'మీకు మాత్రమే చెప్తా' రివ్యూ

Fri,November 1, 2019 01:09 PM

రివ్యూ: మీకు మాత్రమే చెప్తా
తారాగణం: తరుణ్‌భాస్కర్, అభినవ్ గోమఠం, వాణిభోజన్, పావని గంగిరెడ్డి, అనసూయ భరద్వాజ్, నవీన్‌జార్జ్‌థామస్, అవంతిక మిశ్రా తదితరులు..
సినిమాటోగ్రఫీ: మదన్‌గుణదేవా
సంగీతం: శివకుమార్
ఆర్ట్: రాజ్‌కుమార్
నిర్మాతలు: విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ
రచన-దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్


తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా యువతలో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఆయన తొలిసారిగా సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెడుతూ కింగ్ ఆఫ్ ది హిల్స్ పతాకంపై మీకు మాత్రమే చెప్తా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా దర్శకుడు తరుణ్‌భాస్కర్ హీరోగా పరిచయమయ్యారు. ఔత్సాహిక ప్రతిభావంతుల్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో తాను స్వీయ నిర్మాణ సంస్థను స్థాపించానని, రెమ్యునరేషన్స్ ద్వారా ఆర్జించిన డబ్బుల్లో పెద్ద మొత్తాన్ని ఈ సినిమాకే వెచ్చించానని విజయ్ దేవరకొండ ప్రచార సందర్భాల్లో చెప్పడంతో ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. విజయ్‌దేవరకొండ నిర్మాణంలో తొలిసారిగా వస్తున్న ఈ సినిమా ట్రేడ్ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది? నిర్మాతగా విజయ్ దేవరకొండ తొలి ప్రయత్నం ఫలించిందా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే...

కథేమిటంటే..

రాకేష్ (తరుణ్‌భాస్కర్) ఓ ఛానల్‌లో వీడియో జాకీగా పనిచేస్తుంటారు. ఓ హాస్పిటల్‌లో పరిచయమైన డాక్టర్ స్టెఫీ (వాణీ భోజన్) ప్రేమలో పడతాడు. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లికి సిద్ధపడతారు. కాబోయే భర్త రాకేష్‌కు ఎలాంటి దురలవాట్లు ఉండొద్దని, వ్యక్తిగత విషయాలు ఏమీ దాచకుండా అన్నీ నిజాలే చెప్పాలని కోరుకుంటుంది స్టెఫీ. అయితే పెళ్లికి సిద్ధమయ్యే తరుణంలో రాకేష్ ఓ సినిమా కోసం నటించిన శోభనం వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతుంది. ఈ విషయం స్టెఫీకి తెలిస్తే తనను తిరస్కరిస్తుందేమోనని భయపడతాడు రాకేష్. మిత్రుడు కామేష్ (అభినవ్ గోమఠం) సహకారంతో ఓ హ్యాకర్‌ను సంప్రదించి సదరు వీడియోను ఆన్‌లైన్ నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో రాకేష్, కామేష్‌కు ఎదురైన పరిస్థితులు ఏమిటి? స్టెఫీని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి చివరకు రాకేష్ ఏం చేశాడు? ఇద్దరి మిత్రుల కథలో చివరలో మలుపేమిటి? అనే విషయాల్ని తెరపైన చూడాల్సిందే..

ఎలా ఉందంటే..

ప్రతి ఒక్కరి జీవితంలో గోప్యంగా ఉంచాల్సిన విషయాలుంటాయి. నేటి మొబైల్ యుగంలో ఎలాంటి వీడియో అయిన ఇట్టే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమై చిక్కులు తెచ్చిపెడుతుంటుంది. ఈ పాయింట్‌ను ఆధారంగా చేసుకొని వినోదాల కలబోతగా దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. అన్నీ నిజాలే మాట్లాడాలని కోరుకునే అమ్మాయికి, ప్రతి సందర్భంలో అనుకోకుండా అబద్ధాలు చెప్పాల్సి వచ్చే అబ్బాయి మధ్య జరిగే డ్రామా ఇది. ఒక చిన్న వీడియో పెళ్లికి ముందు ఎన్ని తంటాలు తెచ్చిపెట్టిందనే అంశాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు.

ప్రథమార్థంలో మంచి కామెడీ పండింది. వీడియోను తొలగించడానికి ఇద్దరు మిత్రులు రాకేష్, కామేష్ ప్రయత్నాలు ప్రారంభించడం, ఓ హ్యాకర్ సహాయంతో సమస్య నుంచి గట్టెక్కడానికి చేసే ప్రయత్నాలు నవ్వుల్ని పంచాయి. కామెడీ ఆఫ్ ఎర్రర్స్‌తో ఫస్ట్‌హాఫ్ అంతా సరదాగా సాగిపోయింది. ముఖ్యంగా రాకేష్, కామేష్ మధ్య నడిచే డ్రామా మంచి వినోదాన్ని పంచింది. ద్వితీయార్థంలో కథాగమనం మలుపులతో సాగింది. అప్పటివరకు కామేష్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సాగుతున్న కథలో ఒక్కసారిగా ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. సంయుక్త (అనసూయ) పాత్ర తాలూకు సస్పెన్స్‌ను ైక్లెమాక్స్‌లో రివీల్ చేయడం ఉత్కంఠను పంచింది.

ప్రథమార్థాన్ని ఆద్యంతం చక్కటి వినోద సన్నివేశాలతో అల్లుకున్న దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త తడబడినట్లు కనిపించింది. వినోదాన్ని పక్కనపెట్టి కథలోని ట్విస్ట్‌లను రివీల్ చేయడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. టూ అండ్ ఫ్రో స్క్రీన్‌ప్లేతో కథను చెప్పే ప్రయత్నం చేశారు. ైక్లెమాక్స్ ఘట్టాల్ని ఊహించిన విధంగానే ముగించారు. సెకండాఫ్ స్టోరీ ట్రీట్‌మెంట్ విషయంలో మరింత శ్రద్ధ పెడితే బాగుండేది. వ్యంగ్యంతో కూడిన సంభాషణలతో ఆద్యందం వినోదాన్ని పండించడానికి చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే...

మహానటి,ఫ‌ల‌క్‌నుమా దాస్‌ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు తరుణ్‌భాస్కర్. హీరోగా ఆయనకిది తొలి చిత్రం. డైలాగ్ డెలివరీలో అద్భుతమైన టైమింగ్, సన్నివేశాలకు అనుగుణంగా చక్కటి హావభావాలతో తరుణ్‌భాస్కర్ తన పాత్రను రక్తికట్టించారు. ఆయన స్క్రీన్‌ప్రజెన్స్ కూడా బాగుంది. పూర్తిస్థాయి కథానాయకుడి పాత్రలో కూడా రాణిస్తాడనే నమ్మకాన్ని కలిగించాడు. ఇక ఈ సినిమాలో కామేష్ పాత్రలో కనిపించిన అభినవ్ గోమఠం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. సినిమాలోని వినోదభారాన్ని మొత్తం తన భుజాలపై మోసాడు అభినవ్ గోమఠం. చక్కటి పంచ్‌లతో కూడిన డైలాగ్స్, తనదైన బాడీలాంగ్వేజ్‌తో నవ్వుల్ని పండించాడు. కథానాయిక వాణీభోజన్ అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్రలో అభినయానికి ఎక్కువగా ఆస్కారం దక్కలేదు. అనసూయ పాత్ర చిన్నదే అయినా కథాగమనంలో కీలకంగా అనిపించింది. మిగతా పాత్రధారులు పరిధుల మేరకు నటించారు.

కథకు అవసరమైన మేరకు తెరపై నిర్మాణ విలువలు కనిపించాయి. నిర్మాతగా సినిమా నాణ్యత విషయంలో విజయ్ దేవరకొండ తీసుకున్న శ్రద్ధ తెరపై కనిపించింది. మదన్‌గుణదేవా ఛాయాగ్రహణం బాగుంది. శివకుమార్ సంగీతం ఫర్వాలేదనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. ప్రథమార్థంలో చక్కటి వినోదాన్ని ఆవిష్కరించడంలో దర్శకుడు షమ్మీర్‌సుల్తాన్ పనితనం కనిపించింది. అయితే ద్వితీయార్థంలో కథాగమనం పట్టుతప్పింది. కథను కన్విన్సింగ్‌గా ముగించే విషయంలో శ్రద్ధ తీసుకోలేదనిపించింది. తరుణ్‌భాస్కర్‌తో కలిసి షమ్మీర్ రాసిన సంభాషణలు బాగున్నాయి. మంచి వినోదాన్ని అందించాయి.

ఈ కథలో అంతగా కొత్తదనం ఏమీలేనప్పటికీ కామెడీ ప్రధానంగా నడిపించే ప్రయత్నం చేశారు. మల్టీఫ్లెక్స్ ఆడియెన్స్‌ను మెప్పించే అంశాలున్న చిత్రమిది. బీసీ సెంటర్లలో ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో, బాక్సాఫీస్ ఫలితం ఏమిటో తెలుసుకోవాలంటే మాత్రం కొద్దిరోజులు వేచిచూడాల్సిందే..

రేటింగ్ : 2.75/5

7029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles