పల్లెలకు పట్టాభిషేకం

Tue,September 17, 2019 02:51 AM

-30 రోజుల ప్రగతి ప్రణాళికతో గ్రామాలు పరిశుభ్రం
-పల్లెసేవలో 8.15 లక్షల మంది ప్రగతి సైనికులు
-12,746 గ్రామాల్లో ముమ్మరంగా శ్రమదానం
- గ్రామస్థులతో అధికారులు, ప్రజాప్రతినిధుల మమేకం
-వేలాది ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు క్లీన్
-రోజూ సగటున 4వేల ఇనుప విద్యుత్ స్తంభాలు తొలగింపు
-సిమెంట్ స్తంభాలు ఏర్పాటుచేసి విద్యుత్ షాక్‌లకు చెక్
-త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కోసం కొత్తగా 29,339 కి.మీ. మేరకు థర్డ్ వైర్
-గ్రామస్థులకు 25 లక్షలకుపైగా లక్ష్మీతులసి మొక్కల పంపిణీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పల్లెసీమలు పట్టాభిషిక్తమై ప్రగతిపథంలో సాగుతున్నాయి. గ్రామాల పురోభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 30 రోజుల ప్రణాళిక సోమవారం నాటితో 11 రోజులు పూర్తిచేసుకొని అన్ని గ్రామాలను పరిశుభ్రంగా మార్చింది. కంపుకొట్టే వీధులన్నీ బ్లీచింగ్ పౌడర్‌తో క్లీన్ అయ్యాయి. తాకితే జల్లుమంటూ షాక్‌కొట్టే ఇనుప విద్యుత్ స్తంభాలు తొలగిపోయాయి. వాటిస్థానంలో సిమెంట్ స్తంభాలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కోసం మూడో లైన్‌ను కూడా బిగిస్తున్నారు. వేలాది ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలన్నీ పరిశుభ్రతతో పరిఢవిల్లుతున్నాయి. చుట్టూ పిచ్చిచెట్లతో ఉండే గ్రామాల వీధులు పరిశుభ్రంగా మారాయి.

గ్రామాల్లో సూపర్ సైన్యం

రాష్ట్రంలోని 12,746 గ్రామాల్లో రోజూ 8.15 లక్షల మందికిపైగా ప్రగతి సైనికులు పల్లెజనులతో మమేకమై రికార్డుస్థాయిలో శ్రమదానం చేస్తున్నారు. స్టాండింగ్ కమిటీల్లో ఎన్నికైన వీరంతా పల్లెల పరిశుభ్రతలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రతిగ్రామంలో రోజువారీగా సగటున 60 నుంచి 80 మందివరకు శ్రమదానాలు, పాదయాత్రలు చేస్తున్నారు. వారితో గ్రామస్థులంతా కలిసి వస్తున్నారు. తట్టలు, చీపుర్లు చేతబట్టి రోడ్లను ఊడ్చుతున్నారు. మొత్తం 8,15,255 మంది సభ్యులుండగా.. వీరిలో 3,99,843 మంది మహిళలున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,53,466 ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్థాలున్నట్టు గుర్తించి 34 వేలకుపైగా ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించారు. 13,91,431 ప్రాంతాల్లో పిచ్చిచెట్లు, ముళ్లపొదలను గుర్తించి సగానికిపైగా తొలగించారు. మరో 1,09,627 ఖాళీస్థలాల్లో వ్యర్థాలుండగా.. 40 వేలకుపైగా స్థలాల్లో వాటిని తొలగించారు.

palle-pragathi302

కార్యాలయాలన్నీ క్లీన్

539 మండలాలు, 12,751 గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ పరిశుభ్రంగా మారాయి. మొత్తం 24,314 అంగన్‌వాడీ కేంద్రాల్లో సోమవారం నాటికి 11 వేలకుపైగా కేంద్రాలను పరిశుభ్రం చేశారు. మిగిలిన చోట్ల కూడా క్లీనింగ్ కొనసాగుతున్నది. 15,003 ప్రాథమిక పాఠశాలలుండగా.. 9,079 పాఠశాలలు, 4,150 ప్రాథమికోన్నత పాఠశాలలకుగాను 2,800 స్కూళ్లు, 4,404 ఉన్నత పాఠశాలల్లో 2,050 హైస్కూళ్లు, 4,322 ప్రభుత్వ దవాఖానల్లో 3 వేలకుపైగా దవాఖానలు, 10,978 కమ్యూనిటీ భవనాలకుగాను 4 వేలకుపైగా భవనాలతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ పరిశుభ్రంగా మారాయి.

తుదిదశకు విద్యుత్ పనులు

గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, వైర్లతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. పల్లె ప్రణాళికలో పవర్ వీక్‌ను నిర్వహిస్తున్న అధికారులు.. రోజుకు సగటున 3,055 పాత ఇనుప స్తంభాలను తొలిగించి వాటి స్థానంలో సిమెంట్ స్తంభాలను పాతి, కనెక్షన్లు ఇస్తున్నారు. కిందకు వేలాడే విద్యుత్ వైర్లను సరిచేస్తున్నారు. విద్యుత్ స్తంభాల పనులు దాదాపు అన్ని ప్రాంతాల్లో తుదిదశకు చేరడంతో ట్రాన్స్‌కో, ఎన్సీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు వెళ్లి పరిశీలిస్తున్నారు. త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కోసం కొత్తగా 29,339 కి.మీ. మేరకు థర్డ్ వైర్‌ను వేయడంతోపాటు 17,059 లైట్లను అమర్చారు. 31,839 స్తంభాలకు ఎల్‌ఈడీ లైట్లను బిగించారు. మరోవైపు గ్రామాల్లో ఇంటింటా లక్ష్మీతులసి మొక్కల పెంపకం పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 39.93 లక్షల లక్ష్మీతులసి మొక్కలు అవసరం ఉండగా.. ఇప్పటివరకు 25 లక్షలకుపైగా మొక్కలను పంపిణీచేశారు.

పనికిరాని బోర్లు, బావులు పూడ్చివేత

రాష్ట్రవ్యాప్తంగా 27,182 పాడుబడిన బావులున్నట్టు గుర్తించి ఇప్పటివరకు 7,236 బావులను మూసివేశారు. ప్రమాదకరంగా మారిన ఈ బావులను పూడ్చివేయడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. పనికిరాని బోర్లు 14,721 ఉన్నట్టు గుర్తించి యజమానులకు నోటీసులు జారీచేయడమే కాకుండా ఇప్పటివరకు 3,666 బోర్లను మూసేశారు. 62 వేల లోతట్టు ప్రాంతాలున్నట్టు గుర్తించి ఇప్పటికే 12 వేల ప్రాంతాలను సమాంతరం చేశారు. ఈ 11 రోజుల వ్యవధిలో 13 వేలకుపైగా మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేశారు. 1.43 ఏరియాల్లో బ్లీచింగ్ చల్లాల్సి ఉండగా.. సోమవారం నాటికే దాదాపు అన్నిప్రాంతాల్లో ఆ కార్యక్రమం పూర్తయింది.

541
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles