కేసీఆర్‌, కేటీఆర్‌పై ప్రశంస‌లు కురిపించిన మంచు విష్ణు

Fri,April 26, 2019 10:34 AM
manchu vishnu praise kcr and ktr

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో చోటు చేసుకున్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై నటుడు మంచు విష్ణు స్పందించారు. అలానే సినిమా వాళ్ళు కేసీఆర్‌కి భ‌య‌ప‌డి కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ప‌ల్లెత్తు మాట కూడా అన‌డం లేద‌ని కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్న నేప‌థ్యంలో మంచు విష్ణు ట్విట్ట‌ర్ ద్వారా ఘాటుగా సమాధానం ఇచ్చారు. త‌ప్పిదాల కార‌ణంగా 20 మంది సోద‌రులు, సోద‌రీమ‌ణుల‌ని కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. వారి కుటుంబాల‌కి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను. ఇలాంటి హేయ‌మైన చ‌ర్య‌పై ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోయి ఉంటే క‌చ్చితంగా విమ‌ర్శ‌లు చేయ‌వ‌చ్చ‌ని నేను బ‌లంగా న‌మ్ముతున్నాను.

మ‌నం ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాం. కేటీఆర్ చాలా చురుకైన వ్య‌క్తి. విద్యార్ధుల కోసం ప‌నిచేసే పొలిటీషియ‌న్. కేసీఆర్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. ఆయ‌న ఫ్రైర్ బ్రాండ్‌. కాని డిక్టేట‌ర్ కాదు. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని నిందించ‌డానికి ముందు అస‌లు ఈ తప్పిదం వెనుక ఉన్న కార‌ణం ఏంటో గుర్తించాల‌ని నేను కోరుతున్నాను. ఇక కొంద‌రు సినిమా వాళ్ళు కేసీఆర్‌కి భ‌య‌ప‌డే ఈ విష‌యంపై మాట్లాడడం లేద‌ని అంటున్నారు. ఆ జ‌నాల‌కి గొప్ప ఊహాజ‌నిత శ‌క్తి ఉంద‌ని నాకు తెలుస్తుంది. కాని ఇందులో నిజం లేదు. త‌ప్పిదాలు జ‌ర‌గ‌డానికి ముందు కార‌ణాలు అన్వేషించాలి. దీని వ‌ల‌న భ‌విష్య‌త్‌లో మ‌ళ్ళీ ఇలాంటి ఘోరాలు జ‌ర‌గ‌కుండా నిరోధించ‌వ్చు అని విష్ణు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రీసెంట్‌గా అధికారులను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని , ఇప్పటికే రీ వెరిఫికేషన్, కౌంటింగ్‌కు దరఖాస్తు చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లించనున్నట్లు ఇంట‌ర్మీడియెట్ బోర్డు పేర్కొంది.3891
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles