మా నాయకుడు కేసీఆరే


Wed,September 11, 2019 03:31 AM

TRS MLAs denies being unhappy over cabinet expansion

-మాపై దుష్ప్రచారం వద్దు
-ఆయనతోనే మేమంతా
-ఎమ్మెల్యేలు రాజయ్య, గోవర్ధన్, గండ్ర, మాజీ మంత్రి జూపల్లి స్పష్టీకరణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/కొల్లాపూర్, డిచ్‌పల్లి: తమ నాయకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావేనని, తామంతా ఆయనతోనే ఉన్నామని టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు చెప్పారు. మీడియాలో వస్తున్నవన్నీ అసత్యవార్తలని స్పష్టంచేశారు. గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో (నమస్తే తెలంగాణ కాదు) వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా తమ మాటలను వక్రీకరించి, దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం యావత్తు తెలంగాణ సాధకుడు, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని, ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, స్థానికసంస్థల ఎన్నికల్లో కూడా ఇది స్పష్టమైందన్నారు. పార్టీపై, తమపై వ్యక్తిగత ఆరోపణలు మానుకోవాలని, వక్రీకరణలు వద్దని మాజీమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు స్పష్టంచేశారు. వారు వేర్వేరుగా మంగళవారం మీడియాతో మాట్లాడారు.

t-rajaiah

కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా: రాజయ్య

తనను ఎంతో ప్రోత్సహించి, రాష్ట్రస్థాయి నాయకుడిగా చేయడంతోపాటు కలలో కూడా ఊహించనివిధంగా రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పష్టంచేశారు. 2014లో టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ప్రతిపాదించే అవకాశం తనకు ఇవ్వడాన్ని ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే తాను 2012, 2014, 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలువగలిగానని చెప్పారు. వరంగల్‌లో కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకూ సీఎం కేసీఆర్ ఆశీస్సులే కారణమని అన్నారు. పార్టీలో, రాజకీయ జీవితంలో ఎన్నో అవకాశాలిచ్చి, తనను ఈస్థాయికి తీసుకొచ్చిన కేసీఆర్‌కు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని చెప్పారు.

సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. పరిపాలన అవసరాలు, సామాజిక సమీకరణలను చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుందని, గతంలోనూ మాదిగ సామాజికవర్గానికి అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్.. భవిష్యత్తులోనూ పెద్దపీట వేస్తారన్న సంపూర్ణ విశ్వాసం తనకు ఉన్నదన్నారు. అయితే, తాను చేయని వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు రావడాన్ని రాజయ్య ఖండించారు. మాదిగలకు అన్యాయం జరిగిందంటూ మందకృష్ణ మాదిగ ఉద్యమించడాన్ని విలేకరులు ప్రస్తావించగా.. మాదిగ సామాజికవర్గానికి మందకృష్ణ మాదిగ ఒక్కడే మూలపురుషుడు కాదన్నారు. తాను కూడా దండోరా ఉద్యమం నుంచే డిప్యూటీ సీఎంస్థాయికి ఎదిగానని చెప్పారు.

jupally

టీఆర్‌ఎస్‌లోనే ఉంటా: జూపల్లి

టీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా.. నేను నిఖార్సయిన టీఆర్‌ఎస్ నాయకుడిని.. పదవుల కోసం పాకులాడే వ్యక్తినికాదు.. తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగంచేశా అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని చెప్పారు. అలాంటి ప్రచారం చేస్తున్నవారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

Bajireddy-Govaradhan

మంత్రిపదవి రానందుకు అసంతృప్తిలేదు: బాజిరెడ్డి గోవర్ధన్

మంత్రిపదవి రానందుకు తనకు అసంతృప్తిలేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టంచేశారు. తనకు కేసీఆర్‌పై పూర్తి నమ్మకం ఉన్నదని, తాను ఎవ్వరినైతే నమ్ముతానో వారితో చివరివరకు ఉంటానని, తమ నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై తప్పడు ప్రచారాన్ని మానుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం వాట్సప్ ద్వారా తన అభిమానులతోపాటు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులకు సందేశం పంపారు.

GANDRA

మంత్రులుగా ఎవరుండాలన్నది ముఖ్యమంత్రి నిర్ణయం: గండ్ర

మంత్రులుగా ఎవరుండాలన్నది ముఖ్యమంత్రి విచక్షణతో నిర్ణయం తీసుకుంటారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తాను మంత్రి పదవి ఆశించి భంగపడినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదన్నారు. తనతోపాటు తన భార్య జ్యోతికి కూడా టీఆర్‌ఎస్‌లో సముచితస్థానమే ఉన్నదని, పార్టీ నాయకత్వంపై తమకెలాంటి అసంతృప్తిలేదని స్పష్టంచేశారు. తమపై బురదజల్లడం మానుకోవాలని, పార్టీ నుంచి వీడుతున్నట్టు, అలకబూనినట్టు చేస్తున్న ప్రచారాన్ని ఆపాలని ఆయన విజ్ఞప్తిచేశారు. రాష్ర్టాభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లోకి వచ్చామని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భూపాలపల్లి నియోజకవర్గ సమస్యలను తీర్చడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని, పనులు జరుగుతున్నాయని గండ్రపేర్కొన్నారు.

1244
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles