'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' రివ్యూ

Fri,March 29, 2019 01:32 PM

కుట్రల పునాదులపై నిర్మితమైన అబద్ధపు నగ్నసౌధాల స్వరూపాల్ని బట్టబయలు చేయడానికి నిజాల కత్తి ఝళిపిస్తున్నానంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ విడుదల సందర్భంగా తన మనసులోని భావాల్ని వ్యక్తం చేశారు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. వెన్నుపోటు ద్వారా అంతమొందించబడ్డ ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా తిరిగి మీ ముందుకురాబోతున్నాడని, కుటుంబ కుట్రలు, వెన్నుపోటు రాజకీయాల అసలు రంగుబయటపెడతానని వర్మ ప్రకటించడం తెలుగునాట అందరిలో ఉత్సుకతను రేకెత్తించింది. ఎన్టీఆర్‌పై 1995 ఆగస్టులో జరిగిన తిరుగుబాటు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని అతలాకుతలం చేసింది. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడానికి ఆయన అల్లుడు చంద్రబాబు హైదరాబాద్ వైస్రాయ్ వేదికగా చేసిన కుట్ర సమైక్యరాష్ట్ర చరిత్రలోనే ఓ కళంకమైన ఘట్టంగా మిగిలిపోయింది. ఆనాటి సంఘటనల ఆధారంగా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రూపొందించాడు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత చోటుచేసుకున్న ఘటనలు, వైస్రాయ్ ఉదంతం, చివరకు ఎన్టీఆర్ విషాదాంతం వరకు ఈ సినిమాలో చూపించబోతున్నానని వర్మ తెలిపారు. నిర్మాణం నుంచి అనేక వివాదాలు, సెన్సార్ విషయంలో సందిగ్ధ పరిస్థితుల్ని ఎదుర్కొన్న ఈ చిత్రం శుక్రవారం తెలంగాణలో ప్రేక్షకులముందుకొచ్చింది. మంగళగిరి కోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీలో విడుదల వాయిదా పడింది.

సినీరంగంలో విశ్వవిఖ్యాత నటుడిగా కీర్తింపబడిన ఎన్టీఆర్ రాజకీయం రంగంలో అనతికాలంలోనే ఉన్నత శిఖరాల్ని అధిరోహించారు. కానీ రాజకీయ వైకుంఠపాళిలో కుట్రల సర్పాలకు బలైపోయాడు. ఆ కుట్రల వెనకున్న అసలు నిజమేమిటి? వైస్రాయ్ ఉదంతానికి దారితీసిన నాటి పరిస్థితులు ఏమిటి? లక్ష్మీ పార్వతిని బూచీగా చూపిస్తూ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడానికి జరిపిన అమానవీయ దాడి వెనకున్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? వీటన్నింటిని యదర్థా కోణంలో ఆవిష్కరిస్తూ ఆగస్త్య మంజుతో కలిసి రామ్‌గోపాల్‌వర్మ ఈ చిత్రాన్ని రూపొందించాడు.

గత కొద్దికాలంగా ఉభయరాష్ర్టాల్లో సంచలనంగా మారిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఆనాటి కుట్రకోణాల్ని ఏ విధంగా బహిర్గతం చేశారు? వర్మ తెలుసుకున్న నిజాలు ఎంతవరకు తెరపై ఆవిష్కృతమయ్యాయి? ఈ విషయాలన్నీ తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే..


ఇది అందరికి తెలిసిన కథనే. 1989లో ఎన్టీఆర్ (విజయ్‌కుమార్)అధికారాన్ని కోల్పోతాడు. అంతకుముందు నుంచే భార్యవియోగ భారంతో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు చేరదీయకపోవడంతో ఒంటరితనాన్ని అనుభవిస్తుంటాడు. సరిగ్గా ఈ సమయంలోనే లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశిస్తుంది. తెలుగు సాహిత్యంలో ఎమ్‌ఫిల్ చేసిన లక్ష్మీపార్వతి...ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసే ఉద్ధేశ్యంతో ఆయనకు చేరువవుతుంది. క్రమంగా వారిద్దరి మధ్య పవిత్రమైన అనుబంధం ఏర్పడుతుంది. మరోవైపు పార్టీలో బాబు (శ్రీతేజ్) వర్గం ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి సంబంధంపై దుష్ప్రచారం మొదలుపెడతారు. ఇందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని కూడా పావులుగా వాడుకుంటారు. ఓ పత్రికాధిపతి కూడా బాబుకు తోడై ఎన్టీఆర్ మీద తప్పుడు ప్రచారం సాగిస్తాడు. ఈ అపవాదులన్నింటిని తుడిచిపెట్టాలనే ఉద్దేశ్యంతోమేజర్ చంద్రకాంత్ శతదినోత్సవ వేడుకలో తాను లక్ష్మీపార్వతిని పెళ్లాడబోతున్నట్లు ప్రకటిస్తాడు ఎన్టీఆర్. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్టీఆర్ అధికారంలోకి వస్తారు. ఆయన్ని పదవి నుంచి దించడానికి బాబు కుట్రలు మొదలుపెడతాడు. మాయమాటలతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని కూడా తనవైపుకు తిప్పుకుంటాడు.
వైస్రాయ్‌లో హోటల్‌లో జరిపిన మహాకుట్రతో సీఏం కుర్చీని హస్తగతం చేసుకుంటాడు. వైస్రాయ్‌లో తనపై చెప్పులు విసిరివేసిన పార్టీ ఎమ్మెల్యేల చర్యతో ఎన్టీఆర్ తీవ్ర మనోవేదనకు గురవుతారు. తీవ్ర సంఘర్షణతో తనువు చాలిస్తాడు. ఇదీ స్థూలంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ.

ఈ సినిమా కోసం తానెంతగానో పరిశోధన చేశానని, తటస్థ వ్యక్తుల దగ్గరి నుంచి ఎంతో సమాచారాన్ని సేకరించానని, వీటన్నింటిని క్రోడీకరించి తాను నమ్మిన నిజాల్ని సినిమాలో చూపిస్తానని ప్రకటించారు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. చెప్పినట్లుగానే నిస్సంకోచంగా ఆనాటి కుట్ర తాలూకు చీకటి కోణాల్ని బహిర్గతం చేశారు. అప్పటి వైస్రాయ్ ఘటనలో ప్రజలకు తెలిసిన నిజాలు కొన్నే ఉన్నాయి. కానీ వైస్రాయ్ ఘటనకు దారితీసిన పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో ఆవిష్కరించారు. లక్ష్మీపార్వతిని సాకుగా చూపిస్తూ అటు పార్టీని, ఇటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని బాబు ఎలా పక్కదారి పట్టించాడనే అంశాలు విస్మయం కలిగించేలా అనిపిస్తాయి. ఆనాటి కుట్ర ఉదంతంలో బాహ్య ప్రపంచానికి తెలియని అంశాల్ని దర్శకుడు వర్మ ధైర్యంగా చూపించాడు. పార్టీలో బాబు చేస్తున్న కుట్రలు, లక్ష్మీపార్వతిపై దుష్ప్రచారం తెలుసుకున్న ఎన్టీఆర్ ఓ దశలో అతణ్ణి దూరం పెడతాడు. దీంతో బాబు ఓ న్యాయమూర్తి శరణుజొచ్చి తిరిగి తనను ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడిని చేయమని కోరతాడు. ఆ సమయంలో లక్ష్మీపార్వతితో మాట్లాడిన బాబు భవిష్యత్తులో ఎలాంటి తప్పు చేయనని వేడుకుంటాడు. అలా లక్ష్మీపార్వతి అనుమతితో తిరిగి ఎన్టీఆర్‌కు చేరువైన బాబు మహాకుట్రకు ఎలా తెరదీశాడనే ఘటనలు షాకింగ్‌లా అనిపిస్తాయి.


ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి అనుబంధం..వారి పెళ్లి ప్రకటనతో ప్రథమార్థాన్ని ముగించారు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. ఫస్ట్‌హాఫ్ అంతా ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి రిలేషన్ మీదనే నడుస్తుంది. వారి మధ్య అమలిన ప్రేమను చక్కటి మెలోడీ గీతాల నేపథ్యంలో చూపించే ప్రయత్నం చేశారు. ద్వితీయార్థంలోనే అసలు కథ మొదలవుతుంది. ఎలాగైన అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్న బాబు గవర్నర్ అండతో కుట్రకు తెరతీస్తాడు.
తనకు మద్దతుగా కొద్ది మంది ఎమ్మెల్యేలే ఉన్నారని, మెజారిటీ శాసనసభ్యులు ఎన్టీఆర్ పక్షాన ఉన్నారని గ్రహించిన బాబు ఓ పత్రికాధిపతి సహకారాన్ని తీసుకుంటాడు. సదరు పత్రికాధిపతి తన పేపర్‌లో అసత్య కథనాల్ని ప్రచురిస్తూ ఎమ్మెల్యేలను పక్కదారి పట్టిస్తాడు. మెజారిటీ ఎమ్మెల్యేలు బాబువైపే ఉన్నారని నమ్మిస్తాడు. మరోవైపు వైస్రాయ్ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే శాసనసభను రద్దు చేయమని ఎన్టీఆర్‌కు ఓ కుట్రపూరితమైన సలహా ఇస్తాడు బాబుకు సన్నిహితుడైన న్యాయమూర్తి. తిరిగి ఎలక్షన్స్‌కు వెళితే మళ్లీ గెలవలేమని ఎమ్మెల్యేలు భయపడతారు. శాసనసభ రద్దు నిర్ణయం కూడా మెజారిటీ ఎమ్మెల్యేలను బాబువైపునకు తిప్పుకునేలా చేస్తుంది. ఇలా ఆనాటి వైస్రాయ్ కుట్రలో తెలియని ఎన్నో కోణాల్ని నిర్భయంగా ఆవిష్కరించాడు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.

ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని తనవైపుకు తిప్పుకోవడానికి బాబు వేసిన ఎత్తుగడలు జుగుప్సను కలిగిస్తాయి. కంటి పరీక్షకు వెళ్లిన లక్ష్మీపార్వతి గర్భనిర్ధారణకు వెళ్లిందని..ఆమెకు కొడుకు పుడితే మీ అందరి జీవితం మటాష్ అని ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురిచేస్తాడు బాబు. దీంతో ఎన్టీఆర్ కుటుంబం మొత్తం బాబు పక్షాన నిలుస్తుంది. తన వెన్నుపోటుకు బాబు ఓ పత్రికాధిపతిని, న్యాయమూర్తిని ఎలా వాడుకున్నాడన్నది విభ్రాంతిని కలిగిస్తుంది. బాబు ముఖ్యమంత్రి అవడం వల్ల తనకు ఒనగూరే ప్రయోజనాల్ని ఆశించి సదరు పత్రికాధిపతి నిస్సిగ్గుగా బాబు పక్షాన నిలుస్తాడు.

వైస్రాయ్ ఘటనలో పదవీ కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో చోటుచేసుకున్న ఘటనలు హృదయవిదారకంగా సాగాయి. పాముకు పాలు పోస్తే ఏం చేస్తుంది..తిరిగి కాటేస్తుంది వాడు అందితే కాళ్లు లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. కాళ్లు మొక్కుతూనే లాగి క్రిందకు పడేస్తాడు నేను 70ఏళ్లు రాజుగా బ్రతికాను. నేను జీవితంలో చేసిన తప్పు వాడిని నమ్మడమే.. వంటి సంభాషణలు ఉద్వేగాల్ని కలిగిస్తాయి. తనదైన శైలి టేకింగ్‌తో వర్మ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రథమార్థం కొంచెం మందగమనంతో సాగినా ఎక్కడా బోర్‌కొట్టిన భావన కలగదు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల అనుబంధాన్ని పాటల ద్వారానే అందంగా చూపించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ పాత్రలో విజయ్‌కుమార్ చక్కగా ఒదిగిపోయాడు. పాత్ర తాలూకు హావభావాల్ని, మేనరిజమ్స్‌ను అద్భుతంగా పండించాడు. ఇక లక్ష్మీపార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి తన పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేసింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన హృదయాల్ని కదిలించేలా అనిపిస్తుంది. ఇక కుళ్లు, కుతంత్రం, వంచన కలబోసిన బాబు పాత్రలో శ్రీతేజ్ చక్కటి నటనను కనబరిచాడు. సినిమా ఆద్యంతం సీరియస్‌గా అదే టెంపోను మెయిన్‌టెయిన్ చేశాడు. కల్యాణిమాలిక్ సంగీతం సినిమాను మరో మెట్టెక్కించింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చింది. కెమెరాపనితనం, నిర్మాణ విలువలు బాగున్నాయి. యథార్థ జీవిత కథల్ని తెరకెక్కించడంలో తన శైలి ప్రత్యేకమని వర్మ మరోసారి ఈ సినిమా ద్వారా నిరూపించాడు.

నాటి వైస్రాయ్ ఘటన గురించి చాలా మందికి తెలుసు. అయితే దాని వెనక బాబు సాగించిన కుట్రలు, వ్యవస్థల్ని, మనుషుల్ని తన స్వార్థ ప్రయోజనాలకు ఎలా వాడుకున్నాడన్నది చాలా మందికి తెలియదు. ఈ విషయాల్ని లక్ష్మీస్‌ఎన్టీఆర్‌లో వర్మ సాహసోపేతంగా తెరపై తీసుకొచ్చారు. ప్రజలందరూ దేవుడిలా కీర్తించబడిన ఓ మహానాయకుడు చివరకు గుప్పెడు మంది రాక్షసుల చేతిలో, ఓ నయవంచకుడి నేతృత్వంలో ఎలా మనోవేదనకు గురై తనువు చాలించాడన్నది ప్రతి ఒక్కరి హృదయాల్ని కలచివేస్తుంది.

రేటింగ్: 3.5/5

9992
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles