గల్లీలో సేవకులం.. ఢిల్లీలో సైనికులం


Sat,March 23, 2019 03:01 AM

TRS leader Kalvakuntla Kavitha filed nomination papers for Nizamabad Lok Sabha seat

-మరోసారి ప్రజలకు సేవచేసే అవకాశమివ్వాలి
-పదహారు ఎంపీ స్థానాలను గెలిపించాలి
-నిజామాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత
-మంత్రులు వేముల, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్ దాఖలు

నిజామాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఐదేండ్లపాటు టీఆర్‌ఎస్ ఎంపీలు అందరం గల్లీలో సేవకులుగా, ఢిల్లీలో సైనికులుగా పనిచేశామని.. మరోసారి దీవించి మరింత సేవచేసే అవకాశమివ్వాలని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తిచేశారు. టీఆర్‌ఎస్‌కు చెందిన 16 మంది ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. శుక్రవారం మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మహ్మద్ షకీల్ ఆమీర్, బాజిరెడ్డి గోవర్ధన్, విద్యాసాగర్‌రావు, డాక్టర్ సంజయ్‌కుమార్‌తో కలిసి కవిత నామినేషన్ దాఖలు చేశారు. రెండుసెట్ల నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం రామ్మోహన్‌రావుకు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్ అభ్యర్థిగా మరోసారి అవకాశమిచ్చిన పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

ఎన్నికల్లో పోటీచేసిన మొదటిసారే గెలిపించి తనను లోక్‌సభకు పంపించిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని తెలిపారు. జిల్లా, రాష్ట్ర, దేశ సమస్యలను శక్తికొద్ది పార్లమెంటులో లేవనెత్తానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి తనవంతుగా కృషిచేశానని చెప్పారు.ఐదేండ్లలో మా నడవడిక, పనితీరును ప్రజలందరూ గమనించారని అన్నారు. తెలంగాణ నుంచి గులాబీ కండువా కప్పుకొన్న వాళ్లు వెళ్తేనే రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడుకునే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. పలువురు రైతులు కూడా నామినేషన్ వేయనున్నారనే విషయాన్ని జాతీయమీడియా కవిత దృష్టికి తీసుకొచ్చింది. దీంతో స్పందించిన ఆమె మాట్లాడుతూ పసుపుతోపాటు, అన్నిపంటలకు మద్దతు ధర అం దించాలనే డిమాండ్‌తో రైతులు నామినేషన్లు వేస్తున్నారని.. పసుపు బోర్డుకోసం, అన్ని పంటలకు మద్దతు ధర అందించాలని పార్లమెంట్ వేదికగా పోరాటాలు చేశామని, ఈ విషయాన్ని అనేకమార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చామని గుర్తుచేశారు. నిజామాబాద్ నుంచి నామినేష న్లు వేస్తే లాభం లేదని.. నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీ పోటీచేస్తున్న నియోజకవర్గాల నుంచి నామినేషన్లు వేయడం ద్వారా సమస్య తీవ్రత కేంద్రానికి అర్థమవుతుందని సూచించారు.

గులాబీరంగు అంబాసిడర్ కారులో..

కవిత నామినేషన్ వేసేందుకు ఇంటినుంచి గులాబీ రంగు అంబాసిడర్ కారులో కలెక్టరేట్‌కు వెళ్లారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా కారును నడిపారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు మహారాష్ట్ర నుంచి పిలిపించిన డోల్ కళాకారులు తమ వాయిద్యాల హోరుతో సందడి చేశారు. నామినేషన్ వేయడానికి బయలుదేరే ముందు ఎంపీ కవిత.. భర్త అనిల్, అత్తమామల ఆశీర్వాదం తీసుకున్నా రు. పూజారులు, పాస్టర్లు ప్రార్థనలు చేశారు. ఇమామ్‌లు కవిత కుడిచేతికి జామీన్ కట్టారు.

బీజేపీది ప్రచార ఆర్భాటం

-ఐదేండ్లలో మోడీ చేసిందేమీలేదు
-పీటీఐతోఎంపీ కల్వకుంట్ల కవిత

బీజేపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాలను అమలుచేయడం కంటే ప్రచారం చేసుకోవడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. శుక్రవారం ఆమె హైదరాబాద్‌లో పీటీఐతో మాట్లాడుతూ.. లోకసభ ఎన్నికల నేపథ్యం లో బీజేపీ మోదీతోనే సాధ్యం అనే నినాదాన్ని తెరమీదకు తీసుకొచ్చిందని.. కానీ మోదీతో ఏమవుతుందని ప్రశ్నించారు. బీజేపీ గతంలో చెప్పిన సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదన్నారు. ఈ పథకంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహమూ అందలేదని గుర్తుచేశారు. ప్రధాని మోదీ పాలనలో పక్షపాత ధోరణి అవలంబించారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు దానికి అనుగుణంగానే వ్యవహరిస్తారని స్పష్టంచేశారు. ప్రజలు కోరుకునే విధంగా పాలించే సామర్థ్యం ప్రాంతీయ పార్టీలకే ఉన్నదన్నారు. జాతీయపార్టీ ద్వారా నే అన్ని రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్న మోదీ వాదనను ఖండించారు. ఐదేండ్ల పాలనలో ఆయన ఏరోజూ అన్ని రాష్ర్టాలను ఒకేవిధంగా చూసే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాలకు బదులు కశ్మీర్ సమస్యను తెరమీదకు తీసుకొచ్చిందని విమర్శించారు.

693
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles