అమ్రిష్ పురికి డూడుల్‌తో నివాళులు అర్పించిన గూగుల్

Sat,June 22, 2019 01:50 PM
Google Doodle Honours the Iconic Bollywood Actor

అమ్రిష్ పురి .. ఆయన కళ్లలో క్రూరత్వం, మాటలో కరకుదనం, నడకలో నిర్లక్ష్యం, లెక్కలేనితనం, అభినయంలో అచ్చమైన విలనిజం. నిజం చెప్పాలంటే ఆయన తెరపై కనబడితే చాలు పిల్లలు దడుచుకునేవాళ్లు. ఆయన్ను చూస్తే అంతగా భయమేసేది. సినిమాలో హీరోను సైతం ముప్పుతిప్పలు పెట్టి అల్లాడించాడు. ఆయనే అమ్రిష్ పురి. దాదాపు దశాబ్దం కిందటివరకు బాలీవుడ్‌ని శాసించిన అసలు సిసలు విలన్ అమ్రిష్ పురి. నేడు అమ్రిష్ పురి 87వ‌ జయంతి. ఈ సంద‌ర్భంగా గూగుల్ ఆయ‌నకి డూడుల్‌తో నివాళులు అర్పించింది.

బాలీవుడ్ విలన్ లలో ప్రాణ్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నటుడు అమ్రిష్. 1932లో అప్పటి పంజాబ్ ప్రావిన్స్ లాహోర్ లో జూన్ 22న పుట్టిన అమ్రిష్ రంగస్థలం నుంచి సినిమాల్లోకి వచ్చాడు. స్టేజి మీద అప్పటి ప్రముఖులు గిరీష్ కర్నాడ్ వంటి వారితో కలిసి నటించాడు. 1970లో సినిమాల్లోకి ఎంటరయ్యాడు అమ్రిష్ పురి. మూవీస్ లోకి రావాలనుకునేవారు హీరో కేరక్టర్ ను టార్గెట్ చేసుకుంటారు. కానీ అమ్రిష్ పురి మాత్రం విలన్ కేరక్టర్స్ ను అవగాహన చేసుకొని మాస్టర్ చేశాడు. నిజానికి విలన్ లేకుంటే హీరో లేడు. విలన్ కు ఉండాల్సిన స్పెషల్ ఫీచర్స్ అతనికున్నాయి. క్రూరమైన చూపులు, కరకుదేలిన కంఠం ఆయన స్పెషాలిటీ. అందుకే ఆయ‌న‌ విలన్ గా రాణించాడు. ఈయన దాదాపు 400కు పైన చిత్రాల్లో నటించి మెప్పించాడు.

శేఖర్ కపూర్ తీసిన మిస్టర్ ఇండియాలో ఆయన వేసిన మొగాంబో కేరక్టర్ చాలామందికి గుర్తుండిపోయింది. తెలుగులో జగదేకవీరుడు –అతిలోక సుందరిలో నటించిన అమ్రిష్ తన డైలాగ్స్ తానే చెప్పుకున్నాడు. ఆయ‌న విశిష్ట న‌ట‌నకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కురిసాయి. ఇక మేజర్ చంద్రకాంత్, ఆదిత్య 369, కొండవీటి దొంగ, అశ్వమేధం, ఆఖరి పోరాటం మొదలగు సినిమాల‌లో న‌టించారు అమ్రిష్‌. హిందీలోనే కాక కన్నడం, మరాఠీ, మలయాళం మూవీల్లో కూడా నటించాడు ఈ విలన్. స్టీవెన్ స్పీల్ బెర్గ్ సినిమా ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్స్ అనే హాలీవుడ్ సినిమాలో కూడా అమ్రిష్ నటించాడు. విలనిజం రెండు రకాలు. డైలాగ్ లో ధ్వనించడం, అభినయంలో చూపించడం. అమ్రిష్ పురి ఈ రెండింటిలోనూ దిట్ట. జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కి మ‌న‌మంద‌రం శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిద్ధాం.

2014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles