బుక్‌మైషోలో ఒక్క రోజులోనే 10 ల‌క్ష‌ల టిక్కెట్ల విక్రయం.. అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ రికార్డ్‌..!

Tue,April 23, 2019 12:03 PM
Avengers Endgame Sold 1 Million Tickets on BookMyShow in only one day

మార్వెల్ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగంగా వ‌స్తున్న చివ‌రి చిత్రం అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ ఈ నెల 26వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న విష‌యం విదిత‌మే. ఇంగ్లిష్‌తోపాటు హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల‌వుతున్న‌ది. కాగా ఈ సినిమాకు గాను ఈ నెల 20వ తేదీ నుంచే టిక్కెట్ల‌ను విక్ర‌యించ‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే టిక్కెట్ల‌ను అమ్మ‌కానికి పెట్టిన మొద‌టి రోజే బుక్‌మైషో వెబ్‌సైట్‌లో ఏకంగా 10 ల‌క్ష‌ల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ మేర‌కు బుక్‌మైషో ప్ర‌తినిధులు తాజాగా వివ‌రాల‌ను వెల్లడించారు.

మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన గ‌త 21 చిత్రాల‌ను భార‌త్‌లో సినీ అభిమానులు ఎంత‌గానో ఆద‌రించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి పెద్ద ఎత్తున మ‌న దేశంలో అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్‌ను భారీ స్థాయిలో అత్య‌ధిక థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా టిక్కెట్లు కూడా ప్ర‌స్తుతం హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్నాయి. ఢిల్లీ, ముంబై, హైద‌రాబాద్ వంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లోని అన్ని మ‌ల్టీప్లెక్స్‌లు, సాధార‌ణ థియేట‌ర్ల‌లో అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ టిక్కెట్లు వ‌చ్చే ఆదివారం వ‌ర‌కు బుక్ అయ్యాయ‌ని బుక్ మై షో ప్ర‌తినిధులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే టిక్కెట్ల‌ను అమ్మ‌కానికి ఉంచిన తొలి రోజే ఏకంగా త‌మ సైట్‌లో 10 ల‌క్ష‌ల టిక్కెట్లు అమ్ముడుపోయాయ‌ని, సెక‌నుకు 18 టిక్కెట్ల‌ను ప్రేక్ష‌కులు కొనుగోలు చేశార‌ని వారు తెలిపారు. దీంతో ఒకే రోజు ఒక వెబ్‌సైట్‌లో అత్య‌ధికంగా టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాగా అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ కొత్త రికార్డు సృష్టించింద‌ని వారు చెప్పారు.

కాగా అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ మూవీ టిక్కెట్లు ప్ర‌స్తుతం బుక్‌మైషోతోపాటు పేటీఎం, జ‌స్ట్ టిక్కెట్ వంటి ఇత‌ర సైట్ల‌లోనూ అందుబాటులో ఉండ‌గా, తొలి మూడు రోజుల వ‌ర‌కు చాలా వ‌ర‌కు టిక్కెట్లు ఇప్ప‌టికే అమ్ముడ‌య్యాయ‌ని ఆయా వెబ్‌సైట్ల నిర్వాహ‌కులు చెబుతున్నారు. ఇక ముంబైలో అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ సినిమా టిక్కెట్ ఒక్కోటి బ్లాకులో రూ.1500 ధ‌ర ప‌లుకుతుంద‌ని తెలిసింది. ముంబైలోని కార్నివాల్ సినిమాస్ ఐమ్యాక్స్‌లో తెల్ల‌వారుజామున 3.20 గంట‌ల షోకు కూడా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడ‌య్యాయ‌ని, దీన్ని బ‌ట్టే అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ సినిమా ప‌ట్ల భార‌తీయ సినీ ప్రేక్ష‌కుల్లో ఎంత ఆస‌క్తి ఉందో ఇట్టే తెలుసుకోవచ్చ‌ని బుక్‌మైషో సీవోవో ఆశిష్ స‌క్సేనా తెలిపారు.

2593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles