అంబేద్కరిజంతోనే తెలంగాణ


Mon,April 15, 2019 02:07 AM

TRS Working President KTR At Dr BR Ambedkar Jayanti Celebrations In Telangana Bhavan

-ప్రస్తుతం దేశానికి ఆయన తత్వం అవసరం
-పంజాగుట్ట ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
-తెలంగాణ భవన్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం దేశానికి అంబేద్కర్ తత్వం అవసరం ఉన్నదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. దేశానికి అంబేద్కర్ బోధనలు, సిద్ధాంతం అవసరం ఎంతో ఉన్నదన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్నే సీఎం కేసీఆర్ ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి ఆచరించారని గుర్తుచేశారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం తొలిగింపు విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పిందన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, హోంమంత్రి మహమూద్ అలీ, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు తదితరులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్‌ను ఒక కులానికో, ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తిగా ఆపాదించి మాట్లాడటం తగదని చెప్పారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నాయకులకు సరితూగే నేత అంబేద్కర్ అని తెలిపారు. దార్శనికుడు అనే పదం అంబేద్కర్‌కు మాత్రమే సరిపోలుతుందన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడాలంటే శాసనసభ అనుమతి, తీర్మానం తప్పనిసరికాదని రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచారని గుర్తుచేశారు.

ఈ వెసులుబాటు తెలంగాణ ఏర్పాటుకు శ్రీరామరక్షగా నిలిచిందన్నారు. సంఖ్యాపరంగా మైనార్టీల కోసం కొట్లాడిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ముందుచూపుతోనే అసెంబ్లీ తీర్మానం అవసరంలేకుండానే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం లభించిందని పేర్కొన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వా న్నే సీఎం కేసీఆర్ ఆనాడు ఉద్యమంలో ఆచరించారని తెలిపారు. 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ, లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరిస్తూ, ఎక్కడ సమస్య వచ్చినా పోరాడుతూ ముందుకుసాగారని చెప్పారు. అల్పసంఖ్యాకులు, బడుగు బలహీనవర్గాలవారికి ప్రభుత్వాలు రక్షణగా నిలిచి వారి హక్కులను కాపాడినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక సబ్‌ప్లాన్ ద్వారా నిధులు కేటాయించుకున్నామని తెలిపారు. వారి జనాభా శాతం కంటే ఎక్కువగా నిధులు ఖర్చు చేస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిబద్ధతకు ఇది నిదర్శనమని చెప్పారు.
KTR1

స్ఫూర్తిప్రదాత అంబేద్కర్

దేశంలోనే మహానేత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారికి బంగారు భవిష్యత్‌ను అందించారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను చేపట్టారని తెలిపారు. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. అన్ని వర్గాలు సుఖసంతోషాలతో ఉండాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. సంక్షేమశాఖలకు కలిపి రూ.42 వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమానికి నిధు లు కేటాయించలేదని, సంక్షేమరంగంలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా మార్చారన్నారు.

అంబేద్కర్ అడుగుజాడల్లో సీఎం కేసీఆర్

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బడుగు బలహీనవర్గాలకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల నిధులు దారి మల్లకుండా సబ్‌ప్లాన్‌ను పకడ్బందీగా రూపొందించారని వివరించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ ఏర్పాటుచేసిన బాల్క ఫౌండేషన్‌ను టీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, టాంకాం చైర్మన్ రంగారెడ్డి, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, టీఆర్‌ఎస్వీ నేత కే కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

విగ్రహం తొలిగించిన వారిపై కఠిన చర్యలు

పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం తొలిగింపు ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే స్పందించిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. విగ్రహం తొలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. ఈ అవమానాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నదన్నారు. తప్పు చేసినవారు ఎవరైనా, ఏ పార్టీ వారైనా, ఏ ఉద్దేశంతో చేసినా దానిని తీవ్రంగా ఖండిద్దామని చెప్పారు. బాధ్యులు ఎవరైనా సరే వారిపై చర్య తీసుకోవాలని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ ఘటన బాధాకరమన్నారు.

1315
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles