నవ, యువ సీఎం జగన్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు

Thu,May 30, 2019 01:45 PM

Telangana CM KCr congratulates YS Jagan mohan reddy

ఒక్క టర్మ్ కాదు కనీసం మూడు, నాలుగు టర్మ్‌లు
వైఎస్ జగన్‌కు సీఎం కేసీఆర్ శుభాశీస్సులు
చేయాల్సింది ఖడ్గచాలనం కాదు.. కరచాలనం
కృష్ణా, గోదావరి జలాలను సంపూర్ణంగా వాడుకుందాం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి సభా వేదికపై నుంచి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మీ అందరి ప్రేమ, అనురాగం, ఆశీస్సులతో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా నియమితులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ, యువ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిగారికి తన పక్షాన, తెలంగాణ ప్రభుత్వ పక్షాన హృదయపూర్వమైన అభినందనలు, ఆశీస్సులు తెలుపుతున్నానన్నారు. తెలుగు ప్రజల జీవన గమనంలో ఇది ఒక ఉజ్వలమైన ఘట్టమన్నారు. ఉభయ రాష్ర్టాల్లో, దేశంలో, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ప్రేమతో, అనురాగంతో, పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రిగారి వయస్సు చిన్నది. కానీ బాధ్యత పెద్దది. బాధ్యతను అద్భుతంగా నెరవేర్చే అభినివేశం, శక్తి, సామర్ధ్యం, ధైర్యం సీఎం జగన్‌కు ఉందని గత తొమ్మిది సంవత్సరాల్లో ప్రస్ఫూటంగా నిరూపించారన్నారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. మీ పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని.. మీరు సంపూర్ణ విజయం సాధించాలని భగవంతున్ని మనసారా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంలో రెండు రాష్ర్టాల తెలుగు ప్రజలు, రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు ఇప్పుడు చేయాల్సింది ఖడ్గచాలనం కాదని.. కరచాలనం అన్నారు. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయతతో, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలన్నారు. తనకు తెలిసి జగన్‌మోహన్‌రెడ్డి గారి ముందున్న తక్షణ కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగమేనన్నారు. వందశాతం ఇది జరిగి తిరాలి. మీ ఆధ్వర్యంలో జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. కృష్ణా నదిలో మనకు సమస్యలు ఉన్నాయి. అక్కడ లభించే నీటి బొట్టును ఒడుపుగా, ఒద్దికగా, ఓపికగా ఉభయ రాష్ర్టాల వాళ్లం కలిసి వినియోగించుకుంటూనే సంవృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని తాను మనసారా కోరుకుంటున్నానన్నారు. ఆ కర్తవ్య నిర్వహణలో అవసరమన అండదండలు సహాయ సహకారాలు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని ఈ సందర్భంగా ఉభయ రాష్ర్టాల ప్రజలకు తాను తెలియజేస్తున్నానన్నారు. చాలా సంతోషం. అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసి నాన్న గారి పేరు నిలబెట్టి అద్భుతమైన పేరును చరిత్రలో నిలిచిపోయేలా కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలన్నారు. ఒక్క టర్మ్ కాదు.. కనీసం మూడు, నాలుగు టర్మ్‌ల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని మనసారా దీవిస్తూ మీకు శుభాశీస్సులు అందిస్తూ విరమిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

3592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles