'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' రివ్యూ

Fri,June 21, 2019 01:39 PM
Agent Sai Srinivas Atreya Movie   Review,  Rating

డిటెక్టివ్‌ కథాంశాలతో హాలీవుడ్‌లో రూపొందిన షెర్లక్‌హోమ్స్‌తో పాటు పలు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించాయి. అయితే జోనర్‌లో తెలుగులో సినిమాలు అరుదుగా వచ్చాయి. చిరంజీవి నటించిన చంటబ్బాయి, మోహన్‌బాబు డిటెక్టివ్‌ నారద తర్వాత ఈ ఇతివృత్తంతో మళ్లీ ఎవరూ సినిమా చేయలేదు. ఆ లోటును భర్తీ చేస్తూ ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ద్వారా తొలి సినిమాతోనే డిటెక్టివ్‌ కథను ఎంచుకొని ఈ సాహసానికి పూనుకున్నారు దర్శకుడు స్వరూప్‌. ఏఐబీ సిరీస్‌తో పాటు లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌, వన్‌ నేనొక్కడినే సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నవీన్‌ పొలిశెట్టి ఈ చిత్రంతో కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. మళ్లీరావాతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న రాహుల్‌ యాదవ్‌ ద్వితీయ ప్రయత్నంగా నిర్మించిన సినిమా ఇది.

ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ(నవీన్‌ పొలిశెట్టి) నెల్లూరులో ఎఫ్‌బీఐ(ఫాతిమా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) పేరుతో ఓ డిటెక్టివ్‌ సంస్థను ప్రారంభిస్తాడు. తన అసిస్టెంట్‌
స్నేహ (శృతిశర్మ)తో కలిసి చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తుంటాడు. తెలివితేటలు దండిగా ఉన్న ఆత్రేయ తన ప్రతిభ తగ్గ పెద్ద కేసు కోసం ఎదురుచూస్తుంటాడు. ఓ నేరాన్ని పరిష్కరించే క్రమంలో అనుకోకుండా జైలుకు వెళ్లిన ఆత్రేయకు మారుతీరావు అనే వ్యక్తి పరిచయమై తన కూతురును హత్య చేశారని నిందితులను కనిపెట్టమని వేడుకుంటాడు. ఆ యువతి హత్య కేసులో అనుమానితులుగా ఉన్న వారి వివరాల్ని తన అసిస్టెంట్‌ సంధ్యతో కలిసి సేకరిస్తాడు ఆత్రేయ. కానీ అనూహ్యంగా ఆ అనుమానితులు హత్యకు గురవుతారు. ఆ నేరం ఆత్రేయపై పడుతుంది. ప్లానింగ్‌ ప్రకారం తనను ఈ నేరంలో ఇరికించారనే నిజం తెలుసుకున్న ఆత్రేయ అసలు హంతకులను ఎలా పట్టుకున్నాడు? ప్రజల నమ్మకాలతో వ్యాపారం చేసే ఓ ముఠా గుట్టును తన డిటెక్టివ్‌ తెలివితేటలతో ఏ విధంగా కనిపెట్టాడన్నది ఈ చిత్ర ఇతివృత్తం. నెల్లూరుకు చెందిన ఓ లోకల్‌ డిటెక్టివ్‌ కథ ఇది.


నేరాల చిక్కుముడులను విప్పాల్సిన డిటెక్టివ్‌పైనే హంతకుడిగా ముద్రపడితే తన కేసును తానే ఎలా పరిష్కరించుకున్నాడనే ఇతివృత్తంతో దర్శకుడు స్వరూప్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌కు తల్లీకొడుకుల అనుబంధాన్ని, మూఢనమ్మకాల్ని స్పృశిస్తూ కథనాన్ని ఆసక్తికరంగా నడిపించారు. ప్రారంభ సన్నివేశాల్లో ఎఫ్‌బీఐ అంటూ నవీన్‌ పొలిశెట్టి చేసే హంగామా నవ్విస్తుంది. సరదాగా సాగే కథను ఓ అమ్మాయి హత్య నేరంతో సీరియస్‌ మోడ్‌లోకి తీసుకెళ్లిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ కేసు చిక్కముడిని విప్పుతూ వెళ్లిన హీరోపైనే హంతకుడిగా ఆరోపణ రావడమనే మలుపును బాగా రాసుకున్నారు దర్శకుడు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సవాల్‌గా నిలిచిన ఆ నేరం వెనుక ఉన్న ఒక్కో చిక్కుముడిని కథానాయకుడు విప్పుతూ వెళ్లే సన్నివేశాలు ఉత్కంఠను పంచుతాయి. ఊహకందని మలుపులతో వాటిని రాసుకోవడంలో దర్శకుడు చాలా వరకు సఫలీకృతుడయ్యాడనే చెప్పాలి. చనిపోయిన వారి అంత్యక్రియల్ని పుణ్యక్షేత్రాల్లో జరిపితే ముక్తి కలుగుతుందనే ప్రజల్లో ఉన్న నమ్మకాల్ని కొందరు ఎలా సొమ్ము చేసుకుంటున్నారో, ఆ మృతదేహాల్ని ఏ విధంగా చట్ట వ్యతిరేక కార్యకాలపాలకు ఉపయోగించుకుంటున్నారో చూపించారు. అలాగే చట్టాల్లో ఉన్న లొసుగుల్ని నేరస్తులు ఎలా తమకు అనుకూలంగా వాడుకుంటున్నారో ఆవిష్కరించిన విధానం ఆలోచింపజేస్తుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథలో అంతర్లీనంగా తల్లీకొడుకుల అనుబంధాన్ని హృద్యంగా నడిపించారు. హీరోయిన్‌తో డ్యూయెట్‌లు, హీరోయిజం, పోరాట ఘట్టాల లాంటి కమర్షియల్‌ హంగుల కోసం కథను పక్కదారి పట్టించకుండా నిజాయితీగా తాను చెప్పాలనుకున్న కథను తెరపై ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది.

డిటెక్టివ్‌ సినిమాల్లో కథనాన్ని స్పీడ్‌గా నడిపించడం చాలా ముఖ్యం. ఆ విషయంలో దర్శకుడు కొంత తడబడ్డాడు. నేరస్తులను పట్టుకోవడానికి ఆత్రేయ చేసే పరిశోధన నిదానంగా సాగుతుంది. వాటిలో కొన్ని సన్నివేశాలు లాజిక్‌లకు దూరంగా సాగాయి. డిటెక్టివ్‌గా నవీన్‌ పొలిశెట్టి, అభినయం, అహార్యం, హావభావాలు అన్ని బాగా కుదిరాయి. తనలోని అమాయకత్వాన్ని, భయాన్ని దాచిపెట్టి పైకి మాత్రం ధైర్యస్తుడిగా కనిపించే పరిశోధకుడిగా నవీన్‌ అద్భుతంగా నటించాడు. ఏఐబీ సిరీస్‌లో విచిత్రమైన డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకున్న అతడు అదే మ్యాడ్యులేషన్‌ను ఉపయోగిస్తూ చెప్పిన సంభాషణలు నవ్విస్తాయి. హీరోగానే కాకుండా దర్శకుడు స్వరూప్‌తో కలిసి ఈ సినిమాకు స్క్రీన్‌ప్లేను అందించారు. అసిస్టెంట్‌ డిటెక్టివ్‌గా శృతిశర్మ పర్వాలేదనిపించింది. మరో డిటెక్టివ్‌ పాత్రలో సుహాన్‌ నవ్వించాడు. మిగతా నటీనటుల అభినయం సహజంగా సాగింది.

మార్క్‌ కె రాబిన్‌ నేపథ్య సంగీతం, సన్నీ కూరపాటి ఛాయాగ్రహణం సినిమాలోని మూడ్‌ను ఎలివేట్‌ చేయడానికి దోహదపడ్డాయి. నెల్లూరు నేపథ్యం సినిమాకు చాలా కలిసివచ్చింది. అక్కడి వాతావరణాన్ని, మాండళికాన్ని యథాతథంగా సినిమాలో చూపించారు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించిన సినిమా అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగానే కాకుండా కథకుడిగా ఆకట్టుకున్నారు స్వరూప్‌. తొలి సినిమా కోసం ప్రేమ, వినోదాత్మక కథలను నమ్ముకొని విజయాల్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు చాలా మంది దర్శకులు. అలా కాకుండా విభిన్నమైన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే అతడి తపన అభినందనీయం.తెలుగు తెరపై అరుదుగా వచ్చే ఈ జోనర్‌ను, దర్శకుడి కథను నమ్మి మాస్‌, మాసాల హంగులు ఏవీ లేకపోయినా ధైర్యంగా ఈసినిమాను నిర్మించారు నిర్మాత రాహుల్‌ యాదవ్‌. రొటీన్‌ సినిమాలకు అలవాటుపడిన ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని పంచుతుంది. ఈ ఆత్రేయ నవ్విస్తూనే చక్కటి థ్రిల్‌ను పంచుతాడు.

రేటింగ్‌:3/5

2621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles