బిగ్ బాస్ ట్విస్ట్‌కి బిత్త‌ర‌పోయిన హౌజ్‌మేట్స్

Tue,October 15, 2019 08:16 AM

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా మూడో సీజ‌న్ జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. మ‌రో మూడు వారాల‌లో సీజన్ 3 కూడా పూర్తి కానుంది. గ‌త వారం మ‌హేష్ ఎలిమినేట్ కాగా, ప్ర‌స్తుతం హౌజ్‌లో కేవ‌లం ఏడుగురు స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే దానిపై సోమ‌వారం నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌రిగింది. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో హౌజ్‌మేట్స్ అత్యుత్సాహం చూపించ‌డంతో అంద‌రు ఈ వారం నామినేట్ అయ్యారు. ఈ సీజ‌న్‌లో హౌజ్‌మేట్స్ అంద‌రు ఇలా నామినేట్ కావ‌డం ఇదే తొలిసారి. గ‌తంలో ప‌లు వార్నింగ్‌లు ఇచ్చిన‌ప్ప‌టికి ఎప్పుడు ఇలా చేయ‌లేదు. కాని తాజాగా బిగ్ బాస్ తీసుకున్న నిర్ణ‌యానికి ఇంటి స‌భ్యులు అంద‌రు బిత్త‌ర‌పోయారు.


ఈ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ‌కి గాను టాప‌ర్స్ ఆఫ్ ది హౌజ్ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో ఏడు నెంబ‌ర్ బోర్డులు ఉంచి , ఆ నెంబ‌ర్ బోర్డ్ ఎవ‌రికి క‌రెక్ట్‌గా స‌రిపోతుందో తేల్చుకోవాల‌ని చెప్పారు. అయితే ర్యాంకింగ్‌ని గార్డెన్ ఏరియాలోని బౌల్‌లో ఉన్న చిట్స్ ఆధారంగా నిర్ణ‌యింప‌బ‌డుతుంది. ఎవ‌రికి ఏ ర్యాంక్ వ‌స్తే ఆ బోర్డ్ దగ్గ‌ర నిలుచోవ‌ల‌సి ఉంటుంది. ఆ ర్యాంక్ త‌మ‌కి సూట్ కాలేద‌ని అనిపిస్తే దానికి గ‌ల కార‌ణం వివ‌రించి న‌చ్చిన ర్యాంక్‌ని ఎంపిక చేసుకోవచ్చు. చివ‌రి నాలుగు స్థాన‌ల‌లో ఉన్న న‌లుగురు ఈ వారం నామినేట్ అవుతార‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు.

నామినేషన్ ప్ర‌క్రియ మొద‌లు కాగా, మొద‌టి నెంబ‌ర్ స్థానంలో బాబా భాస్క‌ర్, రెండులో రాహుల్‌, మూడులో వ‌రుణ్‌, నాలుగులో అలీ రెజా, ఐదులో శివ‌జ్యోతి, ఆరులో వితికా, ఏడులో శ్రీముఖి చిట్టీల ఆధారంగా నిలుచున్నారు. చర్చ మొద‌లు పెట్టి త‌మ‌కి ఏ స్థానం కావాలో వారు నిర్ణ‌యించుకోవ‌చ్చు అని బిగ్ బాస్ చెప్ప‌డంతో ముందుగా వితికా త‌నకి మొద‌టి నెంబ‌ర్ స్థానం కావాల‌ని కోరింది. అందుకు బాబా అంగీక‌రించలేదు. రెండులో ఉన్న రాహుల్‌ని కూడా వితికా అడ‌గ‌గా, ఆయ‌న అందుకు ఒప్పుకోలేదు. అలానే వ‌రుణ్ కూడా ముందు నో అని చెప్పాడు. దీంతో ఈ విష‌యంపై త‌ర్వాత చ‌ర్చ చేస్తాన‌ని వితికా త‌న స్థానానికి వెళ్లింది.

త‌ర్వాత శివ‌జ్యోతి ఇంటి స‌భ్యుల‌తో త‌న చ‌ర్చ మొద‌లు పెట్ట‌గా మొద‌టి మూడు ర్యాంకుల‌లో ఏదో ఒక స్థానాన్ని నాకు ఇవ్వాల‌ని, అందుకు నేను అర్హురాలిని అని పేర్కొంది. దీనికి ఎవ‌రు ఒప్పుకోక‌పోవ‌డంతో తిరిగి త‌న స్థానానికి వెళ్లింది శివ‌జ్యోతి. అయితే మ‌ర‌లా వ‌చ్చిన వితికాకి వ‌రుణ్ సందేశ్ మూడో స్థానాన్ని క‌ట్ట‌బెట్టి త‌ను ఆరో స్థానానికి వెళ్లాడు. త‌ను అడిగిన‌ప్పుడు ఇవ్వ‌ని మూడో ర్యాంక్ వితికాకి ఎలా ఇచ్చావు అని వ‌రుణ్‌తో వాగ్వాదానికి దిగింది శివ‌జ్యోతి. త‌ను నా భార్య కాబ‌ట్టి ఇచ్చాను అని వ‌రుణ్ చెప్ప‌డంతో శివ‌జ్యోతి వ‌రుణ్‌, వితికాల‌కి ఫుల్‌గా క్లాస్ పీకింది. త‌ను మూడో స్థానంలోనే ఉంటాన‌ని ప‌ట్టుబ‌ట్టి కూర్చోవ‌డంతో వితికా, శివ‌జ్యోతిలు మూడో ర్యాంక్‌కి ప‌రిమిత‌మయ్యారు.

ఇక శ్రీముఖి ముందుగా రాహుల్‌తో చ‌ర్చ జ‌ర‌ప‌గా, వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ వైరానికి దారి తీసింది. ముందు నుండే వీరిద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. అలాంటిది నువ్వు ఏ విష‌యంలో నాక‌న్నా బాగా ఆడావు అని శ్రీముఖి రాహుల్ ని డైరెక్ట్‌గా అడ‌గ‌డంతో రాహుల్ త‌న ర్యాంక్‌ని ఇచ్చేందుకు ఏ మాత్రం ఆస‌క్తి చూప‌లేదు. కొద్ది సేప‌టి వ‌ర‌కు వీరిద్ద‌రి మ‌ధ్య భీక‌ర పోట్లాట జ‌రిగింది. అయితే ఇంటి స‌భ్యుల మ‌ధ్య స‌రైన చ‌ర్చ జ‌ర‌గని కార‌ణంగా ఈ వారం ఇంటి స‌భ్యులు అంద‌రు నామినేట్ అవుతార‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు. దీంతో అంద‌రు అవాక్క‌య్యారు. ఏడుగురు స‌భ్యుల‌లో ఒక‌రు లేదా ఇద్ద‌రు ఈ వారం ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది.

7858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles