ఈసీ రూల్స్ పాటించాలి


Fri,March 15, 2019 02:20 AM

TS CS SK Joshi Video Conference With District Collectors

-మొదలైన పనులు కొనసాగించండి
-ములుగు, నారాయణపేట జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చేలా చూడాలి
-సమ్మర్ యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలి
-కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఎస్కే జోషి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి సూచించారు. ఇప్పటికే మొదలైన పనులను కొనసాగించాలని చెప్పారు. గురువారం సచివాలయంలో ఆయ న వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించడంతోపాటు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఘనవ్యర్థాల నిర్వహణ, హరితహారం, రెవెన్యూ, అటవీ భూముల సర్వే, కాలానుగుణ మార్పులపై చర్చించారు. ఎన్నికల కోడ్ అమలుకు తీసుకొంటున్న చర్యలను కలెక్టర్లను అడిగి తెలుసుకొన్నారు. వివిధ శాఖలు కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ నెల 31 లోగా పూర్తిచేయాలన్నా రు.ములుగు, నారాయణపేట జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చేలా చూడాలన్నారు. వేసవి దృష్ట్యా యాక్షన్‌ప్లాన్ అమలుచేయాలని కలెక్టర్లను కోరారు.

పోస్టుల రీకౌన్సిల్ చేయనున్న ఆర్థికశాఖ

వివిధశాఖల హెచ్‌వోడీలు తమ శాఖలోని పోస్టుల వివరాలను ప్రొఫార్మా-1లో నింపాలని, రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించని స్పెషల్ ఆఫీసులు, స్టేట్‌లెవల్ ఆఫీసులు ప్రొఫార్మా- 5లో అందజేయాలని జీఏడీ ముఖ్యకార్యదర్శి అధర్‌సిన్హా సూచించారు. ప్రతిశాఖ పోస్టులను ఆర్థికశాఖ రీకౌన్సిల్ చేస్తుందన్నారు.

టీ వెబ్‌పోర్టల్‌కు నోడల్ అధికారులు

టీ వెబ్‌పోర్టల్‌కు సంబంధించి ప్రతి శాఖ ఒక నోడల్ అధికారిని నియమించాలని సీఎస్ జో షి చెప్పారు. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ మాట్లాడుతూ.. గైడ్‌లైన్స్ ఫర్ తెలంగాణ గవర్న్‌మెంట్ వెబ్‌సైట్స్ (జీటీజీడబ్ల్యూ) నిబంధనల ప్రకారం వెబ్‌సైట్లు ఉండేలా చర్య లు చేపడతామన్నారు. వివిధ శాఖల వెబ్‌సైట్లను ఇంటిగ్రేట్ చేసి స్టేట్‌పోర్టల్‌తో లింక్ చేస్తామని చెప్పారు. సులభతర వా ణిజ్యానికి సంబంధించి అన్ని రీఫామ్స్ ఈ నెల 19 లోగా పూర్తిచేయాలని సీఎస్ ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ దృషి సారించాలి

ఘనవ్యర్థాల నిర్వహణ కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జస్టిస్ సీవీ రాములు మాట్లాడుతూ.. సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై అధికారులకు అవగాహన కల్పించేందుకు కలెక్టర్లు కృషిచేయాలని సూచించారు. ఘనవ్యర్థాల నిర్వహణపై గ్రామీణ ప్రాంతాలపై కూడా దృష్టిసారించాలని సీఎస్ ఎస్కే జోషి అన్నారు. మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ మాట్లాడుతూ.. సాలిడ్‌వేస్ట్‌ను సైంటిఫిక్ పద్ధతిలో డిస్పోజ్ చేయడంపై దృష్టిపెట్టాలన్నారు. ప్రత్యేక కాలపరిమితి విధించుకొని సైంటిఫిక్ క్యాపింగ్, బయో ప్రాసెసింగ్, బయో మైనింగ్‌కు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

53.77లక్షల ఎకరాలు రీకౌన్సిల్

రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ మాట్లాడుతూ.. రెవెన్యూ, అటవీ భూముల సర్వేకు సంబంధించిన పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన జయశంకర్ భూపాలపల్లి, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, మహబూబాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 20 సర్వే బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 53.77 లక్షల ఎకరాలను రీ కౌన్సిల్ చేశామన్నారు. సమావేశంలో స్పెషల్ సీఎస్‌లు అజయ్‌మిశ్రా, చిత్రారామచంద్రన్, ముఖ్యకార్యదర్శులు శాంతికుమారి, రామకృష్ణారావు, సునీల్‌శర్మ, వికాస్‌రాజ్, సోమేశ్‌కుమార్, శాలినీమిశ్రా, పార్థసారథి, జగదీశ్వర్, శశాంక్‌గోయల్, శివశంకర్, కార్యదర్శులు సందీప్‌కుమార్ సుల్తానియా, బీ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ నీతూప్రసాద్, భూరికార్డుల ప్రక్షాళన ప్రత్యేక అధికారి శ్రీదేవి పాల్గొన్నారు.

సీఎస్ చైర్మన్‌గా ఎంసీసీ కమిటీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ముగ్గురు సీనియర్ అధికారులతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటైంది. కమిటీకి గవర్నర్ ఆమోదం తెలుపడంతో గురువారం ఈ మేరకు ఉత్తర్వు లు జారీచేశారు. సీఎస్ చైర్మన్‌గా ఉండే క మిటీలో సంబంధిత ప్రతిపాదనల శాఖలకు చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ/ప్రిన్సిపల్ సెక్రటరీ/కార్యదర్శి సభ్యుడిగా ఉం టారు. అడ్మినిస్ట్రేషన్, కో ఆర్డినేషన్‌శాఖల ముఖ్యకార్యదర్శి/కార్యదర్శి మరో సభ్యుడిగా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి మూడో సభ్యుడిగా ఉంటారు. ఈసీ నిబంధనల మేరకు ఈ కమిటీ ఎంసీసీ ఉల్లంఘనలను స్క్రీనింగ్ చేస్తుంది.

హరితహారం టార్గెట్ వంద కోట్ల మొక్కలు

-లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలు సిద్ధంచేయాలి
-కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలి: సీఎస్ జోషి

రానున్న వర్షాకాలంలో చేపట్టనున్న ఐదోవిడుత హరితహారంలో వంద కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నట్టు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలు సిద్ధంచేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పెంచుతున్న మొక్కల్లో తప్పనిసరిగా 25 నుంచి 30 శాతం అటవీ పండ్లజాతులు, మరో పది శాతం ఇండ్లలో పెంచుకొనే మొక్కలు ఉండేలా చూడాలన్నారు. ఇంకా వెయ్యి గ్రామపంచాయతీల్లో నర్సరీలు సిద్ధం చేయాల్సిఉన్నదని, ఆ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. వంద శాతం నర్సరీ లక్ష్యాలు పూర్తిచేసిన కొత్తగూడెం, వరంగల్ జిల్లాల అధికారులను అభినందించారు. ఆగ్రోఫారెస్ట్రీని ప్రోత్సహిస్తూ.. గంధపు, వెదురు మొక్కలను రైతులకు అందించేందుకు ఉద్యానశాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని అటవీ అధికారులు తెలిపారు. సమీక్షా సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, ఇంచార్జి పీసీసీఎఫ్ పృథ్వీరాజ్, అదనపు పీసీసీఎఫ్‌లు డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్ పాల్గొన్నారు.

707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles