తొలివిడుతగా 23 పారిశ్రామిక పార్కులు

Mon,October 21, 2019 02:52 AM

-జిల్లాల్లో 16,520 ఎకరాలను సేకరించిన టీఎస్‌ఐఐసీ
-ఇప్పటికే రూ. 1,800 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పారిశ్రామిక పార్కులను కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితం చేయకుండా మధ్య, చిన్నతరహా పరిశ్రమలకు అనువైనవిధంగా ఉండేలా జిల్లాల్లోనూ వాటిని ఏర్పాటుచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇందుకు అవసరమైన భూములను సేకరించి వాటిని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) కృషిచేస్తున్నది. టీఎస్‌ఐపాస్ ద్వారా రాష్ట్రానికి భారీసంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయి. వీటితోపాటుగా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కొత్త యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. టీఎస్‌ఐఐసీ ఏర్పాటైన నాటినుంచి ఇప్పటివరకు దాదాపు 16,520 ఎకరాలను (9,364 ఎకరాలు పట్టా భూములు, 7,155 ఎకరాల ప్రభుత్వ భూములు) సేకరించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కండ్లకల్‌లో 41ఎకరాలు, యాచారం మండలంలో 7,568 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలో 35 ఎకరాలు, షాబాద్ మండలం చందన్‌వెల్లిలో 945 ఎకరాలు, సిద్దిపేట జిల్లా బండమైలారంలో 152 ఎకరాలు, బండతిమ్మారంలో 127 ఎకరాలు, నంగునూరు మండలం ముండ్రాయిలో 137 ఎకరాలు, మిట్టాయిపల్లిలో 30 ఎకరాలు, రాజగోపాల్‌పేటలో 34 ఎకరాలు, మందన్‌పల్లిలో 100 ఎకరాలు, రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 100 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం ముంగి, ఝరాసంఘం మండలం బర్దిపూర్ గ్రామాల్లో 2,900 ఎకరాలు, జిన్నారం మండలం శివనగర్‌లో 100 ఎకరాలను సేకరించారు. వీటిలో 59 పారిశ్రామిక పార్కులను ఏర్పాటుచేయాలని, 23 పార్కులకు తొలి ప్రాధాన్యమిచ్చి పనులు చేయాలని నిర్ణయించి.. మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే రూ.1,800 కోట్లకుపైగా వెచ్చించారు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్దఎత్తున నిధులను వెచ్చించేందుకు ప్రణాళికలను సిద్ధంచేశారు.

జనరల్ పార్కులపైనా దృష్టి

ఒక్కో రంగానికి ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. జనరల్ పార్కులను కూడా నెలకొల్పుతున్నది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో 200 ఎకరాలు, ఇంద్రకరణ్‌లో 170 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 373 ఎకరాలు, రాకంచర్లలో 150 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 50 ఎకరాలు, రావిర్యాలలో 95 ఎకరాల్లో జనరల్ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటుచేయనున్నారు. వీటితోపాటు జనగామ జిల్లా కళ్లెం, నల్లగొండ జిల్లా చిట్యాల, వనపర్తి జిల్లా వెలిగొండ, కామారెడ్డి జిల్లా జంగంపల్లి, సిద్దిపేట జిల్లా బెజ్జంకి, దుద్దెడ, నర్మెట్ట, మందపల్లి, తునికి బొల్లారం, మంచిర్యాల జిల్లా నెన్నెల్, సిరిసిల్ల జిల్లా నర్మాల, పెద్దూరు, జిల్లెల, జగిత్యాల జిల్లా స్తంభంపల్లి, గద్వాల, సూర్యాపేట, మెదక్ జిల్లా వడియారం, మనోహరాబాద్, పెద్దపల్లి జిల్లా అంతర్గాం, రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లి, ఇబ్రహీంపట్నం, మొండిగౌరెల్లి, కొత్తపల్లి, నాగిరెడ్డిపల్లి, మేడ్చల్ జిల్లా మాదారం, బౌరంపేట్, దుండిగల్, యాదాద్రి జిల్లా రాయరావుపేటలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నారు.

474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles