఎస్‌ను 16 స్థానాల్లో గెలిపించి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించేలా బలమివ్వాలని, కాంగ్రెస్, బీజేపీని తిప్పికొట్టాలని ఎంఐఎం ప్రచారం చేస్తుండటం మరింత కలిసొస్తున్నది. సీఎం కేసీఆర్ వంటి తెలివైన నాయకుడు దేశానికి అవసరమని ఎంపీ అసదుద్దీన్ పదేపదే చెప్తున్నారు.

TS-Loksabha-Muslim
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ ఓట్లు 12.7 శాతం
షాదీముబారక్ లబ్ధిదారులు: 90 వేల మంది
ఇమామ్‌లు,మౌజన్‌లకు జీతం: రూ.5 వేలు


అసెంబ్లీ ఫలితాలే మళ్లీ..

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లి మైనార్టీలు పూర్తిస్థాయిలో టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఎంఐఎం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేయడం, ముస్లిం మతపెద్దలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ప్రకటించడం కలిసొచ్చింది. రాష్ట్రంలోని దాదాపు 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండగా, ఇందులో 30 నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్నారు. హైదరాబాద్‌లోని దాదాపు 15 నియోజకవర్గాల్లో ముస్లింలే నిర్ణయాత్మకశక్తి. హైదరాబాద్ మినహా మిగతా 21 నియోజకవర్గాల్లో 15 శాతం, 13 నియోజకవర్గాల్లో 10-15 శాతం ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్‌లోని చార్మినార్, యాకుత్‌పురా, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, మలక్‌పేట, కార్వాన్ నియోజకవర్గాల్లో 60 శాతం ఓటర్లు వారే. జూబ్లీహిల్స్‌లో 33 శాతం,గోషామహల్‌లో 26, ముషీరాబాద్‌లో 19, ఖైరతాబాద్‌లో 21, అంబర్‌పేటలో 18, రాజేంద్రనగర్, మహేశ్వరం, తాండూరులో 20-30 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లపై ఎంఐఎం ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్, నిజామాబాద్ అర్బన్, బోధన్, బాన్స్‌వాడ, కామారెడ్డి, ఆర్మూర్, జుక్కల్, కరీంనగర్, కోరుట్ల, జగిత్యాల, జహీరాబాద్, సంగారెడ్డి, ఆందోల్, రాజేంద్రనగర్, తాండూరు, మహేశ్వరం, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో ముస్లింలు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నిల్లో రాజేంద్రనగర్ మినహా ఎంఐఎం పోటీచేయని అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు ఆ పార్టీ సంపూర్ణ మద్దతు పలికింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ హైదరాబాద్ మినహా అన్నిచోట్ల తోడుగా నిలిచింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని నాయకులు అంటున్నారు.

1071
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles