22 వరకు అసెంబ్లీ


Tue,September 10, 2019 03:27 AM

TS Assembly to continue till 22nd September

-14 నుంచి వరుసగా సమావేశాలు
-మొత్తం పదిరోజులపాటు నిర్వహణ
-22న ద్రవ్యవినిమయ బిల్లుకు ఉభయసభల ఆమోదం
-అసెంబ్లీ బీఏసీ సమావేశంలో నిర్ణయం
-ఐదురోజులు కొనసాగనున్న మండలి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 వరకు జరుగనున్నాయి. మొత్తం పదిరోజులపాటు సమావేశాలు నిర్వహించాలని సోమవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్ణయించింది. బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఉపసభాపతి టీ పద్మారావు, మంత్రులు టీ హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, విప్ గొంగిడి సునీత, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, కాంగ్రెస్ నుంచి మల్లు భట్టివిక్రమార్క, అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశాలను ఈ నెల 22 వరకు నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు వరుసగా పదిరోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నది. సోమవారమే సమావేశాలు ప్రారంభమయినప్పటికీ 10వ తేదీన మొహరం, 12న వినాయకనిమజ్జనం ఉండటంతో ఆ రెండ్రోజులతోపాటు, 11, 13 తేదీల్లోనూ సభకు సెలవు ప్రకటించారు. ఈ నెల 14 నుంచి వరుసగా సభను నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రతిపాదించింది.

సమావేశాలను మూడువారాలపాటు నిర్వహించాలని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ నెల 24 నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారని, ఈసారి సభను 10 రోజులపాటు నిర్వహించుకుందామని సీఎం కేసీఆర్ వారికి ప్రతిపాదించారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు 21 రోజులు పెట్టుకుందామని తెలిపారు. అక్టోబర్‌లో మరోసారి అసెంబ్లీ సమావేశం నిర్వహించుకుందామని, రెవెన్యూ బిల్లు అప్పటికల్లా సిద్ధమవుతుందని వివరించారు. కాగా, ఈ నెల 14న అసెంబ్లీ తిరిగి సమావేశం కాగానే బడ్జెట్‌పై చర్చించనున్నారు. 15న ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌పై చర్చకు సమాధానమిస్తారు. 16 నుంచి వివిధశాఖల పద్దులపై చర్చ జరుగుతుంది. 22న ద్రవ్య వినిమయబిల్లుకు సభ ఆమోదం తెలుపనున్నది. ఈ సమావేశంలోనే మున్సిపల్ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలుపనున్నాయి. కాగా, ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లోనూ కాన్‌స్టిట్యూషనల్ క్లబ్ ఏర్పాటుపనులను స్పీకర్ అనుమతితో వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ బీఏసీ సమావేశంలో సూచించినట్టు సమాచారం. హైదరాబాద్‌లో నిర్మించాలనుకుంటున్న క్లబ్‌కు అఫిలియేషన్ ఇవ్వాల్సిందిగా ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌కు లేఖ రాశామని, దానికి వారు సానుకూలంగా స్పందించారని సీఎం తెలిపారు.

రేపు మండలి చైర్మన్ అధికారిక ప్రకటన

శాసనమండలి సమావేశాలను మొత్తం 5 రోజుల పాటు నిర్వహించాలని మండలి బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. బుధవారం (11వ తేదీ)న చైర్మన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆయనకు సభ అభినందనలు తెలిపిన అనంతరం సభ వాయిదాపడి.. 14, 15 తేదీల్లో తిరిగి సమావేశం కానున్నది. తిరిగి వాయిదాపడి.. 22న మళ్లీ సమావేశం కానున్నది. డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన మండలి బీఏసీ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, చీఫ్‌విప్ బీ వెంకటేశ్వర్లు, విప్‌లు కర్నె ప్రభాకర్, భానుప్రసాద్‌రావు, ఎంఐఎం సభ్యుడు జాఫ్రీ పాల్గొన్నారు.

319
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles