వైద్య పరీక్షలకు వెళ్లొస్తుండగా..కాల్వలోకి దూసుకెళ్లిన కారు

Mon,September 23, 2019 02:20 AM

-నిండు గర్భిణి, అత్త దుర్మరణం
-కడుపులోని బిడ్డను కాపాడే ప్రయత్నం
-ఫలించని వైద్యుల కృషి.. తల్లడిల్లిన తండ్రి హృదయం
-ఖమ్మం జిల్లాలో విషాద ఘటన

ఖమ్మం రూరల్, నమస్తే తెలంగాణ: తొమ్మిది నెలల గర్భిణి అయిన భార్యను తల్లితోకలిసి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లి తిరిగొస్తుండగా జరిగిన కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండల పరిధిలోని గొల్లగూడెం వద్ద ఆదివారం కారు కాల్వలోకి దూసుకెళ్లి తల్లి, భార్య మృతిచెందగా, భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. మరో ఐదురోజుల్లో కండ్లు తెరిచి లోకాన్ని చూడనున్న గర్భంలోని బిడ్డను కాపాడేందుకు ఆ తండ్రి చివరివరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బిడ్డ సైతం ప్రాణాలు కోల్పోయాడు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన పోగుల మహిపాల్‌రెడ్డి నెల్లికుదురు మండలంలో ట్రాన్స్ కో సబ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

ఆయన భార్య స్వాతి (28) తొమ్మిది నెలల గర్భిణి. స్వాతికి వైద్య పరీక్షల కోసం తల్లి ఇందిర (48)తో కలిసి మహిపాల్‌రెడ్డి ఆదివారం కారులో ఖమ్మం వచ్చారు. పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో గొల్లగూడెం ఎన్నెస్పీ కాల్వ వద్ద కారు ఆపిన మహిపాల్‌రెడ్డి బహిర్భూమికి వెళ్లారు. అనంతరం అక్కడినుంచి వెళ్లేందుకు కారు రివర్స్ తీస్తుండగా అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. కారు డోరు తీసుకొని బయటకు వచ్చిన మహిపాల్‌రెడ్డిని అక్కడే కాల్వలో దుస్తులు ఉతుకుతున్న మహిళలు గుర్తించి చీరె సాయంతో రక్షించారు. కారులోని ఇందిర, స్వాతి అక్కడికక్కడే చనిపోయారు. మహిపాల్.. స్థానికుల సాయంతో ఇద్దరి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కాల్వలో ఉన్న కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకట్రావు తెలిపారు.
car-accident1

1650
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles