ఒడిశాలో ఓర్పుతో సాయం


Wed,May 15, 2019 02:45 AM

TS energy staff restores power in Odishas cyclone hit areas

-రేయింబవళ్లు శ్రమిస్తున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు
-వారంలో 34 కి.మీ మేర విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
-భువనేశ్వర్‌తోపాటు, పూరి జిల్లాలో పనులు పూర్తి
-ఫొని నష్టం నుంచి కోలుకుంటున్న ఒడిశా
-అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఒడిశా రాష్ట్రంలో ఫొని తుఫాను కారణంగా అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. వారంరోజుల్లోనే మంగళవారం నాటికి రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌తోపాటు, పూరి జిల్లాలో 34కిలోమీటర్ల మేర విద్యుత్‌లైన్లను పునరుద్ధరించి, సరఫరా అందించగలిగారు. ఫొని తుఫాను ప్రభావంతో ఒడిశా రాష్ట్రంలో వేలకొద్ది విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఎక్కడికక్కడ వైర్లు తెగిపడగా.. వందల సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోయాయి. దాదాపు 16 జిల్లాల్లో కరంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. కరంట్ సరఫరా పునరుద్ధరణలో సాయం చేయాల్సిందిగా ఒడిశా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో మాట్లాడి ఒడిశాలో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో భాగం పంచుకోవాలని సూచించారు.

ప్రత్యేక వాహనాల్లో వెయ్యిమంది సిబ్బంది

తెలంగాణ విద్యుత్ సంస్థలకు చెందిన దాదాపు వెయ్యిమంది ఉద్యోగులు, సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో ఈ నెల 7న ఒడిశాకు బయలుదేరివెళ్లారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన సామగ్రితోపాటు, తమకు అవసరమైన ఆహారం, గుడారాలను కూడా వెంటతీసుకెళ్లారు. విధులు నిర్వర్తిస్తున్నచోటే గుడారాలు వేసుకుని.. వండుకుని తింటూ రేయి.. పగలు అనే తేడాలేకుండా కరంట్ సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. తీగలపై పడిపోయిన చెట్లను తొలగించడం, స్తంభాలను నిలబెట్టడం, ట్రాన్స్‌పార్మర్లకు మరమ్మతులు, తెగిపోయిన తీగల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటుచేయడం వంటి పనులను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.

ఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎల్ గోపయ్య పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీడీసీఎల్ ప్రధానకార్యాలయంలో ప్రత్యేకసెల్‌ను ఏర్పాటుచేసి సీఎండీ రఘుమారెడ్డి విద్యుత్ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ఇప్పటివరకు 537 స్థంభాలను ఏర్పాటుచేయడంతోపాటు, 74 ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు నిర్వహించారు. రేయింబవళ్లు కష్టపడుతూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారని కోర్దా కలెక్టర్ భూపేందర్‌సింగ్ పూనియా తెలంగాణ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ సరఫరా పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని, కొద్దిరోజుల్లోనే మామూలు స్థితికి చేరుకుంటుందన్నారు.

odisha2

విద్యుత్ సిబ్బందికి సీఎం కేసీఆర్ అభినందనలు

ఒడిశాలో తుఫాను తాకిడికి గురైన ప్రాంతాల్లో సహాయకచర్యల్లో పాలుపంచుకుంటున్న తెలంగాణ విద్యుత్ సిబ్బందికి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. తోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తెలంగాణ ఉద్యోగులు మానవతా దృక్పథంతో అక్కడికి వెళ్లి సహాయకచర్యలు అందిస్తున్నారని ప్రశంసించారు. తక్కువ సమయంలోనే అక్కడ విద్యుత్ పునరుద్ధరణ పనులు విజయవంతం చేశారని అభినందించారు.

సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నారు: ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

కష్టాల్లో ఉన్నవారికి సహాయం అందించేందుకు ప్రతికూల వాతావరణంలోనూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు శ్రమిస్తున్నారని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రశంసించారు. ఒడిశాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తెలంగాణ సహకారం అవసరం ఉన్నదని కోరగానే రాష్ట్రవ్యాప్తంగా వెయ్యిమంది ఉద్యోగులు తాము వెళ్తామంటూ సిద్ధపడ్డారన్నారు. కేవలం కొన్నిగంటల్లోనే అక్కడికి చేరుకుని వర్షంలోకూడా రేయింబవళ్లు పనిచేసి సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.

1949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles